Thursday, January 23, 2025

సమరోత్సాహంతో భారత్.. నేడు ముంబైలో తొలి వన్డే

- Advertisement -
- Advertisement -

సమరోత్సాహంతో భారత్
భారీ ఆశలతో ఆస్ట్రేలియా
నేడు ముంబైలో తొలి వన్డే
మధ్యాహ్నం 1.30 గంటల నుంచి స్టార్ నెట్‌వర్క్‌లో
ముంబై: భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే వన్డే సమరానికి సర్వం సిద్ధమైంది. భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌కు సన్నాహకంగా పరిగణిస్తున్న ఈ సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఇరు జట్లు ఉన్నాయి. రెండు జట్లలోనూ అగ్రశ్రేణి క్రికెటర్లు ఉన్నారు. దీంతో టెస్టుల మాదిరిగానే వన్డే సమరం కూడా నువ్వానేనా అన్నట్టు సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో శుక్రవారం తొలి వన్డే జరుగనుంది. ఇప్పటికే టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకున్న ఆతిథ్య టీమిండియా వన్డేల్లోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని భావిస్తోంది.

తొలి వన్డే మ్యాచ్‌కు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేకుండా పోయాడు. అతని స్థానంలో ఈ మ్యాచ్‌కు హార్దిక్ పాండ్య సారథ్యం వహించనున్నాడు. మరోవైపు ఆస్ట్రేలియా టీమ్ కూడా రెగ్యూలర్ కెప్టెన్ పాట్ కమిన్స్ లేకుండా సిరీస్ బరిలోకి దిగుతోంది. ఈ సిరీస్ సీనియర్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇరు జట్లు కూడా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా కనిపిస్తున్నాయి. అయితే వన్డేల్లో భారత్‌పై ఆస్ట్రేలియాదే పైచేయిగా ఉంది. వన్డేల్లో ఆస్ట్రేలియా ఎక్కువ మ్యాచుల్లో గెలిచింది. అంతేగాక వన్డే ఫార్మాట్‌లో ఆస్ట్రేలియాకు అసాధారణ రికార్డు ఉంది. ఈ పరిస్థితుల్లో వన్డేల్లో కంగారూలను ఓడించి సిరీస్‌ను సొంతం చేసుకోవాలంటే టీమిండియా సర్వం ఒడ్డి పోరాడక తప్పదు.

ఓపెనర్లే కీలకం..
రోహిత్ శర్మ అందుబాటులో లేకుండా పోవడంతో ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశాలున్నాయి. ఇటీవల ముగిసిన టెస్టు సిరీస్‌లో గిల్ శతకంతో అలరించాడు. అంతేగాక కొంతకాలంగా వన్డేల్లో అత్యంత నిలకడైన ఆటను కనబరుస్తున్నాడు. దీంతో ఈ సిరీస్‌లో కూడా గిల్ జట్టుకు కీలకంగా మారాడు. న్యూజిలాండ్‌తో హైదరాబాద్ వేదికగా జరిగిన వన్డే మ్యాచ్‌లో గిల్ డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. ఇషాన్ కూడా కొంతకాలం క్రితం వన్డేల్లో డబుల్ సెంచరీ బాదేశాడు. ఇద్దరు ఫామ్‌లో ఉండడంతో భారత్‌కు శుభారంభం ఖాయంగా కనిపిస్తోంది.

విరాట్‌పై అందరి కళ్లు..
మరోవైపు చివరి టెస్టులో కళ్లు చెదిరే సెంచరీ కొట్టి జోరుమీదున్న సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లి సిరీస్‌కు ప్రధాన ఆకర్షణగా మారాడు. వన్డేల్లో అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. కొంతకాలంగా పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో కోహ్లి నిలకడగా రాణిస్తుండడమే దీనికి ప్రధాన కారణం. ఈ సిరీస్‌లో కూడా సత్తా చాటాలనే పట్టుదలతో కోహ్లి ఉన్నాడు. ఇక సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, కెఎల్ రాహుల్, రవీంద జడేజా తదితరులతో భారత బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. సిరాజ్, చాహల్, ఠాకూర్, షమి, ఉనద్కట్, ఉమ్రాన్ తదితరులతో బౌలింగ్ కూడా బలంగా కనిపిస్తోంది. దీంతో ఈ సిరీస్‌లో భారత్‌కే గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

తక్కువ అంచనా వేయలేం..
ఇదిలావుంటే ఆస్ట్రేలియాను కూడా తక్కువ అంచనా వేయలేం. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, లబుషేన్, స్టీవ్ స్మిత్, మాక్స్‌వెల్, అలెక్స్ కారే, కామెరూన్ గ్రీన్, మిఛెల్ మార్స్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. వీరిలో ఏ ఇద్దరు రాణించినా భారత్‌కు ఇబ్బందులు తప్పక పోవచ్చు. అష్టన్ అగర్, స్టోయినిస్, స్టార్క్, జంపా, అబాట్ తదితరులతో బౌలింగ్ కూడా బలంగా ఉంది. దీంతో ఆస్ట్రేలియా కూడా విజయమే లక్షంగా పోరుకు సిద్ధమైంది.

జట్ల వివరాలు:
భారత్: శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య (కెప్టెన్), రవీంద్ర జడేజా, సుందర్, షమి, సిరాజ్, చాహల్, శార్దూల్, అక్షర్, కుల్దీప్, ఉమ్రాన్, ఉనద్కట్.
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, స్మిత్ (కెప్టెన్), లబుషేన్, మాక్స్‌వెల్, అలెక్స్ కారే, కామెరూన్ గ్రీన్, అష్టన్ అగర్, సీన్ అబాట్, స్టార్క్, జంపా, మిఛెల్ మార్ష్, నాథన్ ఎలిస్, జోష్ ఇంగ్లిస్, స్టోయినిస్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News