Friday, September 20, 2024

భారత్ అదరహో..

- Advertisement -
- Advertisement -

భారత్ అదరహో.. ఆస్ట్రేలియాపై ఘన విజయం
చెలరేగిన సిరాజ్, రాణించిన రహానె, గిల్

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు జనవరి ఏడు నుంచి సిడ్నీలో జరుగనుంది. ఇక బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన భారత్ చారిత్రక విజయాన్ని అందుకుంది. అంతేగాక ఈ గెలుపుతో తొలి టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకుంది. 133/6 ఓవర్‌నైట్ స్కోరుతో మంగళవారం నాలుగో రోజు బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియాను భారత బౌలర్లు 200 పరుగులకే పరిమితం చేశారు. తర్వాత 70 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 15.5 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. స్వల్ప లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ మరోసారి తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. ఐదు పరుగులు మాత్రమే చేసి స్టార్క్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఖాతా తెరవకుండానే ఔటైన మయాంక్ ఈసారి కూడా విఫలమయ్యాడు. ఆ వెంటనే సీనియర్ బ్యాట్స్‌మన్, మిస్టర్ డిపెండబుల్ చటేశ్వర్ పుజారా కూడా వెనుదిరిగాడు. పుజారా తన పేలవమైన ఫామ్ ఈ ఇన్నింగ్స్‌లోనూ కొనసాగిస్తూ మూడు పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. కమిన్స్‌కు ఈ వికెట్ దక్కింది.
గిల్, రహానె జోరు
దీంతో భారత్ 19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే ఆలౌట్ కావడంతో మరోసారి అలాంటి ఫలితమే పునరావృతం అవుతుందా అని అందరిలోనూ ఆందోళన మొదలైంది. అయితే యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి కెప్టెన్ అజింక్య రహానె మరో వికెట్ పడకుండానే జట్టుకు విజయం సాధించి పెట్టాడు. అరంగేట్రం టెస్టులోనే శుభ్‌మన్ అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న గిల్ ఏడు కళ్లు చెదిరే పోర్లతో 35 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన రహానె 3 ఫోర్లతో అజేయంగా 27 పరుగులు చేసి జట్టుకు చారిత్రక విజయం అందించాడు. తొలి టెస్టులో రహానె (112) చిరస్మరణీయ సెంచరీతో కదం తొక్కిన విషయం తెలిసిందే. ఇక గిల్ కూడా తొలి ఇన్నింగ్స్‌లో 45 పరుగులు చేశాడు. రహానెకు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది.
సిరాజ్ మ్యాజిక్
అంతకుముందు 133/6 స్కోరుతో నాలుగో రోజు బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా ఆరంభంలో కుదురుగా ఆడింది. కమిన్స్, గ్రీన్‌లు సమన్వయంతో ఆడుతూ మరో వికెట్ పడకుండా అడ్డుకున్నారు. ఈ జోడీని విడగొట్టేందుకు భారత బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇదే క్రమంలో ఇద్దరు కలిసి ఏడో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని కూడా నెలకొల్పారు. కానీ ప్రమాదకరంగా మారిన ఈ జంటను బుమ్రా విడగొట్టాడు. 103 బంతుల్లో 22 పరుగులు చేసిన కమిన్స్‌ను బుమ్రా వెనక్కి పంపాడు. దీంతో 57 పరుగుల పార్ట్‌నర్‌షిప్‌కు తెరపడింది. ఆ తర్వాత సిరాజ్ వెంటవెంటనే రెండు వికెట్లు తీసి ఆస్ట్రేలియా పతనాన్ని శాసించాడు. ఒంటరి పోరాటం చేసిన కామెరూన్ గ్రీన్ 146 బంతుల్లో ఐదు ఫోర్లతో 45 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. తర్వాత వచ్చిన నాథన్ లియాన్ (3)ను కూడా సిరాజ్ వెనక్కి పంపాడు. ఇక హాజిల్‌వుడ్ (10)ను అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేయడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 103.1 ఓవర్లలో 200 పరుగుల వద్ద ముగిసింది. భారత బౌలర్లలో సిరాజ్ మూడు, బుమ్రా, అశ్విన్, జడేజా రెండేసి వికెట్లు పడగొట్టారు. ఉమేశ్‌కు ఒక వికెట్ దక్కింది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 195 పరుగులు చేయగా భారత్ 326 పరుగులకు ఆలౌటైంది. టీమిండియాకు 131 పరుగుల ఆధిక్యం లభించింది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌కు విజయం కోసం 70 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. ఈ లక్ష్యాన్ని భారత్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.

IND vs AUS: Team India win by 8 wickets in 2nd Test

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News