ఆత్మవిశ్వాసంతో భారత్, గెలుపు కోసం ఇంగ్లండ్
నేటి నుంచి రాజ్‌కోట్‌లో మూడో టెస్టు
స్టోక్స్‌కు ప్రత్యేకం..
ఈ మ్యాచ్ ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌కు చాలా ప్రత్యేకమని చెప్పాలి. స్టోక్స్ కెరీర్‌లో ఇది వందో టెస్టు మ్యాచ్ కావడం విశేషం. దీంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా జట్టును గెలిపించి తీపి జ్ఞాపకంగా మలచుకోవాలని భావిస్తున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇంగ్లండ్ బలంగానే ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కు కూడా గెలుపు అవకాశాలు బాగానే ఉన్నాయి. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం.
రాజ్‌కోట్: భారత్‌ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే మూడో టెస్టు మ్యాచ్‌కు రాజ్‌కోట్ సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు 11తో సమంగా ఉన్నాయి. తొలి టెస్టులో ఇంగ్లండ్, రెండో టెస్టులో భారత్ విజయం సాధించాయి. దీంతో ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఈ టెస్టులో గెలిచి మళ్లీ ఆధిక్యంలోకి దూసుకెళ్లాలనే పట్టుదలతో రెండు జట్లు ఉన్నాయి. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ కెరీర్‌లో ఇది వందో టెస్టు మ్యాచ్ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి తమ కెప్టెన్ బెన్‌స్టోక్స్ అరుదైన బహుమతి ఇవ్వాలనే లక్షంతో ఇంగ్లండ్ పోరుకు సిద్ధమైంది. ఇక విశాఖలో ఘన విజయం సాధించిన టీమిండియా ఈ మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. సీనియర్లు విరాట్ కోహ్లి, కెఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌లు లేకున్నా టీమిండియా బలంగానే ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు సమతూకంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు, మరో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. రవీంద్ర జడేజాకు రాజ్‌కోట్ సొంత మైదానం కావడంతో అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. అశ్విన్ రూపంలో భారత్‌కు మరో మ్యాచ్ విన్నర్ బౌలర్ ఉండనే ఉన్నాడు. బుమ్రా జోరుమీదుండడం భారత్‌కు అతి పెద్ద ఊరటగా చెప్పాలి. సిరాజ్, ముకేశ్ కుమార్, ఆకాశ్‌దీప్‌లలో ఎవరికీ తుది జట్టులో స్థానం దక్కుతుందనేది ఆసక్తిగా మారింది. సిరాజ్‌కే ఎక్కువ ఛాన్స్ కనిపిస్తోంది.
అందరి కళ్లు యశస్విపైనే..
ఈ మ్యాచ్‌లో అందరి కళ్లు టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌పైనే నిలిచాయి. విశాఖ టెస్టులో యశస్వి కళ్లు చెదిరే డబుల్ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో కూడా అతనే జట్టుకు కీలకంగా మారాడు. యశస్వి తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే ఇంగ్లండ్ బౌలర్లకు మరోసారి కష్టాలు తప్పక పోవచ్చు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ జట్టును కలవరానికి గురిచేస్తోంది. ఇప్పటి వరకు ఆడిన నాలుగు ఇన్నింగ్స్‌లలో కూడా రోహిత్ ఆశించిన స్థాయిలో రాణించలేక పోయాడు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా తన బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సర్ఫరాజ్‌కు ఛాన్స్ దక్కేనా?
ఇదిలావుంటే రెండో టెస్టులో బెంచ్‌కే పరిమితమైన యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్‌కు ఈ మ్యాచ్‌లోనైనా తుది జట్టులో స్థానం లభిస్తుందా లేదా అనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్న సర్ఫరాజ్‌కు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించే ఛాన్స్ మాత్రం దక్కడం లేదు. కీలక ఆటగాళ్లు రాహుల్, కోహ్లి, శ్రేయస్ తదితరులు అందుబాటులో లేని సమయంలో సర్ఫరాజ్‌ను ఆడించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. తుది జట్టులో స్థానం కోసం సర్ఫరాజ్, పటిదార్, దేవ్‌దుత్ పడిక్కల్‌ల మధ్య గట్టి పోటీ నెలకొంది. వీరిలో ఎవరికీ ఛాన్స్ దొరుకుతుందో చెప్పడం కష్టమే. మరోవైపు బుమ్రా, జడేజా, అశ్విన్‌లతో భారత బౌలింగ్ చాలా బలంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని సాధించే సత్తా ఈ ముగ్గురి సొంతం. కిందటి మ్యాచ్‌లో బుమ్రా ఏకంగా తొమ్మిది వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నాడు.