Tuesday, March 4, 2025

ఆత్మవిశ్వాసంతో భారత్

- Advertisement -
- Advertisement -

జోరుమీదున్న ఆస్ట్రేలియా
నేడు ఛాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీస్ సమరం
దుబాయి: ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ తుది అంకానికి చేరుకుంది. మంగళవారం దుబాయి వేదికగా తొలి సెమీ ఫైనల్ జరుగనుంది. ఈ పోరులో కిందటి రన్నరప్ భారత్‌తో ఆస్ట్రేలియా తలపడనుంది. లీగ్ దశలో భారత్ ఆడిన మూడు మ్యాచుల్లోనూ గెలిచి జోరుమీదుంది. ఆస్ట్రేలియా కూడా లీగ్ దశలో అజేయంగా నిలిచింది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే క్రికెటర్లు అందుబాటులో ఉన్నారు. కీలక ఆటగాళ్లు లేకున్నా లీగ్ దశలో ఆస్ట్రేలియా అసాధారణ ఆటను కనబరిచింది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 352 పరుగుల భారీ లక్ష్యాన్ని సయితం అలవోకగా ఛేదించింది.

జోష్ ఇంగ్లిస్, ట్రావిస్ హెడ్, మ్యాచ్ వెల్, లబుషేన్, అలెక్స్ కేరీ, కెప్టెన్ స్టీవ్ స్మిత్ తదితరులతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లిస్ అద్భుత సెంచరీతో అలరించాడు. లబుషేన్, మాక్స్‌వెల్ కూడా మెరుపులు మెరిపించారు. తాజాగా అఫ్గాన్‌తో జరిగిన పోరులో ట్రావిస్ హెడ్, కెప్టెన్ స్మిత్‌లు ఫామ్‌ను అందుకున్నారు. ఇది కూడా ఆస్ట్రేలియా కలిసివచ్చే అంశంగా చెప్పాలి. ఈ మ్యాచ్‌లో కూడా ఆస్ట్రేలియా ఆశలన్నీ ట్రావిస్ హెడ్, ఫ్రేజర్, ఇంగ్లిస్, మాక్స్‌వెల్‌పై పెట్టుకుంది. వీరిలో ఏ ఇద్దరూ రాణించినా భారీ స్కోరు సాధించడం, భారీ లక్ష్యాన్ని ఛేదించడం ఆసీస్‌కు కష్టమేమీ కాదు. అంతేగాక ఆడమ్ జంపా, నాథన్ ఎల్లిస్, స్పెన్సర్ జాన్సన్, మాక్స్‌వెల్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు జట్టులో ఉన్నారు. రెండు విభాగాల్లోనూ బలంగా ఉన్న ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా కనిపిస్తోంది. దీంతో సెమీస్‌లో టీమిండియాకు గట్టి పోటీఎదురైనా ఆశ్చర్యం లేదు.

సమరోత్సాహంతో..

మరోవైపు టీమిండియా ఈ మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఘన విజయం సాధించడంతో జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఆస్ట్రేలియాతో జరిగే సెమీస్‌లోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో కూడా ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ జట్టుకు కీలకంగా మారారు. ఇప్పటికే ఈ టోర్నమెంట్‌లో సెంచరీలతో సత్తా చాటారు. కీలకమైన సెమీస్ పోరులోనూ రాణించాలనే పట్టుదలతో ఉన్నారు. రోహిత్ విజృంభిస్తే టీమిండియాకు ఎదురే ఉండదు.

రోహిత్, గిల్‌లపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయ సెంచరీతో రాణించాడు. ఈసారి కూడా జట్టుకు కీలకంగా మారాడు. శ్రేయస్ అయ్యర్ కూడా ఫామ్‌లో ఉండడం జట్టుకు కలిసివచ్చే అంశమే. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య తదితరులతో భారత బ్యాటింగ్ చాలా బలంగా కనిపిస్తోంది. దీంతో పాటు షమి, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్య, జడేజా, అక్షర్, వరుణ్ చక్రవర్తి తదితరులతో బౌలింగ్ విభాగం కూడాబాగానే ఉంది. రెండు విభాగాల్లోనూ సమతూకంగా ఉన్న టీమిండియా సెమీస్‌లో ఫేవరెట్‌గా కనిపిస్తోంది. కానీ ఎలాంటి స్థితినైనా ఎదుర్కొని ముందుకు సాగే సత్తా కలిగిన ఆస్ట్రేలియాను ఓడించాలంటే భారత్ సర్వం ఒడ్డి పోరాడక తప్పదు. అప్పుడే ఫైనల్ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News