టీమిండియాకు సవాల్
ఆత్మవిశ్వాసంతో ఇంగ్లండ్, నేడు తొలి టి20
సౌతాంప్టన్: వరుస విజయాలతో జోరుమీదున్న ఇంగ్లండ్ భారత్‌తో గురువారం జరిగే తొలి టి20 మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఇక టీమిండియాకు ఈ మ్యాచ్ సవాల్ వంటిదేనని చెప్పాలి. జోస్ బట్లర్ సారథ్యంలోని ఇంగ్లండ్ చాలా బలంగా ఉంది. ఇటీవల జరిగిన సిరీస్‌లలో బట్లర్ అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగి పోయిన విషయం తెలిసిందే. ఐపిఎల్‌లో కూడా బట్లర్ అదరగొట్టాడు. ఇక ప్రపంచంలోనే అత్యంత విధ్వంసక బ్యాటర్‌గా బట్లర్‌కు పేరుంది. అతనికి కెప్టెన్సీ బాధ్యతలు కూడా లభించడంతో అతను మరింత చెలరేగి పోయే అవకాశాలున్నాయి. మోయిన్ అలీ, డేవిడ్ మలాన్, జాసన్ రాయ్, బ్రూక్, శామ్ కరన్,లివింగ్‌స్టోన్, డేవిడ్ విల్లీ తదితరులతో ఇంగ్లండ్ బ్యాటింగ్ బలోపేతంగా ఉంది. అంతేగాక జోర్డాన్, కరన్, మోయిన్ అలీ వంటి ఆల్‌రౌండర్లు ఉండనే ఉన్నారు. మరోవైపు సొంత గడ్డపై సిరీస్ జరుగుతుండడం కూడా ఇంగ్లండ్‌కు కలిసి వచ్చే అంశంగా చెప్పొచ్చు. ఇలాంటి స్థితిలో ఇంగ్లండ్ సిరీస్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
పరీక్షలాంటిదే..
ఇక టీమిండియాకు సిరీస్ పరీక్షలాంటిదేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రోహిత్ కరోనా బారిన పడడంతో టెస్టు మ్యాచ్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియాకు ఘోర పరాజయం ఎదురైంది. అయితే రోహిత్ జట్టులో చేరడం మాత్రం టీమిండియాకు ఊరటనిచ్చే అంశంగానే చెప్పొచ్చు. సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా, బుమ్రా తదితరులు తొలి టి20కి అందుబాటులో ఉండడం లేదు. ఇది జట్టుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కానీ సూర్యకుమార్, దినేశ్ కార్తీక్, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా వంటి మ్యాచ్ విన్నర్ బ్యాటర్లు జట్టులో ఉన్నారు. అంతేగాక హార్దిక్ పాండ్య, వెంకటేశ్ అయ్యర్, అక్షర్ పటేల్‌ల రూపంలో మెరుగైన ఆల్‌రౌండర్లు ఉండడం కూడా కలిసి వచ్చే అంశమే. అయితే రోహిత్‌కు తగినంత ప్రాక్టీస్ లేక పోవడం మాత్రం జట్టుకు ఇబ్బందికర అంశమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
IND vs ENG 1st T20 Match Today