మొహాలీ: సొంత గడ్డపై జరిగే వన్డే ప్రపంచకప్‌నకు సన్నాహకంగా భావిస్తున్న ఆస్ట్రేలియా సిరీస్‌కు టీమిండియా ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగనుంది. శుక్రవారం మొహాలీ వేదికగా తొలి వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌కు కెఎల్ రాహుల్ సారథ్యం వహిస్తున్నాడు. రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య, మాజీ సారథి విరాట్ కోహ్లి తదితరులు తొలి రెండు వన్డేలకు అందుబాటులో ఉండడం లేదు. వీరికి విశ్రాంతి ఇచ్చి యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించారు. ఇక చాలా రోజుల తర్వాత సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ వన్డే టీమ్‌లోకి వచ్చాడు. ఈ సిరీస్‌లో అందరి దృష్టి అతనిపైనే నిలిచింది. అక్షర్ పటేల్ గాయపడడంతో అశ్విన్‌కు ఛాన్స్ దక్కింది. మరోవైపు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే పట్టుదలతో అశ్విన్ ఉన్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన అశ్విన్ ఈ సిరీస్‌లో జట్టుకు కీలకంగా మారాడు. కెప్టెన్ రాహుల్‌కు కూడా సిరీస్ కీలకమేనని చెప్పాలి. ఒక దశలో జట్టులో స్థానమే కష్టంగా మారిన రాహుల్ వరల్డ్‌కప్ టీమ్‌లో స్థానం సంపాదించడం విశేషం. తాజాగా ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టుతో జరిగే సిరీస్‌లో సారథ్యం వహించే అవకాశం కూడా అతనికి దక్కింది. రాహుల్ కూడా తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాలనే లక్షంతో ఉన్నాడు. ఆసియాకప్‌లో అతను బాగానే ఆడాడు. ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తున్నాడు.
గిల్‌పైనే ఆశలు..
మరోవైపు ఆసియాకప్‌లో అదరగొట్టిన యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఈ సిరీస్‌లో జట్టుకు కీలకంగా మారాడు. కొన్ని రోజులుగా గిల్ మూడు ఫార్మాట్‌లలోనూ నిలకడైన ఆటను కనబరుస్తున్నాడు. ఆసియాకప్‌లో కూడా అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగి పోయాడు. ఈ సిరీస్‌లో కూడా సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నాడు. రోహిత్, కోహ్లి వంటి స్టార్లు దూరంగా సమయంలో గిల్ బాధ్యత మరింత పెరిగింది. ఇషాన్ కిషన్‌తో కలిసి అతను ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. ఇక ఇషాన్ కూడా సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు.
సూర్యకు సవాల్..
ఇక వన్డేల్లో వరుస వైఫల్యాలు చవిచూస్తున్న సూర్యకుమార్ యాదవ్‌కు ఆస్ట్రేలియా సిరీస్ సవాల్‌గా మారింది. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన పరిస్థితి అతనికి నెలకొంది. కొంతకాలంగా సూర్య వరుసగా విఫల మవుతున్నాడు. అయినా అతనికి సెలెక్టర్లు తరచూ అవకాశాలు కల్పిస్తూనే ఉన్నారు. అయితే అతను మాత్రం వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నాడు. రానున్న వరల్డ్‌కప్ నేపథ్యంలో మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచాల్సిన ఒత్తిడి సూర్యపై ఉంది. ఇందులో అతను ఎంతవరకు సఫలం అవుతాడనే దానిపైనే అతని వన్డే భవితవ్యం ఆధారపడి ఉంటుంది. శ్రేయస్ అయ్యర్‌కు కూడా సిరీస్ కీలకంగా మారింది.
చాలా రోజులుగా అయ్యర్ గాయాలతో సతమతమవుతున్నాడు. ఆసియాకప్‌లో కూడా అతను జట్టుకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇక మ్యాచ్ ఆరంభానికి ముందు పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తేనే అతనికి తుది జట్టులో ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. ఒకవేళ ఫిట్‌నెస్‌తో లేకుంటే తెలుగు కుర్రాడు తిలక్‌వర్మకు తుది జట్టులో చోటు ఖాయం. కాగా, సిరాజ్, షమి, శార్దూల్, అశ్విన్, జడేజా, బుమ్రా తదితరులతో భారత బౌలింగ్ చాలా బలంగా ఉంది. ఆసియాకప్ ఫైనల్లో సిరాజ్ చారిత్రక బౌలింగ్‌తో అలరించిన విషయం తెలిసిందే. ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. సుదీర్ఘ కాలం తర్వాత వన్డేల్లో చోటు సంపాదించిన అశ్విన్ కూడా సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. ఇలా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా కనిపిస్తున్న భారత్ విజయమే లక్షంగా బరిలోకి దిగుతోంది.
ఫేవరెట్‌గా కంగూరూలు..
పర్యాటక ఆస్ట్రేలియా టీమ్ సిరీస్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. దాదాపు ప్రపంచకప్‌నకు ఎంపిక చేసిన జట్టుతోనే ఆస్ట్రేలియా సిరీస్‌లో బరిలోకి దిగుతోంది. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మిఛెల్ మార్ష్, మార్నస్ లబుషేన్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ కెరీ, స్టోయినిస్ తదితరులతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక కమిన్స్, హాజిల్‌వుడ్, అబాట్, ఆడమ్ జంపాలతో బౌలింగ్ కూడా బాగానే కనిపిస్తోంది. దీంతో ఈ సిరీస్‌లో కంగారూలకే గెలుపు అవకాశాలు అధికంగా ఉన్నాయని చెప్పొచ్చు.