Saturday, November 16, 2024

టీమిండియాకు సవాల్ వంటిదే..

- Advertisement -
- Advertisement -

లండన్: ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగే ఏకైక టెస్టు మ్యాచ్ టీమిండియాకు సవాల్ వంటిదేనని చెప్పాలి. కిందటి సిరీస్‌లో భారత్‌ఇంగ్లండ్ జట్ల మధ్య జరగాల్సిన ఐదో, చివరి టెస్టును కరోనా కారణంగా అర్ధాంతరంగా నిలిపి వేశారు. అప్పటికే సిరీస్‌లో టీమిండియా 21 ఆధిక్యంలో నిలిచింది. కాగా అప్పట్లో నిలిచి పోయిన ఐదో టెస్టును రీషెడ్యూల్ చేశారు. జులై ఒకటి నుంచి రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ టెస్టులోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తున్న టీమిండియాకు ఇంగ్లండ్ నుంచి గట్టి పోటీ ఎదురవ్వడం ఖాయగా కనిపిస్తోంది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో ఇంగ్లండ్ అసాధారణ ఆటతో చెలరేగి పోతోంది. ఇప్పటి వరకు జరిగిన రెండు టెస్టుల్లోనూ చిరస్మరణీయ విజయాలను సొంతం చేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇంగ్లండ్ సమతూకంగా కనిపిస్తోంది. కొత్త కెప్టెన్ బెన్ స్టోక్స్ సారథ్యంలో ఇంగ్లండ్ వరుస విజయాలతో జోరుమీదుంది. ఇప్పటికే కివీస్‌పై సిరీస్‌ను సొంతం చేసుకున్న స్టోక్స్ సేన చివరి మ్యాచ్‌లోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని తహతహలాడుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి రానున్న భారత్ మాచ్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలని భావిస్తోంది. ఇలాంటి స్థితిలో ఇంగ్లండ్‌ను ఓడించి సిరీస్‌ను సొంతం చేసుకోవడం టీమిండియాకు అనుకున్నంత తేలిక కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చాలా రోజులుగా టెస్టు మ్యాచ్‌లకు దూరంగా ఉండడం కూడా భారత్‌కు ఇబ్బంది కలిగించే అంశమే. తగినంత ప్రాక్టీస్ లేకుండానే ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా తలపడనుంది. మరోవైపు ఇంగ్లండ్ ఇప్పటికే కివీస్‌తో టెస్టు సిరీస్ ఆడడం వారికి కలిసివచ్చే అంశంగా చెప్పాలి.

ఇక జో రూట్, బెయిర్‌స్టో, స్టోక్స్, ఒలి పోప్స్, జాక్ క్రాలి, అలెక్స్ లీస్ వంటి మ్యాచ్ విన్నర్లు ఇంగ్లండ్ జట్టులో ఉన్నారు. అంతేగాక అండర్సన్, బ్రాడ్, స్టోక్స్, లీచ్ తదితరులతో బౌలింగ్ కూడా పటిష్టంగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియాకు ఈ టెస్టు మ్యాచ్ చాలా కీలకంగా మారింది. మరోవైపు కెఎల్.రాహుల్ అందుబాటులో లేకుండా పోవడం కూడా భారత్‌కు ఇబ్బందికర అంశమే. ఈ నేపథ్యంలో సీనియర్లు పుజారా, కోహ్లి, రోహిత్, విహారి, జడేజా తదితరులు తమ స్థాయికి తగ్గ ఆటను కనబరచక తప్పదు. అప్పుడే టీమిండియాకు గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. అయితే ఇప్పటికే సిరీస్‌లో ఆధిక్యంలో ఉండడంతో భారత్ ఎలాంటి ఒత్తిడి లేకుండా ఈ మ్యాచ్ బరిలోకి దిగనుంది. ఒకవేళ ఈ టెస్టులో ఓడినా సిరీస్ డ్రాగానే ముగుస్తోంది. ఇంగ్లండ్ మాత్రం సిరీస్‌ను సమం చేయాలంటే కచ్చితంగా గెలవక తప్పదు. కాగా ఏకైక టెస్టు మ్యాచ్‌కు ముందు లీసెస్టర్‌షైర్‌తో జరిగే నాలుగో రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌ను సద్వినియోగం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఇక టెస్టు మ్యాచ్ కోసం భారత్ ఇప్పటికే సాధనను ప్రారంభించింది.

IND vs ENG 5th Test Match from July 1st

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News