నేటి నుంచి ఆస్ట్రేలియాతో రెండో టెస్టు
అడిలైడ్: బోర్డర్‌గవాస్కర్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం నుంచి ఆస్ట్రేలియాతో డేనైట్ పద్ధతిలో జరుగనున్న రెండో టెస్టు మ్యాచ్‌కు టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో రికార్డు విజయం సాధించిన భారత్ ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. ఇక మొదటి మ్యాచ్‌లో ఓటమి పాలైన ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు ఈసారి ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది.
కెప్టెన్ రోహిత్ శర్మ చేరికతో టీమిండియా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. శుభ్‌మన్ గిల్ కూడా పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడు. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్ విజయమే లక్షంగా పెట్టుకుంది. రోహిత్ రాకతో రాహుల్ ఈ మ్యాచ్‌లో మిడిలార్డర్‌లో బరిలో దిగే అవకాశాలున్నాయి. కిందటి మ్యాచ్‌లో రాహుల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. కానీ ఈ మ్యాచ్‌లో యశస్వితో కలిస కెప్టెన్ రోహిత్ ఓపెనర్‌గా రానున్నాడు. సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లి గాయం గురించి జట్టు యాజమాన్యం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. అతను బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లో జట్టు ఆశలన్నీ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌పైనే ఆధారపడి ఉన్నాయి.
అతను ఫామ్‌లో ఉండడం జట్టుకు అతి పెద్ద ఊరటగా చెప్పాలి. రోహిత్, రిషబ్, రాహుల్, కోహ్లి, గిల్ తదితరులతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక బుమ్రా, సిరాజ్, హర్షిత్, వాషింగ్టన్‌లతో బౌలింగ్ కూడా బాగానే ఉంది. రెండు విభాగాల్లోనూ బలంగా ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. మరోవైపు ఆతిథ్య ఆస్ట్రేలియాకు ఈ మ్యాచ్ సవాల్‌గా మారింది. పింక్‌బాల్ టెస్టులో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలని తహతహలాడుతోంది.