Thursday, January 16, 2025

తొలి రోజు వరుణుడిదే.. మూడో టెస్టుకు వర్షం అడ్డంకి

- Advertisement -
- Advertisement -

బ్రిస్బేన్: భారత్, ఆస్ట్రేలియా మధ్య శనివారం ప్రారంభమైన మూడో టెస్టు మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో తొలి రోజు 13.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. దాదాపు రెండున్నర సెషన్ల ఆట వర్షం వల్ల రద్దయ్యింది. బోర్డర్‌గవాస్కర్ సిరీస్‌లో భాగంగా జరుగుతున్న మూడో టెస్టులో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్ చేపట్టిన ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. ఓపెనర్లు నాథన్ మెక్‌స్వీని(4), ఉస్మాన్ ఖ్వాజా(19) పరుగులతో అజేయంగా నిలిచారు.

భారత బౌలర్లు సిరాజ్, బుమ్రా, ఆకాశ్‌దీప్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా వికెట్లను మాత్రం పడగొట్టలేక పోయారు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు 11తో సమంగా ఉన్నాయి. పెర్త్‌లో జరిగిన మొదటి టెస్టులో టీమిండియా విజయం సాధించింది. అడిలైడ్ వేదికగా నిర్వహించిన రెండో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా జయభేరి మోగించింది. డేనైట్ పద్ధతిలో జరిగిన ఈ మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగియడం విశేషం. ఇక బ్రిస్బేన్‌లో రెండు జట్ల మధ్య మూడో టెస్టు ఆరంభమైంది. కానీ తొలి రోజు ఆటకు వర్షంఆటం కలిగించింది. కేవలం గంట సేపు ఆట మాత్రమే సాధ్యమైంది.

రెండో రోజు అదనంగా ఓవర్లు
తొలి రోజు 13.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడడంతో ఆదివారం రెండో రోజు ఆటలో ఓవర్లను పొడిగించాలని నిర్వాహకులు నిర్ణయించారు. ఆదివారం కనీసం 98 ఓవర్ల పాటు ఆటను నిర్వహించాలని భావిస్తున్నారు. ఆదివారం అర్ధ గంట ముందుగానే ఆటను ప్రారంభిస్తారు. పూర్తి ఓవర్ల కోటా వేయించేందుకు ఆటను అర్ధ గంట సేపు పొడిగించేందుకు కూడా నిర్వాహకులు సిద్ధంగా ఉన్నారు. ఆదివారం ఉదయం 5.20 గంటలకు ఆట ప్రారంభమవుతోంది. కాగా, తొలి రోజు ఆట వర్షార్పణం కావడంతో టికెట్లను కొన్న అభిమానులు నిరాశకు గురయ్యారు. కానీ క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం అభిమానులకు భారీ ఊరటనిచ్చింది. టికెట్ల సొమ్మును రిఫండ్ చేయాలని సిఎ నిర్ణయించింది. దీంతో టికెట్లను కొన్న అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News