మన తెలంగాణ/ క్రీడా విభాగం: బోర్డర్‌గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో 184 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. మరోసారి టాపార్డర్ వైఫల్యంతో టీమిండియా ఓటమి చవిచూసింది. దీంతో 340 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. ఆసీస్ బౌలర్ల దాటికి 155 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-2 వెనుకబడింది. ఈ టెస్టులో యశస్వి జైశ్వాల్, నితీశ్ కుమార్, వాషింగ్టన్ సుందర్ మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. రెండు ఇన్నింగ్స్‌లలోనూ జైశ్వాల్ అద్భుతంగా రాణించాడు. ఇక ఈ ఓటమితో టీమిండియా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటిసి) ఫైనల్ అవకాశాలు మరింత సంక్లిష్టాంగా మారాయి.
శ్రీలంకఆస్ట్రేలియా సిరీసే కీలకం..
డబ్ల్యూటిసి 2023-25 ఫైనల్లో ఇప్పటికే దక్షిణాఫ్రికా అడుగుపెట్టింది. మరో బెర్త్ కోసం ఆస్ట్రేలియా, భారత్ మధ్య పోటీ నెలకొంది. మెల్‌బోర్న్ టెస్టు ఓటమితో భారత్ తమ ఫైనల్ ఆశలను కష్టంగా మారాయి. డబ్ల్యూటిసి 2023-25 పాయింట్ల పట్టికలో భారత్ మూడో స్ధానంలో కొనసాగుతోంది. ఈ ఓటమితో టీమిండియా విన్నింగ్ శాతం 52.77కి పడిపోయింది. ఈ విజయం ఆసీస్‌కు లాభించిందనే చెప్పొచ్చు. కంగారూలు తమ విన్నింగ్ శాతాన్ని 61.46కు చేరుకుంది. ఈ క్రమంలో భారత్ ఫైనల్‌కు చేరడం కాస్త కష్టమే. భారత్‌కు ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలుంది.
అదికూడా సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగే చివరి టెస్టు. కానీ ఆసీస్‌కు మరో మూడు మ్యాచ్‌లు ఆడనుంది. భారత్‌తో ఓ మ్యాచ్ శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది. అయితే భారత్ ఫైనల్‌కు చేరాలంటే.. సిడ్నీ వేదికగా జరగనున్న ఐదో టెస్టులో కచ్చితంగా గెలవాల్సిందే. ఈ మ్యాచ్ అనంతరం ఆసీస్, శ్రీలంకతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడనుంది. అయితే ఈ రెండింటిలో ఆస్ట్రేలియా ఒక్క మ్యాచ్‌లోనైనా ఓడాలి. అప్పుడే భారత్‌కు ఫైనల్‌కు చేరే అవకాశముంటుంది. అంటే భారత్ ఫైనల్ చేరాలంటే శ్రీలంకతో సిరీసే కీలకంగా మారనుంది. ఇక రెండు మ్యాచ్‌లూ డ్రాగా ముగిసినా భారత్ ఫైనల్ చేరే అవకాశం ఉంటుంది.