కటక్: ఇంగ్లండ్‌తో ఆదివారం కటక్ వేదికగా జరిగే రెండో వన్డేకు ఆతిథ్య టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని తహతహలాడుతోంది. ఇక ఇంగ్లండ్‌కు ఈ మ్యాచ్ సవాల్‌గా మారింది. సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఇంగ్లీష్ టీమ్ తీవ్ర ఒత్తిడిలో కనిపిస్తోంది. ఇలాంటి స్థితిలో భారత్‌కు ఎంత వరకు పోటీ ఇస్తుందో అంతుబట్టకుండా మారింది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లు ఇరు జట్లలోనూ ఉన్నారు. దీంతో కటక్ వన్డే కూడా ఆసక్తికరంగా సాగడం ఖాయమనే చెప్పాలి.
ఓపెనర్లు ఈసారైనా?
తొలి వన్డేలో భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మలు ఘోరంగా విఫలమయ్యారు. వీరు జట్టుకు శుభారంభం అందించలేక పోయారు. కెప్టెన్ రోహిత్ శర్మ తన పేలవమైన ఫామ్‌ను కొనసాగిస్తూ రెండు పరుగులకే పెవిలియన్ చేరాడు. ఆరంగేట్రం మ్యాచ్ ఆడిన యశస్వి కూడా నిరాశ పరిచాడు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా వీరు తమ తమ బ్యాట్‌లకు పనిచెప్పాల్సిన అవసరం ఉంది. మరోవైపు గాయం వల్ల తొలి వన్డేకు దూరంగా ఉన్న సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లి ఈసారి బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. కోహ్లి స్థానంలో తొలి వన్డే ఆడిన శ్రేయస్ అయ్యర్ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. దీంతో రెండో వన్డేలో అతన్ని తప్పించే పరిస్థితి లేదు. ఈ క్రమంలో ఓ బౌలర్‌పై వేటు వేసే అవకాశం ఉంది. అదే జరిగితే కుల్దీప్ యాదవ్ బెంచ్‌కు పరిమితమైనా ఆశ్చర్యం లేదు. శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, రాహుల్, హార్దిక్, రవీంద్ర జడేజా తదితరులతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక షమి, హర్షిత్ రాణా, జడేజా, అక్షర్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు జట్టులో ఉన్నారు. తొలి వన్డేలో రాణించిన జడేజా, హర్షిత్‌లపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది.
గెలిచి తీరాల్సిందే..
మరోవైపు పర్యాటక ఇంగ్లండ్‌కు కటక్ వన్డే చావోరేవోగా తయారైంది. సిరీస్‌లో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే. తీవ్ర ఒత్తిడి నెలకొన్న నేపథ్యంలో బలమైన భారత్‌ను ఓడించడం ఇంగ్లండ్‌కు అనుకున్నంత తేలికేం కాదని చెప్పాలి. తొలి వన్డేలో ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్‌లు శుభారంభం అందించినా ఫలితం లేకుండా పోయింది. జో రూట్, హారీ బ్రూక్, లివింగ్‌స్టోన్ వంటి కీలక ఆటగాళ్లు విఫలమయ్యారు. అయితే కెప్టెన్ జోస్ బట్లర్, జాకబ్ బెతెల్‌లు అర్ధ సెంచరీలతో రాణించడం జట్టుకు ఊరటనిచ్చే అంశంగా చెప్పాలి. ఇక ఈ మ్యాచ్‌లో గెలవాలంటే ఇంగ్లండ్ సర్వం ఒడ్డి పోరాడక తప్పదు. అప్పుడే జట్టుకు గెలుపు అవకాశాలుంటాయి.
సిరీస్‌పై భారత్ కన్ను.. నేడు ఇంగ్లండ్ తో రెండో వన్డే
- Advertisement -
- Advertisement -
- Advertisement -