Friday, November 22, 2024

గులాబి సమరానికి సర్వం సిద్ధం

- Advertisement -
- Advertisement -

గులాబి సమరానికి సర్వం సిద్ధం
ఆత్మవిశ్వాసంతో భారత్, గెలుపు కోసం ఇంగ్లండ్

నేటి నుంచి మొతెరాలో డేనైట్ టెస్టు మ్యాచ్

అహ్మదాబాద్: అభిమానులు ఎంతో అతృతతో ఎదురు చూస్తున్న సమయం రానే ఉంచింది. అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో ఇంగ్లండ్-‌భారత్ జట్ల మధ్య డేనైట్ టెస్టు సమరానికి బుధవారం తెరలేవనుంది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య ఈ టెస్టు మ్యాచ్ జరగనుంది. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంగా అవతరిస్తున్న మొతెరా మైదానం ఈ చారిత్రక సమరానికి సర్వం సిద్ధమైంది. ఇక సిరీస్‌లో ఇరు జట్లు 11తో సమంగా నిలిచాయి. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలవగా రెండో టెస్టులో భారత్ విజయం సాధించింది. దీంతో మూడో టెస్టు రెండు జట్లకు కీలకంగా మారింది. ఇందులో గెలిచి సిరీస్‌లో పైచేయి సాధించాలనే పట్టుదలతో ఇరు జట్లు ఉన్నాయి. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. ఈ పరిస్థితుల్లో మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయం. ఇక ఈ మ్యాచ్ భారత వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మకు చాలా ప్రత్యేకమైంది. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగితే వందో టెస్టు ఆడిన రెండో ఫాస్ట్ బౌలర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ఇప్పటి వరకు కపిల్‌దేవ్ మాత్రమే భారత్ తరఫున వందకుపైగా టెస్టు మ్యాచ్‌లు ఆడిన భారత ఫాస్ట్ బౌలర్ ఘనతను దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్ ద్వారా ఇషాంత్ ఈ రికార్డును తన పేరిట లిఖించుకునే అవకాశం ఉంది. దీంతో పాటు భారత కెప్టెన్ విరాట్ కోహ్లి, స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్‌లకు కూడా పలు రికార్డులు ఊరిస్తున్నాయి. ఇటు ఇంగ్లండ్ అటు భారత్ విజయమే లక్షంగా పెట్టుకోవడంతో మ్యాచ్ ఆసక్తికరగా సాగడం ఖాయం. ఇదిలావుండగా ఈ మ్యాచ్ ద్వారా మొతెరా స్టేడియం రెండో అంతర్జాతీయ ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టనుంది. వందలాది కోట్ల రూపాయల వ్యయంతో అధునాతన సౌకర్యాలతో కూడిన స్టేడియాన్ని ఇక్కడ నిర్మించారు. ఈ మ్యాచ్ ద్వారా మొతెరా స్టేడియం ప్రపంచ క్రికెట్‌లో తనదైన ముద్ర వేయనుంది. ఇప్పటి వరకు ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంగా పేరున్న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌ను వెనక్కినెట్టి మొతెరా ఆ స్థానాన్ని అధిరోహించనుంది.
ఓపెనర్లే కీలకం
ఇక ఈ మ్యాచ్‌లో భారత్‌కు ఓపెనర్లు కీలకంగా మారారు. కిందటి మ్యాచ్‌లో రోహిత్ శర్మ శతకంతో కదం తొక్కాడు. ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నాడు. