Saturday, November 23, 2024

సమరోత్సాహంతో భారత్

- Advertisement -
- Advertisement -

సమరోత్సాహంతో భారత్.. అందరి కళ్లు రోహిత్‌పైనే
ప్రతీకారం కోసం ఆస్ట్రేలియా, నేటి నుంచి మూడో టెస్టు

సిడ్నీ: బాక్సింగ్ డే టెస్టులో చారిత్రక విజయం సాధించిన టీమిండియా సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగే పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య గురువారం నుంచి మూడో టెస్టు జరుగనుంది. సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ జట్టులో చేరడంతో భారత్ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. నవ్‌దీప్ సైనికి కూడా తుది జట్టులో చోటు లభించింది. తెలుగుతేజం హనుమ విహారి జట్టులో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక యువ స్పీడ్‌స్టర్ నటరాజన్‌కు నిరాశే మిగిలింది. తుది 11 మందిలో చోటు సంపాదించడంలో నటరాజన్ విఫలమయ్యాడు. మరోవైపు ఆతిథ్య ఆస్ట్రేలియా కూడా భారీ ఆశలతో బరిలోకి దిగుతోంది. స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ రాకతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ బలోపేతంగా మారింది. కిందటి మ్యాచ్‌లో భారత్ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలనే పట్టుదలతో కంగారూలు మ్యాచ్‌కు సిద్ధమయ్యారు. అయితే బ్యాటింగ్ వైఫల్యం జట్టును వెంటాడుతోంది. కానీ, బౌలర్లు జోరు మీద ఉండడం జట్టుకు సానుకూల పరిణామంగా చెప్పాలి. ఈసారి ఆస్ట్రేలియా బౌలర్లపై భారీ ఆశలు పెట్టుకుంది. ఇరు జట్లు కూడా గెలుపే లక్షంగా పెట్టుకోవడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగడం ఖాయం. ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచుల్లో ఇరు జట్లు చెరో విజయం సాధించాయి.
ప్రత్యేక ఆకర్షణగా రోహిత్
ఈ మ్యాచ్‌కు భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. సుదీర్ఘ విరామం తర్వాత రోహిత్ బరిలోకి దిగుతున్న అంతర్జాతీయ మ్యాచ్ ఇదే కావడంతో అందరి దృష్టి అతనిపైనే నిలిచింది. యూఎఇ వేదికగా జరిగిన ఐపిఎల్‌లో రోహిత్ ఆడాడు. అయితే ఆ తర్వాత గాయం తిరగబడడంతో పరిమిత ఓవర్ల సిరీస్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. కాగా, ఫిట్‌నెస్ నిరూపించుకోవడంతో రోహిత్‌ను మిగిలిన రెండు టెస్టులకు ఎంపిక చేశారు. మయాంక్ అగర్వాల్ స్థానంలో అతనికి జట్టులో చోటు కల్పించారు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే పట్టుదలతో రోహిత్ ఉన్నాడు. వన్డేల్లో, టి20లలో అద్భుత రికార్డు కలిగిన రోహిత్ టెస్టుల్లోనూ అలాంటి రికార్డే సాధించాలని తహతహలాడుతున్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన రోహిత్ విజృంభిస్తే భారీ స్కోరు సాధించడం టీమిండియాకు కష్టమేమి కాదు. ఇక యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కూడా తన జోరును కొనసాగించాలి. ఆడిన తొలి మ్యాచ్‌లోనే అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచిన గిల్ ఈసారి కూడా సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నాడు.
పుజారా ఈసారైన
మరోవైపు కిందటి మ్యాచ్‌లో విఫలమైన సీనియర్ బ్యాట్స్‌మన్ చటేశ్వర్ పుజారా ఈసారైన రాణించాల్సిన అవసరం ఎంతైన ఉంది. పుజారా వైఫల్యం జట్టును వెంటాడుతోంది. కిందటి సిరీస్‌లో ఆస్ట్రేలియాపై పరుగుల వరద పారింయిన పుజారా ఈసారి మాత్రం పేలవమైన బ్యాటింగ్‌తో నిరాశ పరుస్తున్నాడు. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లోనే కాస్త మెరుగ్గా రాణించాడు. ఆ తర్వాత ఆడిన మూడు ఇన్నింగ్స్‌లలోనూ విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో మాత్రం చెలరేగాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇక కిందటి మ్యాచ్‌లో అసాధారణ బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలిచిన కెప్టెన్ అజింక్య రహానెపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. రహానె తన మార్క్ బ్యాటింగ్‌తో విజృంభిస్తే ఆస్ట్రేలియా బౌలర్లకు ఈసారి కూడా కష్టాలు తప్పవు. మరోవైపు రిషబ్ పంత్, హనుమ విహారి, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లు కూడా బ్యాటింగ్‌లో రాణించాల్సిన అవసరం ఉంది. ఇక బౌలింగ్‌లో భారత్ చాలా బలంగా ఉంది. ఉమేశ్, షమి లేకున్నా బౌలింగ్ బాగానే ఉందని చెప్పాలి. బుమ్రా, సిరాజ్, అశ్విన్, జడేజాలు కిందటి మ్యాచ్‌లో నిలకడగా బౌలింగ్ చేశారు. ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో కనిపిస్తున్నారు. సైని కూడా చేరడంతో బౌలింగ్ మరింత బలోపేతంగా మారింది. దీంతో భారత్ ఈ మ్యాచ్‌లో కూడా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
గెలుపే లక్షంగా..
ఇక ఆస్ట్రేలియా కూడా గెలుపే లక్షంగా మ్యాచ్‌కు సిద్ధమైంది. వార్నర్ రాకతో జట్టులో కొత్త ఉత్సాహం నెలకొంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన వార్నర్ విజృంభిస్తే ఆస్ట్రేలియా బ్యాటింగ్ కష్టాలు చాలా వరకు తీరిపోతాయి. అయితే సీనియర్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ వైఫల్యం జట్టును కలవరానికి గురిచేస్తోంది. ఇప్పటి వరకు ఆడిన నాలుగు ఇన్నింగ్స్‌లలోనూ స్మిత్ విఫలమయ్యాడు. ఒక్కసారి కూడా రెండంకెలా స్కోరును అందుకోలేక పోయాడు. కనీసం ఈ మ్యాచ్‌లోనైన తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచాలని జట్టు కోరుకుంటుంది. లబూషేన్, ట్రావిస్ హెడ్, గ్రీన్, వేడ్‌లతో పాటు కెప్టెన్ టిమ్‌పైన్ మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఎంతైన ఉంది. ఇక బౌలర్లు కూడా తమ జోరును కొనసాగించక తప్పదు. అప్పుడే ఆస్ట్రేలియాకు గెలుపు అవకాశాలు మెరుగవుతాయి.

IND vs AUS 3rd Test on Tomorrow in Sidney

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News