మరో సమరానికి సై.. నేడు తొలి వన్డే
ఆత్మవిశ్వాసంతో భారత్, ప్రతీకారం కోసం ఇంగ్లండ్
పుణె: సుదీర్ఘ సిరీస్‌లో భాగంగా ఇప్పటికే టెస్టులు, ట్వంటీ20లను పూర్తి చేసుకున్న ఇంగ్లండ్, భారత్ క్రికెట్ జట్లు వన్డే సమరానికి సిద్ధమయ్యాయి. ఇరు జట్ల మధ్య మంగళవారం తొలి వన్డే జరుగనుంది. ఇప్పటికే టెస్టు, టి20 సిరీస్‌లను గెలుచుకున్న టీమిండియా వన్డేల్లో సమరోత్సాహంతో బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇరు జట్ల సమతూకంగా కనిపిస్తున్నాయి. దీంతో వన్డే సిరీస్ కూడా హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. మంగళవారం పుణె వేదికగా మధ్యాహ్నం 1.30 గంటల నుంచి తొలి వన్డే జరుగనుంది. ఇరు జట్ల మధ్య మొత్తం మూడు వన్డేలు జరుగనున్నాయి. అన్ని మ్యాచ్‌లు కూడా పుణెలో నిర్వహిస్తున్నారు. కీలక ఆటగాళ్లందరూ ఫామ్‌లో ఉండడం భారత్‌కు కలిసి వచ్చే అంశంగా మారింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే కెప్టెన్ విరాట్ కోహ్లి ధ్రువీకరించాడు.
ధావన్‌కు కీలకం..
ఇక ఈ సిరీస్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కు కీలకంగా మారింది. తొలి ట్వంటీ20లో విఫలం కావడంతో తర్వాతి మ్యాచ్‌లకు జట్టులో చోటు కోల్పోయాడు. అయితే వన్డేల్లో ధావన్‌కు మెరుగైన రికార్డు ఉండడంతో ఓపెనర్‌గా అతన్నే బరిలోకి దించాలని కెప్టెన్ కోహ్లి భావిస్తున్నాడు. రోహిత్ శర్మంతో కలిసి ధావన్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. ఇక యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు ఈ సిరీస్‌లో ఛాన్స్ దొరకడం కష్టంగానే కనిపిస్తోంది. మరోవైపు కెఎల్.రాహుల్‌ను మిడిలార్డర్‌లో దించాలనే ఉద్దేశంతో జట్టు యాజమాన్యం ఉంది. దీంతో రాహుల్ ఓపెనర్‌గా దిగే పరిస్థితులు ఏమాత్రం లేవనే చెప్పాలి. ఇక స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఫామ్‌లో ఉండడం భారత్‌కు కలిసి వచ్చే అంశం. చివరి టి20లో రోహిత్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగి పోయాడు. ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నాడు. రోహిత్, ధావన్‌లలో ఎవరూ నిలదొక్కుకున్నా భారత్‌కు శుభారంభం ఖాయం.
కోహ్లి జోరు సాగాలి..
మరోవైపు టి20 సిరీస్‌లో పరుగుల వరద పారించిన కెప్టెన్ కెప్టెన్ విరాట్ కోహ్లి వన్డేల్లోనూ చెలరేగి పోయేందుకు సిద్ధమయ్యాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన కోహ్లి విజృంభిస్తే ఇంగ్లండ్ బౌలర్ల కష్టాలు రెట్టింపు కావడం తథ్యం. పొట్టి సిరీస్‌లో మూడు అర్ధ సెంచరీలతో సత్తా చాటిన కోహ్లి వన్డేల్లో కూడా పరుగుల వరద పారించాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు. అంతేగాక చాలా రోజులుగా సెంచరీకి దూరంగా ఉన్న కోహ్లి ఈసారి ఆ లోటును తీర్చుకోవాలనే భావిస్తున్నాడు. ఇక జట్టు కూడా కోహ్లిపై భారీ ఆశలు పెట్టుకుంది.
సూర్యపై అందరి కళ్లు
ఆరంగేట్రం సిరీస్‌లోనే విధ్వంసక బ్యాటింగ్‌తో అదరగొట్టిన యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌పై అందరి దృష్టి నెలకొంది. టి20 సిరీస్‌లో సూర్యకుమార్ అద్భుతంగా రాణించాడు. ధాటిగా ఆడుతూ ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తించాడు. వన్డేల్లో కూడా అదే జోరును కొనసాగించేందుకు తహతహలాడుతున్నాడు. అయితే అతనికి తుది జట్టులో చోటు దక్కుతుందా లేదా అనే దానిపై స్పష్టత లేదు. శ్రేయస్ అయ్యర్ కూడా ఫామ్‌లో ఉండడంతో సూర్యకుమార్ తుది జట్టులో స్థానం కోసం తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నాడు. ఒకవేళ సీనియర్ రాహుల్‌ను పక్కన బెట్టాలని జట్టు యాజమాన్యం భావిస్తే సూర్యకుమార్, అయ్యర్‌లకు తుది జట్టులో స్థానం ఖయమనే చెప్పాలి. మరోవైపు రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యల రూపంలో భారత్‌కు హార్డ్ హిట్టర్లు ఉండనే ఉన్నారు. ఇటు రిషబ్ అటు హార్దిక్ ఫామ్‌లో ఉండడం కూడా జట్టుకు ఊరటనిచ్చే అంశమే. ఇక శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌ల రూపంలో కూడా మెరుగైన ఆల్‌రౌండర్లు ఉండనే ఉన్నారు. భువనేశ్వర్, నటరాజన్, సైని, శార్దూల్, సిరాజ్ తదితరులతో బౌలింగ్ కూడా బలంగా ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్ ఫెవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
బదులు తీర్చుకునేందుకు..
ఇక ఇంగ్లండ్ కూడా వన్డే సిరీస్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇప్పటికే టెస్టు, టి20 సిరీస్‌లను కోల్పోయిన ఇంగ్లండ్ కనీసం వన్డేల్లోనైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. టి20లలో భారత్‌కు గట్టి పోటీ ఇచ్చింది. వన్డేల్లో కూడా మెరుగైన ప్రదర్శన చేయాలని భావిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు సమతూకంగా కనిపిస్తోంది. అయితే కెప్టెన్ మోర్గాన్ పేలవమైన ఫామ్ జట్టును కలవరానికి గురిచేస్తోంది. బట్లర్, రాయ్, బెయిర్‌స్టో, బెన్‌స్టోక్స్, శామ్ కరన్, మోయిన్ వంటి మ్యాచ్ విన్నర్లు జట్టులో ఉన్నారు. అయితే నిలకడలేమి ఇంగ్లండ్‌కు ప్రతికూలంగా మారింది. ఈ మ్యాచ్‌లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఆడాలని మోర్గాన్ సేన భావిస్తోంది. కాగా, ఇరు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ నువ్వానేనా అన్నట్టు సాగడం ఖాయమనే చెప్పాలి.
IND vs ENG 1st ODI on March 23