Sunday, November 17, 2024

కోహ్లి, శార్దూల్ ఒంటరి పోరాటం.. భారత్ 191 ఆలౌట్

- Advertisement -
- Advertisement -

భారత్ 191 ఆలౌట్.. కోహ్లి, శార్దూల్ ఒంటరి పోరాటం,
 చెలరేగిన వోక్స్, రాబిన్సన్
లండన్ (ఓవల్): ఇంగ్లండ్‌తో గురువారం ప్రారంభమైన నాలుగో టెస్టులో టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే ఆలౌటైంది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన భారత్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో ఇంగ్లండ్ బౌలర్లు సఫలమయ్యారు. టీమిండియాలో కెప్టెన్ విరాట్ కోహ్లి, శార్దూల్ ఠాకూర్‌లు మాత్రమే రాణించారు. మిగతావారు ఘోరంగా విఫలమయ్యారు. దీంతో భారత్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ తక్కువ స్కోరుకే ఆలౌటైంది. చివర్లో శార్దూల్ రాణించడం వల్లే టీమిండియా ఆ మాత్రమైన స్కోరును చేయగలిగింది.
ఆరంభంలోనే..
తొలుత బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. జట్టును ఆదుకుంటారని భావించిన ఓపెనర్లు రోహిత్ శర్మ, కెఎల్.రాహుల్‌లు మరోసారి నిరాశ పరిచారు. రోహిత్ 27 బంతుల్లో ఒక ఫోర్‌తో 11 పరుగులు చేసి వోక్స్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. వోక్స్ వేసిన అద్భుత బంతికి రోహిత్ వికెట్ల వెనకాల దొరికి పోయాడు. దీంతో భారత్ 28 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. అదే స్కోరు వద్ద రాహుల్ కూడా పెవిలియన్ చేరాడు. 44 బంతుల్లో మూడు ఫోర్లతో 17 పరుగులు చేసిన అతన్ని రాబిన్సన్ వెనక్కి పంపాడు.
తీరుమారని పుజారా
ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న టీమిండియాను ఆదుకుంటాడని భావించిన సీనియర్ ఆటగాడు, మిస్టర్ డిపెండబుల్ చటేశ్వర్ పుజారా నిరాశ పరిచాడు. 31 బంతులు ఆడిన పుజారా 4 పరుగులు మాత్రమే చేసి అండర్సన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో భారత్ 39 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది.
కోహ్లి పోరాటం
ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను కెప్టెన్ విరాట్ కోహ్లి తనపై వేసుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగాడు. అతనికి జడేజా కొద్ది సేపు సహకారం అందించాడు. అయితే రెండు ఫోర్లతో పది పరుగులు చేసి జడేజాను వోక్స్ వెనక్కి పంపాడు. తర్వాత వచ్చిన రహానె కూడా ఆశించిన స్థాయిలో బ్యాటింగ్ చేయలేక పోయాడు. మరోవైపు కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి 8 ఫోర్లతో 50 పరుగులు చేసి వెనుదిరిగాడు. రహానె(14), రిషబ్ పంత్(9) మరోసారి విఫలమయ్యారు.
శార్దూల్ జోరు
ఒక దశలో 127 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన టీమిండియాను యువ ఆటగాడు శార్దూల్ ఠాకూర్ ఆదుకున్నాడు. ఉమేశ్ యాదవ్ అండతో శార్దూల్ చెలరేగి పోయాడు. ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడి చేసిన శార్దూల్ వరుస ఫోర్లు, సిక్సర్లతో ప్రకంపనలు సృష్టించాడు. చెలరేగి ఆడిన శార్దూల్ 36 బంతుల్లోనే ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 57 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో భారత్ స్కోరు 191 పరుగులకు చేరింది. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ నాలుగు, రాబిన్సన్ మూడు వికెట్లు పడగొట్టారు.

IND vs ENG 4th Test: India 191 all out on Day 1

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News