Friday, December 20, 2024

నేటి నుంచి రెండో టెస్టు.. క్లీన్‌ స్వీప్‌పై భారత్ కన్ను

- Advertisement -
- Advertisement -

కాన్పూర్: బంగ్లాదేశ్‌తో శుక్రవారం ప్రారంభమయ్యే రెండో టెస్టుకు టీమిండియా ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. చెన్నైలో జరిగిన తొలి టెస్టులో ఘన విజయం సాధించిన భారత్ ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తోంది. చెన్నైలో చిత్తుగా ఓడిన బంగ్లాదేశ్‌కు ఈ టెస్టు సవాల్‌గా మారింది. సిరీస్‌ను సమం చేయాలంటే కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి బంగ్లాకు నెలకొంది. అయితే మొదటి టెస్టులో గెలిచి జోరుమీదున్న భారత్‌ను ఓడించి సిరీస్‌ను సమం చేయడం బంగ్లాకు శక్తికి మించిన పనిగానే విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న టీమిండియాకే ఈ మ్యాచ్‌లో గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. కాగా, కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో ఈ పోరు జరుగుతుంది.

రోహిత్ ఈసారైనా..
తొలి టెస్టులో ఘోరంగా విఫలమైన భారత కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. చెన్నైలో రెండు ఇన్నింగ్స్‌లలో కూడా రోహిత్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా రోహిత్ బ్యాట్‌ను ఝులిపించాల్సిన అవసరం ఉంది. జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత రోహిత్‌పై నెలకొంది. రానున్న ఆస్ట్రేలియా సిరీస్ నేపథ్యంలో ఈ మ్యాచ్ రోహిత్‌కు కీలకంగా తయారైంది. ఇందులో రాణిస్తే కంగారూ సిరీస్‌కు ఆత్మవిశ్వాసం సిద్ధమయ్యే ఛాన్స్ ఉంటుంది. మరోవైపు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా మెరుపులు మెరిపించక తప్పదు. తొలి టెస్టులో యశ్వసి మొదటి ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీ సాధించాడు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో కూడా సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నాడు.

విరాట్‌కు పరీక్ష..
మరోవైపు సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లికి ఈ మ్యాచ్ సవాల్‌గా మారింది. ఒక మాటలో చెప్పాలంటే కాన్పూర్ టెస్టు విరాట్‌కు పరీక్ష వంటిదేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చెన్నై టెస్టులో కోహ్లి ఘోరంగా విఫలమయ్యారు. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 23 పరుగులే చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాట్‌ను ఝులిపించాల్సిన స్థితి కోహ్లికి ఏర్పడింది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన కోహ్లి కొంత కాలంగా వరుస వైఫల్యాలు చవిచూస్తున్నాడు. దీంతో అతనిపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు కోహ్లి స్థానంలో ఇతర బ్యాటర్లకు అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఈసారి కూడా విఫలమైతే కోహ్లి మరిన్ని విమర్శలను ఎదుర్కొవడం ఖాయం.

జోరు సాగాలి..
మొదటి టెస్టులో శతకాలతో చెలరేగిన రవిచంద్రన్ అశ్విన్, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్‌లపై జట్టు ఈసారి కూడా భారీ ఆశలు పెట్టుకుంది. ఈ మ్యాచ్‌లో కూడా వీరు మెరుగైన ఆటను కనబరుస్తారనే నమ్మకంతో జట్టు యాజమాన్యం ఉంది. రిషబ్ ఫామ్‌లోకి రావడం టీమిండియాకు అతి పెద్ద ఊరటగా చెప్పాలి. గిల్ కూడా రెండో ఇన్నింగ్స్‌లో శతకంతో అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్ సెంచరీతో జట్టుకు అండగా నిలిచాడు. చెన్నైలో ఇటు బ్యాట్‌తో అటు బంతితో అలరించిన అశ్విన్ ఈ మ్యాచ్‌లో కూడా సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. రవీంద్ర జడేజా రూపంలో మరో అగ్రశ్రేణి ఆల్‌రౌండర్ ఉండనే ఉన్నాడు. అంతేగాక బుమ్రా, సిరాజ్, ఆకాశ్‌దీప్‌లతో బౌలింగ్ కూడా చాలా బలంగా ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

కచ్చితంగా గెలవాల్సిందే..
ఇక, బంగ్లాదేశ్‌కు ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది. సిరీస్‌ను సమం చేయాలంటే ఈ మ్యాచ్‌లో గెలవడం తప్పించి మరో మార్గం బంగ్లాదేశ్‌కు లేదు. ఇలాంటి స్థితిలో బంగ్లా టీమ్ తీవ్ర ఒత్తిడిలో ఉంది. దీన్ని తట్టుకుని ముందుకు సాగడం బంగ్లాకు సవాల్‌గా తయారైంది. అయితే ప్రతిభావంతులైన ఆటగాళ్లతో కూడిన బంగ్లాదేశ్‌నే తక్కువ అంచనా వేయలేం. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లు జట్టులో ఉన్నారు. దీంతో కాన్పూర్‌లో బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు గట్టి పోటీ ఎదురైనా ఆశ్చర్యం లేదు.

జట్ల వివరాలు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కెఎల్ రాహుల్, రిషబ్ ంపత్, రవీంద్ర జడేజా, అశ్విన్, సర్ఫరాజ్ ఖాన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ధ్రువ్ జురెల్, బుమ్రా, ఆకాశ్ దీప్, సిరాజ్.

బంగ్లాదేశ్: మహ్మదుల్ హసన్ జాయ్, షద్మన్ ఇసలామ్, జాకిర్ హసన్, మోమినుల్ హక్, నజ్ముల్ హుస్సేన్ షాంటో (కెప్టెన్), రహీం, షకిబ్, లిటన్ దాస్, జాకేర్ అలీ, మెహదీ హసన్ మిరాజ్, ఖాలేద్ అహ్మద్, హసన్ మహమూద్, తస్కిన్ అహ్మద్, నాహిద్ రాణా, తైజుల్ ఇస్లామ్, నయీం హసన్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News