Tuesday, November 5, 2024

అదరగొట్టిన రూట్

- Advertisement -
- Advertisement -

Ind vs Eng 2nd test:England lead 5 runs

రాణించిన ఇషాంత్, సిరాజ్, రసవత్తరంగా లార్డ్స్ టెస్టు

లండన్: భారత్‌-ఇంగ్లండ్ జట్ల మధ్య లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. ఇంగ్లండ్ కెప్టెన్ కెప్టెన్ జో రూట్ అజేయ శతకంతో చెలరేగడంతో ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో మెరుగైన స్కోరును సాధించింది. ఇక భారీ ఆధిక్యం సాధించడం ఖాయమని భావించిన ఆతిథ్య జట్టును కీలక సమయంలో కట్టడి చేయడంలో టీమిండియా బౌలర్లు సఫలమయ్యారు. సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మ, హైదరాబాది యువ సంచలనం మహ్మద్ సిరాజ్ అసాధారణ బౌలింగ్‌తో ఇంగ్లండ్‌కు భారీ ఆధిక్యం దక్కకుండా చూశారు. శనివారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ చేపట్టిన ఆతిథ్య జట్టుకు కెప్టెన్ జో రూట్, స్టార్ బ్యాట్స్‌మన్ బెయిర్‌స్టో అండగా నిలిచారు. ఇద్దరు భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. ఈ జోడీని ఔట్ చేసేందుకు టీమిండియా బౌలర్లు చేసిన ప్రయత్నాలు చాలా సేపటి వరకు ఫలించలేదు. ఇక పిచ్ కూడా బౌలింగ్‌కు సహకరించలేదు. దీంతో రూట్, బెయిర్‌స్టో ఎలాంటి ఇబ్బంది లేకుండా స్కోరును నడిపించారు.

ఈ జంటను విడగొట్టేందుకు కోహ్లి తరచూ బౌలర్లను మార్చినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో వీరిద్దరూ నాలుగో వికెట్‌కు కీలకమైన 121 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సమన్వయంతో ఆడిన బెయిర్‌స్టో 7 ఫోర్లతో 57 పరుగులు చేసి సిరాజ్ చేతికి చిక్కాడు. ఇక తర్వాత వచ్చిన జోస్ బట్లర్ కూడా రూట్‌కు అండగా నిలిచాడు. ధాటిగా ఆడిన బట్లర్ 4 ఫోర్లతో 23 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు మోయిన్ అలీ అండతో రూట్ తన పోరాటాన్ని కొనసాగించాడు. మోయిన్ అలీ 4 ఫోర్లతో 27 పరుగులు చేసి ఇషాంత్ చేతికి చిక్కాడు. అయితే తర్వాతి బంతికే శామ్ కరన్ (౦)ను ఇషాంత్ వెనక్కి పంపాడు. కానీఒకవైపు వికెట్లు పడుతున్న రూట్ తన పోరాటాన్ని కొనసాగించాడు. ఒలీ రాబిన్సన్ (6), మార్క్‌వుడ్ 4 (నాటౌట్) అతనికి అండగా నిలిచారు. తాజా సమాచారం లభించే సమయానికి ఇంగ్లండ్ 8 వికెట్ల నష్టానికి 369 పరుగులు చేసింది. కెప్టెన్ రూట్ 309 బంతుల్లో 15 ఫోర్లతో 165 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. దీంతో ఇంగ్లండ్‌కు ఇప్పటి వరకు ఐదు పరుగులు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News