Thursday, December 26, 2024

 రెండో టెస్టుకు వర్షం అడ్డంకి

- Advertisement -
- Advertisement -

కాన్పూర్: భారత్‌బంగ్లాదేశ్ జట్ల మధ్య శుక్రవారం ప్రారంభమైన రెండో, చివరి టెస్టుకు వర్షం అడ్డంకిగా మారింది. భారీ వర్షం వల్ల తొలి రోజు కేవలం 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. టాస్ ఆరంభానికి ముందే వర్షం ఇబ్బందిగా మారింది. వర్షం కారణంగా గంట ఆలస్యంటా టాస్‌ను వేయాల్సి వచ్చింది. ఉదయం 10 గంటలకు టాస్ వేశారు. 10.30 ఆట ప్రారంభమైంది. గురువారం రాత్రి నుంచి వర్షం కురువడంతో మైదానం చిత్తడిగా మారింది. దీంతో ఆట ఆలస్యంగా ప్రారంభం కావాల్సి వచ్చింది. టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్‌ను ఎంచుకుంది. వర్షం వల్ల పిచ్ బౌలర్లకు అనుకూలంగా మారింది. దీన్ని భారత ఫాస్ట్ బౌలర్ ఆకాశ్‌దీప్ సద్వినియోగం చేసుకున్నాడు. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని తనకు అనువుగా మార్చుకున్నాడు. ఇదే క్రమంలో బంగ్లా ఓపెనర్లు షద్మాన్ ఇస్లామ్, జకీర్ హసన్‌లను అతను ఔట్ చేశాడు. జకీర్ హసన్ (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. షద్మాన్ 24 పరుగులు చేసి ఔటయ్యాడు.

ఆదుకున్న శాంటో, హక్

ఈ దశలో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యతను కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో తనపై వేసుకున్నాడు. అతనికి మాజీ కెప్టెన్ మోమినుల్ హక్ అండగా నిలిచాడు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. శాంటో, హక్‌లు కుదురుగా ఆడడంతో బంగ్లా క్రమంగా కోలుకుంది. లంచ్ విరామ సమయానికి బంగ్లాదేశ్ స్కోరు రెండు వికెట్లకు 74 పరుగులకు చేరింది. కాగా, లంచ్ బ్రేక్‌కు ముందు మళ్లీ చినుకులు ప్రారంభమయ్యాయి. అయితే కొద్ది సేపులోనే వర్షం ఆగిపోయింది. 15 నిమిషాలు ఆలస్యంగా ఆట తిరిగి ప్రారంభమైంది. ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే బంగ్లాదేశ్‌కు షాక్ తగిలింది. కుదురుగా ఆడుతున్న కెప్టెన్ శాంటోను అశ్విన్ ఎల్బీగా వెనక్కి పంపాడు.

దీంతో 51 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన శాంటో 57 బంతుల్లో ఆరు ఫోర్లతో 31 పరుగులు చేశాడు. మరోవైపు మోమినుల్ హక్ తన పోరాటాన్ని కొనసాగించాడు. 81 బంతుల్లో 40 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. ఈ సమయంలో మళ్లీ భారీ వర్షం పడడంతో ఆట ముందుకు సాగలేదు. ఆటను నిలిపి వేసే సమయానికి బంగ్లాదేశ్ 35 ఓవర్లలో 3 వికెట్లకు 107 పరుగులు చేసింది. ముష్ఫికుర్ రహీం (6) నాటౌట్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో ఆకాశ్‌దీప్ రెండు, అశ్విన్ ఒక వికెట్ పడగొట్టారు. కాగా, రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 10 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News