Sunday, January 19, 2025

ఆత్మవిశ్వాసంతో భారత్

- Advertisement -
- Advertisement -

నేడు అఫ్గాన్‌తో పోరు

న్యూఢిల్లీ : ప్రపంచ కప్‌లో భాగంగా బుధవారం అఫ్గానిస్థాన్‌తో జరిగే పోరుకు ఆతిథ్య టీమిండి యా ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో చెమటోడ్చి నెగ్గిన భారత్ ఈసారి మాత్రం అలవోక విజయాన్ని అందుకోవాలని భావిస్తోంది. ఇక బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ లో ఓటమి పాలైన అఫ్గాన్‌కు ఈ మ్యాచ్ సవాల్‌గా మారింది. బలమైన భారత్‌ను ఓడించాలంటే అఫ్గాన్ అసాధారణ ఆటను కనబరచక తప్పదు. అఫ్గాన్‌తో పోల్చితే టీమిండియా చాలా పటిష్టంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు.

రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్య ర్, కెఎల్ రాహుల్, జడేజా, హార్దిక్,అశ్విన్ వంటి మ్యాచ్ విన్నర్ బ్యాటర్లు జట్టులో ఉన్నారు. అయి తే ఆస్ట్రేలియా మ్యాచ్‌లో రోహిత్, ఇషాన్, అయ్యర్‌లు ఘోరంగా విఫలమయ్యారు. ఇది జట్టును కలవరానికి గురిచేస్తోంది. ఈ మ్యాచ్‌లోనైనా వీరు మెరుగైన బ్యాటింగ్ కనబరచాల్సిన అవసరం ఉంది. రోహిత్, ఇషాన్‌లు జట్టుకు చాలా కీలకంగా మారారు. పటిష్టమైన బౌలింగ్ లైనప్ కలిగిన అఫ్గాన్‌పై వీరు చెలరేగాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక కిందటి మ్యాచ్‌లో అసాధారణ బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్న సీనియర్లు విరాట్ కోహ్లి, రాహుల్‌లు ఈసారి కూడా జట్టుకు చాలా కీలకంగా మారారు. ఇద్దరు ఆస్ట్రేలియా బౌలర్లను దీటుగా ఎదుర్కొని జట్టును కష్టాల్లో నుంచి గట్టెక్కించారు. ఈ మ్యాచ్‌లో కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. రాహుల్, కోహ్లిలు ఫామ్‌లో ఉండడం కూడా భారత్‌కు అతి పెద్ద ఊరటగా చెప్పాలి. ఇద్దరిలో ఏ ఒక్కరూ రాణించినా జట్టుకు భారీ స్కోరు ఖాయం. హార్దిక్, అయ్యర్, అశ్విన్, జడేజాలు కూడా బ్యాట్‌ను ఝులిపించాల్సి ఉంటుంది.

జోరుమీదున్న బౌలర్లు..

మరోవైపు భారత బౌలర్లు జోరుమీదున్నారు. బుమ్రా, సిరాజ్, జడేజా, అశ్విన్ తదితరులు తొలి మ్యాచ్‌లో అద్భుతంగా రాణించారు. ఆస్ట్రేలియా వంటి బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన జట్టును తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో వీరు సఫలమయ్యారు. ఈసారి కూడా బౌలర్లపై జట్టు భారీ అంచనాలను పెట్టుకుంది. బౌలర్లు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే అఫ్గాన్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడం భారత్‌కు పెద్ద కష్టమేమీ కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తక్కువ అంచనా వేయలేం..

ఇక అఫ్గానిస్థాన్‌ను కూడా తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అఫ్గాన్ సమతూకంగా ఉంది. ముజీబుర్ రహ్మాద్, రషీద్ ఖాన్, రహెమత్‌షా, గుర్బాజ్, మహ్మద్ నబి, నజ్ముల్లా జర్దాన్ తదితరులతో అఫ్గాన్ బలంగా కనిసిస్తోంది. దీనికి అఫ్గాన్ కీలక ఆటగాళ్లకు ఐపిఎల్‌తో సహా వివిధ లీగ్‌లలో ఆడిన అనుభవం ఉంది. ఇది కూడా వారికి సానుకూల పరిణామమే. అయితే సొంత గడ్డపై భారత్ వంటి పటిష్టమైన జట్టును ఓడించడం మాత్రం అఫ్గాన్‌కు చాలా కష్టంతో కూడుకున్న అంశంగానే చెప్పాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News