Monday, December 23, 2024

టీమిండియాకు సవాల్… నేటి నుంచి నాలుగో టెస్టు

- Advertisement -
- Advertisement -

టీమిండియాకు సవాల్
ఆత్మవిశ్వాసంతో ఆస్ట్రేలియా
నేటి నుంచి అహ్మదాబాద్‌లో నాలుగో టెస్టు
అహ్మదాబాద్: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరడమే లక్షంగా పెట్టుకున్న టీమిండియా గురువారం ఆస్ట్రేలియాతో ఆరంభమయ్యే చివరి టెస్టుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. తొలి రెండు మ్యాచుల్లో గెలిచిన భారత్‌కు ఇండోర్‌లో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన ఆస్ట్రేలియా టెస్టు ప్రపంచకప్ ఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇండోర్‌లో అనూహ్య ఓటమి పాలైన టీమిండియా ఫైనల్ అవకాశాలను క్లిష్టంగా మార్చుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే భారత్ డబ్లూటిసి టోర్నీలో తుది పోరుకు చేరే అవకాశాలుంటాయి.

ఒకవేళ మ్యాచ్ డ్రాగా ముగిసినా ఫైనల్ ఛాన్స్ క్లిష్టంగా మారుతోంది. ఇలాంటి స్థితిలో అహ్మదాబాద్ వేదికగా జరిగే నాలుగో, చివరి టెస్టులో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో భారత్ కనిపిస్తోంది. తొలి రెండు టెస్టుల్లో ఓడిన ఆస్ట్రేలియా మూడో మ్యాచ్‌లో అసాధారణ ఆటతో చెలరేగి పోయింది. రెండు ఇన్నింగ్స్‌లలోనూ భారత్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేసి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ఇదే జోరును అహ్మదాబాద్‌లోనూ కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆస్ట్రేలియా సమతూకంగా కనిపిస్తోంది. స్టీవ్ స్మిత్ సారథ్యం కూడా జట్టుకు సానుకూలంగా మారింది. భారత్ పిచ్‌లపై మంచి అవగాహన ఉన్న స్మిత్ ఈ మ్యాచ్‌లోనూ జట్టును గెలిపించి సిరీస్‌ను సమయం చేయాలని తహతహలాడుతున్నాడు. ఇక ఇప్పటికే రెండు మ్యాచుల్లో గెలిచిన ఆతిథ్య భారత్ సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఆఖరి మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్‌తో పాటు టెస్టు ప్రపంచకప్ ఫైనల్‌కు చేరాలని భావిస్తోంది.

బ్యాటింగే అసలు సమస్య..
సిరీస్‌లో టీమిండియాను బ్యాటింగ్ సమస్య వెంటాడుతోంది. ఇప్పటి వరకు జరిగిన మూడు టెస్టుల్లోనూ జట్టుకు బ్యాటింగ్ సమస్యగా మారింది. బ్యాటింగ్ వైఫల్యం జట్టును కలవరానికి గురిచేస్తోంది. సొంత గడ్డపై జరుగుతున్న సిరీస్‌లోనూ బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్క మ్యాచ్‌లోనే సత్తా చాటాడు. కెఎల్ రాహుల్ తొలి రెండు టెస్టుల్లో పూర్తిగా విఫలమయ్యాడు.

దీంతో అతనికి మూడో టెస్టులో చోటు లేకుండా పోయింది. రాహుల్ స్థానంలో జట్టులోకి వచ్చిన శుభ్‌మన్ గిల్ కూడా విఫలమయ్యాడు. అతను కూడా సత్తా చాటలేక పోయారు. సీనియర్లు విరాట్ కోహ్లి, చటేశ్వర్ పుజారాలు కూడా తమ స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచడంలో విఫలమవుతున్నారు. వీరి వైఫల్యం జట్టుపై బాగానే ప్రభావం చూపుతోంది. గతంలో టెస్టుల్లో పరుగుల వరద పారించిన కోహ్లి ఇటీవల కాలంలో వరుస వైఫల్యాలు చవిచూస్తున్నాడు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా కోహ్లి తన బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఉంది. పుజారా కూడా ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నాడు. ఇండోర్ మ్యాచ్‌లో మాత్రమే కాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేశాడు. కీలకమైన అహ్మదాబాద్ మ్యాచ్‌లో పుజారా, కోహ్లిలపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్, వికెట్ కీపర్ శ్రీకర్ భరత్‌లు తుది జట్టులో చోటు దక్కడం కష్టంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే ఇషాన్ కిషన్‌కు జట్టులో స్థానం ఖాయం.

బౌలింగే బలం..
ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియాకు బౌలింగే ప్రధాన అస్త్రంగా మారింది. స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు అద్భుతంగా రాణిస్తున్నారు. వీరిద్దరూ ప్రతి మ్యాచ్‌లోనూ నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. ఈసారి కూడా వీరిపై జట్టు భారీ నమ్మకాన్ని పెట్టుకుంది. అక్షర్ పటేల్ కూడా బాగానే బౌలింగ్ చేస్తున్నాడు. తాజాగా సీనియర్ బౌలర్ షమీ కూడా జట్టులోకి వచ్చాడు. ఇది కూడా టీమిండియాకు కలిసి వచ్చే అంశమే.

సమరోత్సాహంతో..
మరోవైపు మూడో టెస్టులో భారత్‌పై సంచలన విజయం సాధించిన ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఈ టెస్టులోనూ గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తోంది. కుహ్నెమన్, నాథన్ లియాన్, మర్ఫిలతో బౌలింగ్ చాలా బలంగా ఉంది. ఇండోర్‌లో వీరు ఒంటిచేత్తో జట్టును గెలిపించారు. ఈసారి కూడా వీరిపై ఆస్ట్రేలియా భారీ ఆశలు పెట్టుకుంది. ఈ మ్యాచ్‌లో కూడా వీరు రాణిస్తే టీమిండియాకు ఇబ్బందులు ఖాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News