Monday, December 23, 2024

ఎవరు గెలిస్తే వారిదే సిరీస్..

- Advertisement -
- Advertisement -

ఎవరు గెలిస్తే వారిదే సిరీస్
ఆత్మవిశ్వాసంతో ఆస్ట్రేలియా, భారత్‌కు సవాల్
నేడు చెన్నైలో చివరి వన్డే
చెన్నై: సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో, చివరి వన్డేకు భారత్‌ఆస్ట్రేలియా జట్లు సిద్ధమయ్యాయి. బుధవారం చెన్నైలోని ఎంఎ చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. అహ్మదాబాద్‌లో జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించగా, విశాఖపట్నం ఆతిథ్యం ఇచ్చిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా జయకేతనం ఎగుర వేసింది. దీంతో ప్రస్తుతం ఇరు జట్లు 11తో సమంగా నిలిచాయి. ఇదిలావుంటే ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టుకు సిరీస్ దక్కుతోంది.

ఆస్ట్రేలియాతో పోల్చితే టీమిండియా కాస్త ఒత్తిడిలో కనిపిస్తోంది. కిందటి మ్యాచ్‌లో భారత్ తక్కువ స్కోరుకే కుప్పకూలింది. ఇలాంటి స్థితిలో మూడో, చివరి వన్డేలో ఆస్ట్రేలియాను ఓడించాలంటే భారత్ సర్వం ఒడ్డి పోరాడక తప్పదు. సిరీస్‌లో టీమిండియాను బ్యాటింగ్ సమస్య వెంటాడుతోంది. రెండో వన్డేలో 117 పరుగులకే ఆలౌటైంది. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్, కోహ్లి, రాహుల్, జడేజా, హార్దిక్ వంటి స్టార్ బ్యాటర్లు ఉన్నా భారత్ విశాఖలో తక్కువ స్కోరుకే చాపచుట్టేసింది. ఇక చెన్నై మ్యాచ్‌లోనైనా బ్యాటింగ్ గాడిలో పడుతుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా తయారైంది.

ఓపెనర్లే కీలకం..
ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచుల్లోనూ భారత్‌కు ఆశించిన స్థాయిలో శుభారంభం లభించలేదు. శుభ్‌మన్ గిల్ తొలి రెండు వన్డేల్లో నిరాశ పరిచాడు. కిందటి మ్యాచ్‌లో జట్టులోకి వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. కీలకమైన ఈ మ్యాచ్‌లో జట్టుకు ఓపెనర్లు కీలకంగా మారారు. వీరిద్దరూ శుభారంభం అందిస్తే తర్వాత వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి తగ్గి స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంటుంది. ఇలాంటి స్థితిలో రోహిత్, శుభ్‌మన్ గిల్‌లు తమ బ్యాట్‌కు పని చెప్పక తప్పదు. మరోవైపు తొలి రెండు వన్డేల్లో ఖాతా తెరవకుండానే వెనుదిరిగిన స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు ఈ మ్యాచ్ సవాల్‌గా మారింది. రానున్న రోజుల్లో వన్డే టీమ్‌లో చోటు సంపాదించాలంటే ఈసారి సూర్యకుమార్ మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచక తప్పదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన సూర్య చెలరేగితే టీమిండియా బ్యాటింగ్ సమస్యలు చాలా వరకు తీరిపోతాయి.

మరోవైపు విరాట్ కోహ్లి, రాహుల్‌లు కూడా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచాల్సి ఉంటుంది. సిరీస్‌ను దక్కించుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో వీరిద్దరూ ఎలా రాణిస్తారో అంతుబట్టకుండా పోయింది. రాహుల్, కోహ్లిలు తమ మార్క్ బ్యాటింగ్‌తో అలరిస్తే ఆస్ట్రేలియా బౌలర్లకు కష్టాలు ఖాయం. ఇక హార్దిక్, జడేజాల వంటి స్టార్ ఆల్‌రౌండర్లు ఉండడం టీమిండియాకు అతని పెద్ద ఊరటగా చెప్పాలి. ఈ మ్యాచ్‌లో వీరిద్దరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. కాగా, బౌలింగ్‌లో మాత్రం భారత్ బలంగానే ఉంది. షమి, సిరాజ్, హార్దిక్, కుల్దీప్, జడేజా, శార్దూల్‌లతో బౌలింగ్ పటిష్టంగా కనిపిస్తోంది.

జోరుమీదుంది..
మరోవైపు రెండో వన్డేలో భారత్‌ను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. మిఛెల్ స్టార్క్, అబాట్, స్టొయినిస్, ఎలిస్, గ్రీన్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు జట్టులో ఉన్నారు. స్టార్క్ సిరీస్‌లో అసాధారణ బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఇక బ్యాటింగ్‌లో మిఛెల్ మార్ష్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నాడు. తొలి రెండు వన్డేల్లో కూడా మార్ష్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఈ మ్యాచ్‌లో కూడా అతని నుంచి మెరుగైన ప్రదర్శనను జట్టు ఆశిస్తోంది. ఇక ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్, లబుషేన్, కారే, గ్రీన్, స్టొయినిస్ తదితరులతో బ్యాటింగ్ కూడా చాలా బలంగా ఉంది. ఇలాంటి స్థితిలో ఈ మ్యాచ్‌లో కూడా ఆస్ట్రేలియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News