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి జట్టుకు శుభారంభం అందించాలని రోహిత్ తహతహలాడుతున్నాడు. రోహిత్ విజృంభిస్తే భారత్ మెరుగైన ఆరంభం ఖాయమనే చెప్పాలి. ఈ మ్యాచ్‌లో రాణించడం ద్వారా జట్టులో స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవాలనే పట్టుదలతో రోహిత్, గిల్‌లు ఉన్నారు. మరోవైపు మిస్టర్ డిపెండబుల్ చటేశ్వర్ పుజారా కూడా జట్టుకు కీలకంగా తయారయ్యాడు. రెండో మ్యాచ్‌లో పుజారా తొలి ఇన్నింగ్స్‌లో బాగానే ఆడాడు. ఈసారి మరింత మెరుగ్గా ఆడాల్సిన అవసరం ఎంతైన ఉంది. సొంత గడ్డపై మ్యాచ్ జరుగుతుండడంతో పుజారాకు ఈ డేనైట్ మ్యాచ్ కీలకంగా మారింది. కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా తన బ్యాట్‌కు పని చెప్పక తప్పదు. చాలా రోజులుగా శతకం కోసం ఎదురు చూస్తున్న కోహ్లి ఈ మ్యాచ్‌లో ఆ లోటు పూడ్చకోవాలని భావిస్తున్నాడు. కోహ్లి తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే టీమిండియాకు భారీ స్కోరు సాధించడం పెద్ద కష్టం కాదు. ఇక వైస్ కెప్టెన్ అజింక్య రహానెపై కూడా జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. రహానె కూడా మెరుగైన బ్యాటింగ్ కనబరచాలనే పట్టుదలతో ఉన్నాడు. పుజారా, రహానె, కోహ్లిలు తమవంతు పాత్ర పోషిస్తే గులాబీ టెస్టులో పైచేయి సాధించడం భారత్‌కు పెద్ద ఇబ్బందేమి కాదనే చెప్పాలి. అంతేగాక రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్‌లు కూడా జోరుమీదున్నారు. కిందటి మ్యాచ్‌లో అశ్విన్ అద్భుత ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టాడు. ఇటు బంతితో అటు బ్యాట్‌తో అశ్విన్ చెలరేగి పోయాడు. ఈసారి కూడా జట్టు అతని నుంచి ఇలాంటి ప్రదర్శనే ఆశిస్తోంది. రిషబ్ పంత్ ఫామ్‌లో ఉండడం భారత్‌కు మరింత ఊరటనిచ్చే అంశమే. పంత్ సుడిగాలి బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా అలాంటి జోరును కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నాడు.
జోరుమీదున్న బౌలర్లు
మరోవైపు బౌలింగ్‌లో కూడా టీమిండియా మెరుగ్గానే కనిపిస్తోంది. ఎప్పటిలాగే రవిచంద్రన్ అశ్విన్ జట్టుకు ప్రధాన అస్త్రంగా మారాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన అశ్విన్ చెలరేగిపోతే ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌కు ఈసారి కూడా ఇబ్బందులు తప్పక పోవచ్చు. ఈ మ్యాచ్‌లో ఉమేశ్ యాదవ్‌కు తుది జట్టులో స్థానం ఖాయంగా కనిపిస్తోంది. రెండో స్పిన్నర్‌గా అక్షర్ పటేల్‌కు చోటు ఖాయమనే చెప్పాలి. హైదరాబాది సిరాజ్‌కు ఈసారి తుది జట్టులో స్థానం కష్టంగా మారింది. అతని స్థానంలో ఉమేశ్ బరిలోకి దిగే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఇక ప్రత్యేకమైన మ్యాచ్‌ను మరింత తీపి జ్ఞాపకంగా మార్చుకోవాలనే పట్టుదలతో సీనియర్ బౌలర్ ఇషాంత్ ఉన్నాడు.
భారీ ఆశలతో రూట్ సేన..
ఇంగ్లండ్ కూడా భారీ ఆశలతో మ్యాచ్‌కు సిద్ధమైంది. రెండో మ్యాచ్‌లో ఓడినా ఆ జట్టును తక్కువ అంచన వేయలేం. కెప్టెన్ జో రూట్ ఈసారి కూడా జట్టుకు కీలకంగా మారాడు. తొలి టెస్టులో రూట్ అసాధారణ బ్యాటింగ్‌ను కనబరిచాడు. రెండో టెస్టులో మాత్రం విఫలమయ్యాడు. కానీ గులాబీ బంతితో జరిగే టెస్టులో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. రోరి బర్న్, బెన్‌స్టోక్స్, డామ్ సిబ్లి, జోస్ బట్లర్ తదితరులతో ఇంగ్లండ్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక జోఫ్రా ఆర్చర్, జాక్ లీచ్, అండర్సన్‌లతో బౌలింగ్ కూడా చాలా పటిష్టంగా కనిపిస్తోంది. దీంతో ఇంగ్లండ్‌ను ఏమాత్రం నిర్లక్షం చేసిన భారత్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

IND v ENG 3rd Test on tomorrow at Motera Stadium

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News