Thursday, January 30, 2025

నేడు మూడో టి20.. ఇంగ్లండ్‌కు సవాల్‌..

- Advertisement -
- Advertisement -

రాజ్‌కోట్: వరుస విజయాలతో జోరుమీదున్న ఆతిథ్య మంగళవారం ఇంగ్లండ్‌తో జరిగే మూడో టి20 మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే లక్షంతో కనిపిస్తోంది. రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఇక ఈ మ్యాచ్ ఇంగ్లండ్‌కు చావోరేవోగా మారింది. సిరీస్ కోల్పోకుండా ఉండాలంటే పోరులో తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే తొలి రెండు టి20 మ్యాచ్‌లలో ఓడడంతో ఇంగ్లండ్ ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బతింది. ఇలాంటి స్థితిలో మూడో టి20 పర్యాటక టీమ్‌కు సవాల్‌గా తయారైంది. ఈ మ్యాచ్‌లో ఓడితే సిరీస్ చేజారిపోతోంది. దీంతో ఇంగ్లీష్ టీమ్ తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయింది. ఒత్తిడిని తట్టుకుని విజయం సాధించాలంటే ఇంగ్లండ్ అసాధారణ ఆటను కనబరచక తప్పదు. మరోవైపు టీమిండియా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ఇప్పటికే రెండు విజయాలు సాధించడంతో జోరుమీదుంది. రాజ్‌కోట్‌లోనూ సమరభేరి మోగించేందుకు తహతహలాడుతోంది.

అయితే టీమిండియాను కూడా బ్యాటింగ్ సమస్య వెంటాడుతోంది. కీలక ఆటగాళ్లు ఫామ్‌లో లేరు. తొలి టి20లో అభిషేక్ శర్మ, రెండో టి20లో హైదరాబాదీ తిలక్ వర్మ మాత్రమే రాణించారు. ఈ మ్యాచుల్లో వీరిద్దరూ జట్టును ఒంటిచేత్తో విజయం సాధించి పెట్టారు. మిగతా బ్యాటర్లు మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నారు. ఓపెనర్ సంజు శాంసన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌లు తమ స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచడంలో విఫలమవుతున్నారు. వీరి వైఫల్యం జట్టుకు ఇబ్బందిగా మారింది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన సంజు, సూర్య పేలవమైన బ్యాటింగ్‌తో నిరాశ పరుస్తున్నారు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా వీరు తమ బ్యాట్‌లకు పని చెప్పాల్సిన అవసరం ఉంది. లేకుంటే రాజ్‌కోట్ మ్యాచ్‌లోనూ జట్టుకు బ్యాటింగ్ ఇబ్బందులు ఖాయం.

ఇక ఈసారి కూడా తిలక్‌వర్మ జట్టుకు కీలకంగా మారాడు. రెండు టి20లలో కూడా తిలక్ జట్టును ముందుండి నడిపించాడు. మూడో టి20లోనూ అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. అభిషేక్ వర్మ కూడా విధ్వంసక ఇన్నింగ్స్ ఆడక తప్పదు. తొలి టి20లో అభిషేక్ చెలరేగి ఆడిన సంగతి తెలిసిందే. కానీ చెన్నై మ్యాచ్‌లో విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో మాత్రం మళ్లీ చెలరేగాలనే పట్టుదలతో ఉన్నాడు. ధ్రువ్ జురేల్, హార్దిక్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్‌లతో టీమిండియా బ్యాటింగ్ బలంగా ఉంది. కానీ వీరు ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నారు. దీంతో రెండు టి20లలో కూడా భారత్‌కు బ్యాటింగ్ కష్టాలు తప్పలేదు. అయితే మూడో టి20లో టాప్ ఆర్డర్ రాణిస్తే ఈ సమస్య చాలా వరకు తీరిపోతుంది. మరోవైపు టీమిండియా బౌలర్లు జోరుమీదున్నారు. ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్‌తో పాటు స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ తదితరులు అద్భుత బౌలింగ్‌ను కనబరుస్తున్నారు. రెండు మ్యాచుల్లోనూ బౌలర్లు అద్భుత ప్రతిభతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈసారి కూడా వీరిపై జట్టు భారీ ఆశలను పెట్టుకుంది.

సవాల్ వంటిదే..
మరోవైపు ఇంగ్లండ్‌కు ఈ మ్యాచ్ సవాల్‌గా మారింది. సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే కచ్చితంగా ఈ మ్యాచ్‌లో గెలవక తప్పదు. తీవ్ర ఒత్తిడి నెలకొన్న నేపథ్యంలో ఇంగ్లండ్ ఎలా ఆడుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. బ్యాటింగ్ వైఫల్యం జట్టుకు ఇబ్బందిగా మారింది. ఒక్క కెప్టెన్ జో రూట్ తప్ప మిగతా వారు బ్యాటింగ్‌లో తేలిపోతున్నారు. దీంతో రెండు మ్యాచుల్లోనూ ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు. ఫిలిప్ సాల్ట్, హ్యారి బ్రూక్, లివింగ్‌స్టోన్, బెన్ డకెట్, జేమీ స్మిత్, బ్రైడన్ కార్స్ వంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లు జట్టులో ఉన్నా ఫలితం లేకుండా పోతోంది. ఈ మ్యాచ్‌లోనూ బ్యాటర్లు రాణించాల్సిన స్థితి జట్టుకు నెలకొంది. లేకుంటే హ్యాట్రిక్ ఓటమి ఖాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News