Saturday, November 16, 2024

భారత్ క్లీన్ స్వీప్..

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: న్యూజిలాండ్‌తో జరిగిన టి20 సిరీస్‌లో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌లో వేదికగా ఆదివారం చివరి మ్యాచ్‌లో అన్ని రంగాల్లో రాణించి 77 పరుగుల భారీ ఆధిక్యతతో విజయం సాధించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా బ్యాట్స్‌మన్ రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి అర్ధ సెంచరీ(56పరుగులు)తో చెలరేగి పోయాడు. 185 పరుగుల విజయ లక్షంతో బరిలోకి దిగిన కివీస్ 17.2 ఓవర్లలో 111 పరుగులకే ఆలవుట్ అయింది. కివీస్ ఇన్నింగ్స్ ఆదినుంచీ తడబడుతూనే సాగింది. అక్షర్ పటేల్ తన తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు తీసి న్యూజిలాండ్‌ను చావుదెబ్బ తీశాడు. 26 పరుగుల వద్ద ఓపెనర్ డరెల్ మిచెల్(5) అక్షర్ పటేల్ బౌలింగ్‌లో హర్షల్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.ఆ తర్వాత మార్క్ చాప్‌మన్ డకౌట్ అయ్యాడు. మరో ఓనెనర్ మార్టిన్ గుప్టిల్ 36 బంతుల్లో 51 పరుగులు చేసినప్పటికీ జట్టును విచయ తీరాలకు చేర్చలేక పోయాడు.గుఫ్టిల్ ఔటయిన తర్వాత కూడా కివీస్ వరసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. సీఫర్డ్(17), ఫెర్గూసన్(14) మినహా మరెవ్వరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ కేవలం 9 పరుగులిచ్చి 3 వికెట్లు తీయడం ద్వారా కివీస్ వెన్ను విరిచాడు. హర్షల్ పటేల్ 2, చాహల్,వెంకటేశ్ అయ్యర్,దీపక్ చాహర్ తలా ఒక్కో వికెట్ పడగొట్టారు.
రోహిత్ అర్ధ సెంచరీ
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ మరో సారి అర్ధ శతకంతో చెలరేగగా, కెఎల్ రాహుల్ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, చివర్లో హర్షల్ పటేల్, దీపక్ చాహర్‌లు కూడా రాణించడంతో భారత్ న్యూజిలాండ్ ముందు భారీ లక్షాన్ని ఉంచింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్‌లు ఆదినుంచి ధాటిగా ఆడడంతో స్కోరు బోర్డు పరుగులు తీసింది. ఇషాన్ కిషన్ బౌండరీలే లక్షంగా బ్యాట్ చేశాడు. ఆరు బౌండరీల సాయంతో 29 పరుగులు చేశాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 68 పరుగులు జోడించిన తర్వాత శాంట్నర్ ఈ జోడీని విడదీశాడు. ఇషాన్ కిషన్ ఔటయిన తర్వాత వచ్చిన సూర్యకుమార్(0), రిషబ్ పంత్(4)లు కూడా వెంటవెంటనే ఔటవడంతో పరుగులు వేగం మందగించింది. ఈ మూడు వికెట్లు కూడా శాంట్నర్‌కే దక్కడం గమనార్హం. వీరి తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్(25)తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే టి20 కెరీర్‌లో 26వ అర్ధ శతకం నమోదు చేశాడు. రోహిత్ ఔటయిన తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన వెంకటేశ్ అయ్యర్(20) వేగంగా పరుగులు చేశాడు. అయితే శ్రేయస్, వెంకటేశ్‌లు వెంటవెంటనే పెవిలియన్‌కు చేరారు. చివర్లో హర్షల్ పటేల్ (రెండు ఫోర్లు, ఒక సిక్స్‌తో 18 పరుగులు, దీపక్ చాహర్ (2ఫోర్లు, ఒక సిక్స్‌తో 21 పరుగులు నాటౌట్) ధాటిగా ఆడడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో శాంట్నర్ 3, ట్రెంట్ బౌల్ట్ , మిల్నే, ఫెర్గూసన్, సోధీ తలా ఒక వికెట్ తీశారు.

IND beat NZ by 77 Runs in 3rd T20

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News