Tuesday, December 17, 2024

అక్షర్ ఒంటరి పోరాటం.. భారత్ 262 ఆలౌట్..

- Advertisement -
- Advertisement -

ఆస్ట్రేలియా పైచేయి
అక్షర్ ఒంటరి పోరాటం, భారత్ 262 ఆలౌట్
రసవత్తరంగా రెండో టెస్టు
న్యూఢిల్లీ: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. శనివారం రెండో రోజు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 262 పరుగులకు ఆలౌటైంది. తర్వాత రెండో ఇన్నింగ్స్ చేపట్టిన ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. కంగారూలకు ఇప్పటి వరకు 62 పరుగుల ఆధిక్యం లభించింది. ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా (6)ను రవీంద్ర జడేజా ఔట్ చేశాడు. రెండో రోజు ఆట ముగిసే వరకు మరో ఓపెనర్ ట్రావిస్ హడ్ (39), లబుషేన్(16) పరుగులతో క్రీజులో ఉన్నారు.

లియాన్ మ్యాజిక్
అంతకుముందు టీమిండియాను తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో ఆస్ట్రేలియా బౌలర్లు సఫలమయ్యారు. 21/0 ఓవర్‌నైట్ స్కోరుతో తిరిగి బ్యాటింగ్ చేపట్టిన భారత్ వరుస క్రమంలో వికెట్లను కోల్పోయింది. స్టార్ స్పిన్నర్ నాథన్ లియాన్ అసాధారణ బౌలింగ్‌తో భారత బ్యాటర్లను హడలెత్తించాడు. శనివారం ప్రారంభించిన భారత్ ఆరంభంలో బాగానే ఆడింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్‌లు నిలకడైన బ్యాటింగ్‌ను కనబరిచారు. కానీ 17వ ఓవర్‌లో రాహుల్ (17)ను ఔట్ చేసిన లియాన్ ఆ వెంటనే రోహిత్ శర్మ(32), చటేశ్వర్ పుజారా(0), శ్రేయస్ అయ్యర్ (4)లను వెనక్కి పంపాడు. దీంతో భారత్ 66 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది.

ఆదుకున్న కోహ్లి, జడేజా
ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే బాధ్యతను సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లి తనపై వేసుకున్నాడు. రవీంద్ర జడేజాతో కలిసి ఐదో వికెట్‌కు కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. కానీ కుదురుగా ఆడుతున్న జడేజా (26)ను మార్ఫి ఔట్ చేశాడు. ఆ వెంటనే కోహ్లి కూడా వెనుదిరిగాడు. 44 పరుగులు చేసిన విరాట్‌ను కెహ్నెమాన్ వెనక్కి పంపాడు. ఇక వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ (6) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. అతన్ని లియాన్ పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో భారత్ 139 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో చిక్కుకుంది.

అక్షర్ జోరు..
ఈ సమయంలో అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్‌లు అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నారు. ఇద్దరు ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు. ఈ జోడీని విడగొట్టేందుకు ఆస్ట్రలియా బౌలర్లు చేసిన ప్రయత్నాలు చాలా సేపటి వరకు ఫలించలేదు. కీలక ఇన్నింగ్స్ ఆడిన అక్షర్ పటేల్ 9 ఫోర్లు, మూడు సిక్సర్లతో 74 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు అశ్విన్ ఐదు బౌండరీలతో 37 పరుగులు చేశాడు. ఇద్దరు 8వ వికెట్‌కు రికార్డు స్థాయిలో 114 పరుగులు జోడించారు. షమి (2)ను కెహ్నెమాన్ క్లీన్‌బౌల్డ్ చేయడంతో భారత్ ఇన్నింగ్స్ 262 పరుగుల వద్ద ముగిసింది. దీంతో ఆస్ట్రేలియాకు ఒక పరుగు ఆధిక్యం లభించింది. కాగా, కంగారూ బౌలర్లలో లియాన్ ఐదు, మార్ఫి, కెహ్నెమాన్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News