Monday, December 23, 2024

సెమీసే లక్ష్యంగా టీమిండియా

- Advertisement -
- Advertisement -

నేడు బంగ్లాదేశ్‌తో కీలక పోరు

అంటిగువా: టి20 ప్రపంచకప్‌లో భాగంగా శనివారం బంగ్లాదేశ్‌తో జరిగే సూపర్8 మ్యాచ్‌కు టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ను ఓడించిన భారత్ ఈ మ్యాచ్‌లో రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. ఈ పోరులో గెలిచి సెమీస్ బెర్త్‌ను దక్కించుకోవాలని భావిస్తోంది. కిందటి మ్యాచ్‌లో భారత్‌ను బ్యాటింగ్ సమస్య వెంటాడింది. కీలక ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, శివమ్ దూబె తదితరులు మెరుగైన స్కోరును సాధించడంలో విఫలమయ్యారు. వీరి వైఫల్యం జట్టును కలవరానికి గురిచేస్తోంది. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా వీరు తమ తమ బ్యాట్లకు పని చెప్పాల్సిన అవసరం ఉంది. కోహ్లి ఈ వరల్డ్‌కప్‌లో ఒక్కసారి కూడా హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకోలేక పోయాడు. అఫ్గాన్‌పై కూడా 24 పరుగులు మాత్రమే చేశాడు.

ఈ మ్యాచ్ కోహ్లి తన స్థాయికి తగ్గ ఆటను కనబరచాలని అభిమానులు కోరుకుంటున్నారు. కోహ్లి వైఫల్యం జట్టు బ్యాటింగ్‌పై బాగానే ప్రభావం చూపుతోంది. కెప్టెన్ రోహిత్ కూడా అఫ్గాన్‌పై విఫలమయ్యాడు. అతను 8 పరుగులు మాత్రమే చేశాడు. పంత్ ధాటిగా ఆడినా భారీ స్కోరును సాధించలేక పోయాడు. దూబె కూడా 10 పరుగులే సాధించాడు. రవీంద్ర జడేజా (7), అక్షర్ పటేల్ (12) కూడా నిరాశ పరిచారు. అయితే సూర్యకుమార్ యాదవ్ తన మార్క్ ఆటతో చెలరేగి పోయాడు. ఇది టీమిండియాకు అతి పెద్ద ఊరటగా చెప్పాలి. ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా సూర్యకు ఉంది. అతను చెలరేగితే ప్రత్యర్థి జట్టు బౌలర్లకు కష్టాలు తప్పవు. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ జట్టుకు చాలా కీలకంగా మారాడు. అతను ఎలా బ్యాటింగ్ చేస్తాడనే దానిపై టీమిండియా భారీ స్కోరు ఆధారపడి ఉంది. ఇక హార్దిక్ పాండ్య కూడా ఫామ్‌లో ఉండడం జట్టుకు కలిసి వచ్చే అంశమే.

కిందటి మ్యాచ్‌లో హార్దిక్ మెరుగ్గా బ్యాటింగ్ చేశాడు. ఈసారి కూడా అతని నుంచి ఇలాంటి ప్రదర్శనే జట్టు ఆశిస్తోంది. బౌలింగ్‌లో కూడా భారత్ చాలా బలంగా ఉంది. కిందటి మ్యాచ్‌లో స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా అసాధారణ బౌలింగ్‌ను కనబరిచాడు. 4 ఓవర్లలో ఏడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంతేగాక మూడు వికెట్లను కూడా పడగొట్టాడు. అక్షర్ పటేల్, కుల్దీప్, జడేజాలు కూడా పొదుపుగా బౌలింగ్ చేశారు. అర్ష్‌దీప్ అఫ్గాన్ మ్యాచ్‌లో మూడు వికెట్లను పడగొట్టాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్‌కు సెమీ ఫైనల్ బెర్త్ దాదాపు ఖాయమవుతుంది.

సవాల్ వంటిదే..

మరోవైపు తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన బంగ్లాదేశ్‌కు ఈ పోరు సవాల్‌గా మారింది. సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి బంగ్లాకు నెలకొంది. కానీ పటిష్టమైన భారత్‌ను ఓడించడం బంగ్లాకు అనుకున్నంత తేలిక కాదనే చెప్పాలి. తొలి మ్యాచ్‌లో కీలక ఆటగాళ్లు విఫలమయ్యారు. ఇది జట్టు ఓటమికి ప్రధాన కారణంగా చెప్పాలి. ఈ మ్యాచ్‌లోనైనా ఆటగాళ్లు సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది. అప్పుడే జట్టుకు గెలుపు అవకాశాలుంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News