Saturday, September 21, 2024

పట్టుబిగించిన భారత్

- Advertisement -
- Advertisement -

చెలరేగిన బుమ్రా, సత్తా చాటిన సిరాజ్, ఆకాశ్‌దీప్
బంగ్లాదేశ్ 149 ఆలౌట్
భారత్ రెండో ఇన్నింగ్స్ 81/3

చెన్నై: బంగ్లాదేశ్‌తో చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య భారత జట్టు పైచేయి సాధించింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులకు ఆలౌటైంది. జవాబుగా మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన బంగ్లాదేశ్ 149 పరుగులకే కుప్పకూలింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ చేపట్టిన భారత్ శుక్రవారం ఆట ముగిసే సమయానికి 23 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. ఓవరాల్‌గా భారత్ ఇప్పటి వరకు 308 పరుగుల ఆధిక్యం సాధించి మ్యాచ్ పట్టుబిగించింది.

ఆరంభంలోనే..

భారత్‌ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేశామన్న ఆనందం బంగ్లాదేశ్‌కు ఎక్కువ సేపు నిలువలేదు. తొలి ఇన్నింగ్స్ ఆరంభంలోనే బంగ్లా వరుస క్రమంలో వికెట్లను కోల్పోయింది. ఫాస్ట్ బౌలర్లు జస్‌ప్రిత్ బుమ్రా, సిరాజ్, ఆకాశ్‌దీప్‌లు పోటీ పడి వికెట్లు పడగొట్టడంతో బంగ్లాదేశ్ మళ్లీ కోలుకోలేక పోయింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే బుమ్రా ఓపెనర్ షద్మన్ ఇస్లామ్(2)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. కొద్ది సేపటికే ఆకాశ్‌దీప్ బంగ్లాకు కోలుకోలేని దెబ్బ తీశాడు. అతను వరుస బంతుల్లో ఓపెనర్ జాకిర్ హసన్ (3), మోమినుల్ హక్ (0)లను క్లీన్‌బౌల్డ్ చేశాడు. మరోవైపు కుదురుగా ఆడుతున్న కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాంటో (20)ను సిరాజ్ వెనక్కి పంపాడు. ఆ వెంటనే ముష్ఫికుర్ రహీం (8)ను బుమ్రా పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో బంగ్లాదేశ్ 40 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది.

ఈ దవలో షకిబ్ అల్ హసన్, వికెట్ కీపర్ లిటన్ దాస్ కొద్ది వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఇద్దరు సమన్వయంతో ఆడుతూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. ఈ జోడీని విడగొట్టేందుకు భారత బౌలర్లు కొద్ది సేపు నిరీక్షించాల్సి వచ్చింది. కానీ 42 బంతుల్లో 3 ఫోర్లతో 22 పరుగులు చేసి లిటన్ దాస్‌ను రవీంద్ర జడేజా వెనక్కి పంపాడు. ఆ వెంటనే షకిబ్ కూడా ఔటయ్యాడు. 64 బంతుల్లో ఐదు ఫోర్లతో 32 పరుగులు చేసి షకిబ్‌ను కూడా జడేజా ఔట్ చేశాడు. చివర్లో మెహదీ హసన్ మిరాజ్ (27) నాటౌట్ ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది.

హసన్ మహమూద్ (9), తస్కిన్ అహ్మద్ (11), నామిద్ రాణా (11)లు విఫలమయ్యారు. దీంతో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 47.1 ఓవర్లలో 149 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో బుమ్రా నాలుగు, సిరాజ్, ఆకాశ్‌దీప్, జడేజాలు రెండేసి వికెట్లను పడగొట్టారు. టీమిండియాకు తొలి ఇన్నింగ్స్‌లో 227 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ చేపట్టిన భారత్‌కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఈసారి కూడా భారత్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (10), రోహిత్ శర్మ (5)లు విఫలమయ్యారు. ఇక జట్టును ఆదుకుంటాడని భావించిన సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా నిరాశ పరిచాడు. కోహ్లి (17) పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.

అయితే శుభ్‌మన్ గిల్ 64 బంతుల్లో 33 (బ్యాటింగ్) జట్టుకు అండగా నిలిచాడు. అతనికి వికెట్ కీపర్ రిషబ్ పంత్ 12 (బ్యాటింగ్) సహకారం అందిస్తున్నాడు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులకు ఆలౌటైంది. కిందటి స్కోరుకు కేవలం పది పరుగులు మాత్రమే జోడించి మిగిలిన వికెట్లను కోల్పోయింది. రవీంద్ర జడేజా (86), రవిచంద్రన్ అశ్విన్ (113) పరుగులు చేసి ఔటయ్యారు. ఆకాశ్‌దీప్ (17) పరుగులు సాధించాడు. బంగ్లా బౌలర్లలో హసన్ మహమూద్ ఐదు, తస్కిన్ అహ్మద్ మూడు వికెట్లను పడగొట్టారు. కాగా, భారత్‌బంగ్లాదేశ్‌ల మధ్య రెండు టెస్టు మ్యాచ్‌లు జరుగనున్నాయి. రెండో మ్యాచ్‌కు కాన్పూర్ ఆతిథ్యం ఇవ్వనుంది. టెస్టు సిరీస్ తర్వాత బంగ్లా మూడు టి20మ్యాచ్‌లు ఆడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News