Saturday, January 18, 2025

కుర్రాళ్ల సత్తాకు పరీక్ష.. నేడు ఆస్ట్రేలియాతో తొలి టి20

- Advertisement -
- Advertisement -

విశాఖపట్నం: సుదీర్ఘ కాలంగా సాగిన వన్డే ప్రపంచకప్ ఇటీవలే ముగిసిన విషయం తెలిసిందే. ఫైనల్లో తలపడిన ఆస్ట్రేలియాటీమిండియా జట్ల మరోసారి పోరుకు సిద్ధమయ్యాయి. ఇరు జట్ల మధ్య మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు గురువారం తెరలేవనుంది. విశాఖపట్నం వేదికగా తొలి టి20 మ్యాచ్ జరుగనుంది. ఇటు ఆస్ట్రేలియా అటు టీమిండియాలో సీనియర్లకు విశ్రాంతి కల్పించారు. భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్, జడేజా, అశ్విన్, షమి, సిరాజ్, కుల్దీప్, రాహుల్ తదితరులకు విశ్రాంతి ఇచ్చారు.

రానున్న టి20 ప్రపంచకప్‌ను పురస్కరించుకుని కొంతకాలంగా టి20లో యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈసారి కూడా కుర్రాళ్లతో కూడిన టీమ్‌ను బిసిసిఐ ఆస్ట్రేలియా సిరీస్‌కు ఎంపిక చేసింది. సూర్యకుమార్, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, శివమ్ దూబే, తిలకర్ వర్మ, రింకు సింగ్ తదితరులు జట్టులో చోటు సంపాదించారు. బౌలింగ్‌లో ముకేశ్ కుమార్, అవేశ్ ఖాన్, జితేష్ శర్మ, సుందర్, అర్ష్‌దీప్ సింగ్, రవిబిష్ణోయ్, అక్షర్ పటేల్, ప్రసిద్ధ్ కృష్ణలకు స్థానం దక్కింది.

సూర్యకుమార్‌పైనే ఆశలు..
ఇక టి20లో కళ్లు చెదిరే రికార్డు కలిగిన సూర్యకుమార్‌పైనే జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. వరల్డ్‌కప్‌లో సూర్యకుమార్‌కు తగినన్ని అవకాశాలు లభించలేదు. ఫైనల్లో ఛాన్స్ దక్కినా పెద్దగా రాణించలేక పోయాడు. అయితే ఈ సిరీస్‌లో అతనే జట్టుకు కీలకం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా అతనికి ఉంది. టి20లలో అతనికి తిరుగులేని రికార్డు ఉండడం జట్టుకు సానుకూల అంశంగా చెప్పాలి. సూర్య విజృంభిస్తే ప్రత్యర్థి జట్టు బౌలర్లకు కష్టాలు ఖాయం. ఇక యశస్వి జైస్వాల్, ఇషాన్, రుతురాజ్, రింకు సింగ్‌లతో బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. దేశవాళీ క్రికెట్‌లో యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. ఇదే జోరును ఈ సిరీస్‌లోనూ కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నారు. తెలుగుతేజం తిలక్‌వర్మ కూడా జట్టుకు చాలా కీలకమనే చెప్పాలి. విశాఖలో జరిగే తొలి మ్యాచ్‌కు అతను ప్రత్యేక ఆకర్షణగా మారాడు. బౌలింగ్‌లో కూడా భారత్ సమతూకంగా ఉంది. యువ బౌలర్లు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు.

ఫేవరెట్‌గా కంగారూలు..
మరోవైపు ప్రపంచకప్ ట్రోఫీని సాధించి జోరుమీదున్న ఆస్ట్రేలియా ఈ సిరీస్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. వరల్డ్‌కప్ హీరోలు ట్రావిస్ హెడ్, ఆడమ్ జంపా, స్టీవ్ స్మిత్, మ్యాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్‌లు సిరీస్‌కు ఎంపికయ్యారు. అయితే వార్నర్, లబుషేన్, కమిన్స్, స్టార్క్, మార్ష్ తదితరులకు విశ్రాంతి ఇచ్చారు. వీరు లేకున్నా ఆస్ట్రేలియా బలంగా ఉంది. స్మిత్, హేడ్, మ్యాక్స్‌వెల్, స్టోయినిస్, కెప్టెన్ మాథ్యూవేడ్‌లతో బ్యాటింగ్ బలోపేతంగా కనిపిస్తోంది. అంతేగాక బెహ్రాన్‌డార్ఫ్, రిచర్డ్‌సన్, ఆడమ్ జంపా, నాథన్ ఎల్లిస్‌లతో బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

జట్లు వివరాలు:
భారత్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, రింకు సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్‌సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ముకేశ్ కుమార్, జితేష్ కుమార్, అవేశ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్.

ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్, మ్యాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్, స్టోయినిస్, మాథ్యూవేడ్ (కెప్టెన్), సీన్ అబాట్, ఆడమ్ జంపా, నాథన్ ఎల్లిస్, జాసన్ బెహ్రాన్‌డార్ఫ్, తన్వీర్ సంఘా, రిచర్డ్‌సన్, అరోన్ హార్ది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News