Friday, November 22, 2024

లియాన్ దెబ్బకు భారత బ్యాట్స్ మెన్లు విలవిల.. ఇక భారమంతా బౌలర్లపైనే

- Advertisement -
- Advertisement -

ఇక భారమంతా బౌలర్లపైనే
లియాన్ దెబ్బకు భారత్ విలవిల, రెండో ఇన్నింగ్స్‌లో 163 ఆలౌట్
ఆస్ట్రేలియా ముందు స్వల్ప లక్షం, ఓటమి అంచున టీమిండియా
ఇండోర్: వరుసగా రెండు టెస్టుల్లో గెలిచి జోరుమీదున్న ఆతిథ్య టీమిండియాకు ఇండోర్‌లో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా కోలుకోలేని దెబ్బతీసింది. స్పిన్‌కు సహకరిస్తున్న పిచ్‌పై భారత్ రెండు ఇన్నింగ్స్‌లలో కూడా తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఇక అసాధారణ ఆటతో అలరించిన ఆస్ట్రేలియా మూడో మ్యాచ్‌లో విజయానికి చేరువైంది.

శుక్రవారం మూడో రోజు విజయం సాధించాలంటే కంగారూలు కేవలం 76 పరుగులు మాత్రమే చేయాలి. ఈ స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుని మ్యాచ్‌లో గెలవడం టీమిండియాకు దాదాపు అసాధ్యంగానే చెప్పాలి. అయితే అశ్విన్, జడేజా వంటి మ్యాన్ విన్నర్ స్పిన్నర్లు ఉండడం భారత్‌కు కాస్త కలిసి వచ్చే అంశంగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. కానీ బలమైన బ్యాటింగ్ లైనప్ ఆస్ట్రేలియా ఈ స్వల్ప లక్షం ఛేదించ కుండా ఆపడం చాలా కష్టమని వారు పేర్కొంటున్నారు.

సత్తా చాటిన బౌలర్లు
గురువారం మూడో రోజు భారత బౌలర్లు అద్భుత ప్రతిభను కనబరిచారు. అశ్విన్, ఉమేశ్ యాదవ్‌లు చెలరేగడంతో ఆస్ట్రేలియా కూడా తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులకే పరిమితమైంది. బౌలర్లు సమష్టిగా రాణించి కంగారూలను తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో సఫలమయ్యారు. హాండ్స్‌కొంబ్ (19), కామెరూన్ గ్రీన్ (21) పరుగులు చేసి పెవిలియన్ చేరారు. మరోవైపు వికెట్ కీపర్ అలెక్స్ కారే (3), స్టార్క్ (1), నాథన్ లియాన్ (5), మర్ఫి (0)లు సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుదిరిగారు. దీంతో ఆస్ట్రేలియా భారీ ఆధిక్యం సాధించడంలో విఫలమైంది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు, అశ్విన్, ఉమేశ్‌లు చెరో మూడేసి వికెట్లు పడగొట్టారు.

తీరు మారలేదు..
బౌలర్లు అద్భుతంగా రాణించి ఆస్ట్రేలియాను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంతో భారత్ ఆశలు మళ్లీ చిగురించాయి. అయితే రెండో ఇన్నింగ్స్‌లో కూడా బ్యాటర్లు పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లు ఈసారి కూడా జట్టుకు శుభారంభం అందించలేక పోయారు. గిల్ ఐదు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా (12) విఫలమయ్యాడు.

అయితే సీనియర్ బ్యాటర్ చటేశ్వర్ పుజారా మాత్రం ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగాడు. ఒంటరి పోరాటం చేసిన పుజారా ఐదు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 59 పరుగులు చేశాడు. కాగా, కీలక ఆటగాళ్లు విరాట్ కోహ్లి (13), రవీంద్ర జడేజా (7), శ్రీకర్ భరత్ (3) జట్టుకు అండగా నిలువలేక పోయారు. అశ్విన్ (16), అక్షర్ పటేల్ (15), ఉమేశ్ యాదవ్ (0), సిరాజ్ (0) కూడా విఫలమయ్యారు. దీంతో భారత్ ఇన్నింగ్స్ 163 పరుగుల వద్దే ముగిసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ లియాన్ 64 పరుగులు మాత్రమే ఇచ్చి 8 వికెట్లు పడగొట్టాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News