అభిమానులకు షాక్… ఉప్పల్‌లో టి20మ్యాచ్ రద్దు
భారత్-ఆసీస్ మ్యాచ్ వేరే చోటికి మార్పు
హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యుత్తమ జట్లుగా పేరున్న భారత్‌ఆస్ట్రేలియా జట్ల మధ్య హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరగాల్సిన టి20 మ్యాచ్ రద్దయ్యింది. డిసెంబర్ 3న ఉప్పల్ వేదికగా జరగాల్సి ఉంది. అయితే అదే రోజు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో మ్యాచ్‌కు భద్రత కల్పించలేమని సైబరాబాద్ పోలీసులు చేతులెత్తేశారు. దీంతో చేసేదేమీ లేక భారత క్రికెట్ బోర్డు ఈ మ్యాచ్‌ను వేరే వేదికకు తరలించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారత్‌ఆస్ట్రేలియా టి20 మ్యాచ్ జరుగనుంది. ఈ విషయాన్ని బిసిసిఐ బుధవారం అధికారికంగా వెల్లడించింది.
కాగా, సొంత గడ్డపై జరుగుతున్న వరల్డ్‌కప్‌లో భారత్ ఆడే మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఉప్పల్ స్టేడియానికి దక్కలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వరల్డ్‌కప్ తర్వాత భారత్ ఆడే టి20 మ్యాచ్‌ను ఉప్పల్‌కు కేటాయించారు. కానీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈ మ్యాచ్‌ను కూడా వేరే చోటుకి తరలించక తప్పలేదు. ఇది హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు దిగ్భ్రాంతికి గురి చేసింది. అగ్రశ్రేణి జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ను ప్రత్యక్షంగా తిలకించాలని భావించిన నగర క్రికెట్ ప్రేమీకులకు నిరాశే మిగిలింది.