Saturday, November 23, 2024

భారత్ కఠిన సవాల్.. గెలిస్తేనే డబ్లూటిసి ఫైనల్‌కు

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో అనూహ్య ఓటమి పాలైన టీమిండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్‌ను క్లిష్టంగా మార్చుకుంది. భారత్ టెస్టు ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరాలంటే ఆస్ట్రేలియాతో గురువారం ప్రారంభమయ్యే చివరి టెస్టులో కచ్చితంగా గెలవాల్సిందే. ఆస్ట్రేలియా ఇప్పటికే డబ్లూటిసి ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. మరో బెర్త్ కోసం భారత్‌శ్రీలంకల మధ్య గట్టి పోటీ నెలకొంది.

శ్రీలంకతో పోల్చితే భారత్ ప్రస్తుతం మెరుగైన స్థితిలో ఉంది. అయితే న్యూజిలాండ్‌తో జరిగే రెండు టెస్టుల్లో లంక విజయం సాధిస్తే మాత్రం భారత్ ఫైనల్ రేసు నుంచి వైదొలగక తప్పదు. ఆస్ట్రేలియాతో భారత్ చివరి మ్యాచ్ డ్రా చేసినా ఫైనల్ బెర్త్ ఖరారు కాదు. అప్పుడూ కివీస్‌తో జరిగే సిరీస్‌లో శ్రీలంక రెండు టెస్టుల్లో ఓడితేనే భారత్‌కు తుదిపోరుకు చేరే అవకాశాలుంటాయి. ఒవేళ మ్యాచ్ డ్రా అయి శ్రీలంక ఒక్క టెస్టులో గెలిచినా టీమిండియా పరిస్థితి ఇరకాటంలో పడుతోంది. ఇలాంటి స్థితిలో అహ్మదాబాద్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించడం ఒక్కటే ఏకైక మార్గంగా కనిపిస్తోంది.

తేలికేం కాదు..
మరోవైపు మూడో టెస్టులో ఘోర పరాజయం పాలైన టీమిండియాకు అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియాతో జరిగే నాలుగో టెస్టు సవాల్‌గా మారింది. ఇండోర్ టెస్టు విజయంతో ఆస్ట్రేలియా ఆత్మవిశ్వాసం రెట్టింపయ్యింది. ఇలాంటి స్థితిలో కంగారూలను ఓడించాలంటే భారత్ అసాధారణ ఆటను కనబరచక తప్పదు. వరుసగా రెండు టెస్టుల్లో గెలిచిన టీమిండియాకు ఇండోర్‌లో ఆస్ట్రేలియా కోలుకోలేని దెబ్బతీసింది. ఈ ఓటమి భారత్ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ అవకాశాలను క్లిష్టంగా మార్చింది. ఈ మ్యాచ్‌లో భారత్ కనీసం డ్రాతో గట్టెక్కి ఉన్నా ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. ఇండోర్ మ్యాచ్ ఓటమితో రోహిత్ సేనపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఒత్తిడిని తట్టుకుని ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టును ఓడించడం టీమిండియాకు అంత తేలికేం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News