భారత డాషింగ్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి సున్నాకే పెవిలియన్ చేరాడు. ఆస్ట్రేలియాతో బుధవారం జరిగిన మూడో, ఆఖరి వన్డేలో సూర్యకుమార్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఇంతకు ముందు తొలి రెండు వన్డేల్లో కూడా సూర్య తాను ఎదుర్కొన్న మొదటి బంతికే ఔటయ్యాడు. ముచ్చటగా మూడో వన్డేలోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ తొలి బంతికే వెనుదిరిగాడు. ఇలా ఒక సిరీస్‌లో వరుసగా మూడు మ్యాచుల్లో తొలి బంతికే ఔటైన బ్యాటర్‌గా అత్యంత చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
టి20 ఫార్మాట్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్న సూర్యకుమార్ వన్డేలకు వచ్చే సరికి ఆ జోరును కొనసాగించలేక పోతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్ ఒక్క పరుగు కూడా చేయలేక పోయాడు. మూడు సార్లు కూడా మొదటి బంతికే ఔటయ్యాడు. చెన్నై మ్యాచ్‌లోనూ డకౌట్ కావడంతో సూర్యకుమార్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. పలు అవకాశాలు లభిస్తున్నా సూర్య మాత్రం పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరచడాన్ని అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.