Monday, January 13, 2025

రెండో ఇన్నింగ్స్‌లోనూ కుప్పకూలిన టాపార్డర్.. కష్టాల్లో టీమిండియా

- Advertisement -
- Advertisement -

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కష్టాల్లో చిక్కుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 128 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. శనివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ కీపర్ రిషబ్ పంత్ (28), నితీష్ కుమార్ రెడ్డి (15) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని దాటాలంటే భారత్ మరో 29 పరుగులు చేయాలి. ఇప్పటికే కీలక ఆటగాళ్లందరూ పెవిలియన్ చేరడంతో టీమిండియాకు ఈ మ్యాచ్‌లో ఓటమి ఖాయంగా కనిపిస్తోంది.

రిషబ్, నితీష్ రెడ్డిలు అసాధారణ బ్యాటింగ్‌ను కనబరిస్తేనే రోహిత్ సేనకు ఏమైనా గెలుపు అవకాశాలుంటాయి. రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. ఓపెనర్లు కెఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్‌లు శుభారంభం అందించలేక పోయారు. రాహుల్ ఏడు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. యశస్వి 24 పరుగులు మాత్రమే చేశాడు. శుభ్‌మన్ గిల్ (28) కూడా నిరాశ పరిచాడు. ఇక సీనియర్లు విరాట్ కోహ్లి (11), కెప్టెన్ రోహిత్ శర్మ (6) పరుగులకే పెవిలియన్ చేరారు. మొదటి ఇన్నింగ్స్‌లోనూ విరాట్, రోహిత్‌లు తక్కువ స్కోరుకే ఔటైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లోనూ ఇద్దరు విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్, బొలాండ్‌లు రెండేసి వికెట్లు పడగొట్టారు.

హెడ్ అద్భుత శతకం..
అంతకుముందు 86/1 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం రెండో రోజు తిరిగి బ్యాటింగ్‌ను చేపట్టిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్ మెక్ స్విని (39), స్టీవ్ స్మిత్ (2)లను బుమ్రా వెనక్కి పంపాడు. దీంతో ఆస్ట్రేలియా 103 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్‌లు సమన్వయంతో ఆడుతూ జట్టును ఆదుకున్నారు. ఈ జోడీని విడగొట్టేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

అయితే 9 ఫోర్లతో 64 పరుగులు చేసిన లబుషేన్‌ను నితీష్ రెడ్డి ఔట్ చేశాడు. తర్వాత భారత బౌలర్లు వరుస క్రమంలో వికెట్లను పడగొట్టారు. ఒకవేళ వికెట్లు పడతున్నా ట్రావిస్ హెడ్ తన జోరును కొనసాగించాడు. 141 బంతుల్లో 17 ఫోర్లు, 4 సిక్సర్లతో 140 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. మిగతా వారు విఫలం కావడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 337 పరుగుల వద్ద ముగిసింది. కాగా, ఆస్ట్రేలియాకు తొలి ఇన్నింగ్స్‌లో 157 పరుగుల ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో బుమ్రా,సిరాజ్ నాలుగేసి వికెట్లు పడగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News