Sunday, January 19, 2025

ఉప్పల్ లో భారత్-ఇంగ్లండ్ తొలి టెస్టు: టికెట్ల అమ్మకం ఎప్పుడంటే..?

- Advertisement -
- Advertisement -

 22 నుంచి జింఖానాలో ఆఫ్‌లైన్‌లో విక్రయాలు
 25 వేల మంది విద్యార్థులకు కాంప్లిమెంటరీ పాసులు, ఉచిత భోజనం
 రిపబ్లిక్ డే రోజు భారత సాయుధ దళాల కుటుంబాలకు ఫ్రీ ఎంట్రీ
 హెచ్‌సిఎ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు

మనతెలంగాణ/ హైదరాబాద్: ఈనెల 25 నుంచి ఉప్పల్ స్టేడియంలో ప్రారంభం కానున్న భారత్-ఇంగ్లండ్ తొలి టెస్టు మ్యాచ్ టిక్కెట్ల అమ్మకాలు 18వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్టు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు వెల్లడించారు. టిక్కెట్ల అమ్మకాలపై హెచ్‌సిఎ కార్యవర్గ సభ్యులతో సమీక్షా అనంతరం ఆయన వివరాలు తెలియజేశారు. 18వ తేదీ నుంచి పేటీఎం ఇన్సైడర్ యాప్‌లలో టిక్కెట్లను ఆన్‌లైన్‌లో, 22వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో పాటు జింఖానా మైదానంలో ఆఫ్‌లైన్‌లోనూ టికెట్లను విక్రయిస్తామని ఆయన ప్రకటించారు. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు 22వ తేదీ నుంచి ఏదైనా తమ ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపించి, టిక్కెట్లను తీసుకోవచ్చన్నారు.

రిపబ్లిక్ డే రోజున వారికి ఫ్రీ..
కేంద్రంగా దేశం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న భారత సాయుధ దళాల సిబ్బందిని రిపబ్లిక్ డే రోజున (26వ తేదీ) మ్యాచ్ చూసేందుకు ఉచితంగా అనుమతించనున్నామని, తెలంగాణలో పని చేస్తున్న భారత సాయుధ బలగాల(ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్) సిబ్బందికి వారి కుటుంబాలతో కలిసి ఉచితంగా మ్యాచ్ చూసేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఆసక్తి గల వారు తమ విభాగాధిపతితో సంతకం చేయించిన లేఖ, కుటుంబ సభ్యుల వివరాలను ఈనెల 18వ తేదీలోపు హెచ్‌సిఎ సిఇఒకి ఈ-మెయిల్ చేయాలని సూచించారు.

300లకు పైగా స్కూల్స్ నుంచి అర్జీలు
ఈ మ్యాచ్‌లో స్కూల్ విద్యార్థులకు రోజుకు ఐదు వేలు చొప్పన, మొత్తం 5 రోజులకు గానూ 25 వేల కాంప్లిమెంటరీ పాసులు కేటాయించామని, ఈ 25 వేల మందికి ఉచితంగా భోజనం, తాగునీరు అందించనున్నామని తెలిపారు. విద్యార్థులను ఉచితంగా అనుమతిస్తామని ప్రకటించనప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా సుమారు 300లకు పైగా పాఠశాలల నుంచి అర్జీలు వచ్చాయని, వారితో తమ సిబ్బంది సంప్రదింపులు నడుతున్నారని జగన్మోహన్ రావు చెప్పారు. పాఠశాలల యాజమాన్యాలు తమ విద్యార్థుల పేరు, క్లాస్ సహా పూర్తి వివరాలను పంపించాలన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా స్కూల్ యూనిఫామ్‌లో ఐడి కార్డ్స్ వెంట తీసుకొని రావాలని, స్టేడియంలోకి ప్రవేశించాక విద్యార్థుల బాధ్యత సంబంధిత పాఠశాల సిబ్బందిదేనని చెప్పారు.
టిక్కెట్ల ధరలు
టెస్టు మ్యాచ్ టిక్కెట్ ప్రారంభ ధర కనిష్ఠంగా రూ.200 కాగా, గరిష్ఠంగా రూ.4 వేలుగా నిర్ణయించామని జగన్మోహన్ రావు చెప్పారు. సామాన్యులను దృష్టిలో పెట్టుకుని, అందరికి అందుబాటులో ఉండేలాగా ధరలను నిర్ణయించినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News