Friday, December 20, 2024

సిరీస్ గెలిచేదెవరో?

- Advertisement -
- Advertisement -

IND vs AUS 3rd T20 Today in Hyderabad

సిరీస్ గెలిచేదెవరో?
ఆత్మవిశ్వాసంతో భారత్, గెలుపు కోసం ఆస్ట్రేలియా
నేడు ఉప్పల్‌లో చివరి టి20
మన తెలంగాణ/హైదరాబాద్: ఆస్ట్రేలియాతో ఆదివారం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే పోరుకు టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. చివరి టి20లో గెలిచే జట్టుకు సిరీస్ దక్కుతోంది. తొలి టి20లో ఆస్ట్రేలియా, రెండో టి20లో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఉప్పల్‌లో జరిగే మూడో టి20 ఇరు జట్లకు కీలకంగా మారింది. ఇందులో గెలిచే జట్టుకే సిరీస్ దక్కే అవకాశాలు ఉండడంతో రెండు జట్లు ఈ మ్యాచ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నాగ్‌పూర్‌లో జరిగిన 8 ఓవర్ల మ్యాచ్‌లో టీమిండియా అలవోకగా విజయం సాధించింది. ఇదే జోరును ఉప్పల్‌లోనూ కొనసాగించాలనే పట్టుదలతో భారత్ పోరుకు సిద్ధమైంది. కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్‌లోకి రావడం టీమిండియాకు అతి పెద్ద ఊరటగా చెప్పొచ్చు. ఇక ఆస్ట్రేలియాను కూడా తక్కువ అంచనా వేయలేం. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. దీంతో ఈ మ్యాచ్‌లో టీమిండియాకు గట్టి పోటీ ఖాయంగా కనిపిస్తోంది.
ఓపెనర్లే కీలకం
ఈ మ్యాచ్‌లో టీమిండియాకు ఓపెనర్లు కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ కీలకంగా మారారు. కిందటి మ్యాచ్‌లో రోహిత్ మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఈసారి కూడా జట్టు అతనిపై భారీ ఆశలు పెట్టుకుంది. రోహిత్ తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే భారత్‌కు భారీ స్కోరు ఖాయం. ఇక రాహుల్ కూడా భారీ ఇన్నింగ్స్‌పై కన్నేశాడు. తొలి టి20లో రాహుల్ అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా మెరుపులు మెరిపించాలనే పట్టుదలతో ఉన్నాడు.
కోహ్లి ఈసారైనా
ఇక సీనియర్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ విఫలమయ్యాడు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా కోహ్లి తన బ్యాట్‌కు పనిచెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రానున్న ప్రపంచకప్ నేపథ్యంలో కోహ్లి ఫామ్ కలవరానికి గురిచేస్తోంది. ఆసియాకప్‌లో భారీ స్కోర్లతో చెలరేగిన కోహ్లి ఆస్ట్రేలియా సిరీస్‌లో మాత్రం పేలవమైన బ్యాటింగ్‌తో నిరాశ పరుస్తున్నాడు. ఈ మ్యాచ్ కోహ్లి చాలా కీలకంగా మారింది. ఇందులో రాణించడం ద్వారా తిరిగి ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని భావిస్తున్నాడు. ఇక సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, దినేశ్ కార్తీక్ తదితరులు కూడా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచక తప్పదు. అప్పుడే ఈ మ్యాచ్‌లో టీమిండియాకు గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. కాగా, సిరీస్‌లో పేలవమైన బౌలింగ్ భారత్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ఒక్క అక్షర పటేల్ మినహా మిగతా బౌలర్లందరూ భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. ఇది నిజంగా కలవరానికి గురి చేసే అంశమే. ఇప్పటికైనా బౌలర్లు మెరుగైన బౌలింగ్‌ను కనబరచాల్సిన అవసరం జట్టుకు ఎంతైనా ఉంది.
తక్కువ అంచనా వేయలేం
మరోవైపు పర్యాటక ఆస్ట్రేలియాను కూడా తక్కువ అంచనా వేయలేం. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కంగారూలు సమతూకంగా కనిపిస్తోంది. కామెరూన్ గ్రీన్, ఫించ్, స్మిత్, వేడ్ తదితరులు ఫామ్‌లో ఉన్నారు. ఇది జట్టుకు సానుకూల అంశంగా చెప్పాలి. బౌలింగ్‌లో కూడ ఆస్ట్రేలియా బలంగానే ఉంది. హాజిల్‌వుడ్, గ్రీన్, కమిన్స్, ఆడమ్ జంపా, డానియల్ షమ్స్ తదితరులతో బౌలింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆస్ట్రేలియా కూడా గెలుపు అవకాశాలు సమంగా ఉన్నాయనే చెప్పాలి.

IND vs AUS 3rd T20 Today in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News