డబ్లిన్: టీమిండియాలో స్థానాన్ని శాశ్వతం చేసుకోవాలని భావిస్తున్న యువ ఆటగాళ్లకు మరో ఛాన్స్ లభించింది. ఐర్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు శుక్రవారం తెరలేవనుంది. స్పీడ్‌స్టర్ బుమ్రా సారథ్యంలో యువ క్రికెటర్లతో కూడిన టీమిండియా సిరీస్‌కు సిద్ధమైంది. ఇటీవల వెస్టిండీస్ జరిగిన టి20 సిరీస్‌లో జట్టుకు ప్రాతినిథ్యం వహించిన పలువురు క్రికెటర్లకు ఈసారి కూడా జట్టులో చోటు లభించింది. తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్, అర్ష్‌దీప్ సింగ్, సంజూ శాంసన్ తదితరులు జట్టుకు ఎంపికయ్యారు. అయితే హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ తదితరులు సిరీస్‌కు దూరమయ్యారు. వీరి స్థానంలో వాషింగ్టన్ సుందర్, రింకు సింగ్, శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్, రవి బిష్ణోయ్ తదితరులు జట్టులోకి వచ్చారు.
అందరి కళ్లు బుమ్రాపైనే..
ఇక టీమిండియా స్టార్ బౌలర్ జస్‌ప్రిత్ బుమ్రా సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ బరిలోకి దిగుతున్నాడు. గాయాల కారణంగా బుమ్రా చాలా కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఇటీవలే అతను గాయాల నుంచి పూర్తిగా కోలుకున్నాడు. దీంతో అతనికి ఐర్లాండ్ సిరీస్‌లో చోటు కల్పించారు. అంతేగాక అతనికి కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగించారు. రానున్న ఆసియా కప్, ప్రపంచకప్ వంటి మెగా టోర్నమెంట్‌ల నేపథ్యంలో బుమ్రా ఎలా ఆడుతాడనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ సిరీస్‌లో బౌలింగ్‌తో పాటు జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత అతనిపై నెలకొంది. మూడు ఫార్మాట్‌లలోనూ ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా ఉన్న బుమ్రా కొంతకాలంగా గాయాలతో సతమతమవుతున్నాడు. ఈ క్రమంలో పలు సిరీస్‌లకు అతను అందుబాటులో లేకుండా పోయాడు. ప్రస్తుతం అతను పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. ఐర్లాండ్ సిరీస్ కోసం బుమ్రా ముమ్మర సాధనలో నిమగ్నమయ్యాడు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో వైద్యుల పర్యవేక్షణలో చాలా రోజులు గడిపిన బుమ్రా ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడు. ఈ సిరీస్ కోసం ఇప్పటికే సాధన కూడా ప్రారంభించాడు.
ఆ ఇద్దరే కీలకం..
మరోవైపు సిరీస్‌లో యువ ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్‌లు ప్రత్యేక ఆకర్షణగా మారారు. ఐపిఎల్‌లో పరుగుల వరద పారించిన వీరిద్దరూ టీమిండియాలోనూ అదే జోరును కొనసాగించాలని తహతహలాడుతున్నారు. యశస్వి ఇప్పటికే విండీస్ సిరీస్‌లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. రుతురాజ్ కూడా సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇక విండీస్ సిరీస్‌లో పరుగుల వర్షం కురిపించిన తెలుగుతేజం తిలక్ వర్మ కూడా ఇదే లక్షంతో ఉన్నాడు. ఈ సిరీస్‌లో కూడా అతను జట్టుకు కీలకంగా మారాడు. ఐర్లాండ్ సిరీస్‌లో రాణించడం ద్వారా రానున్న ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ టోర్నీల్లో జట్టులో చోటు సంపాదించాలని భావిస్తున్నాడు. ఇదిలావుంటే సంజూ శాంసన్‌కు సిరీస్ పరీక్షగా మారింది. విండీస్ సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించడంలో విఫలమైన సంజూకు సెలెక్టర్లు మరో ఛాన్స్ ఇచ్చారు. ఈసారైనా సంజూ మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఐర్లాండ్‌పై విఫలమైతే మాత్రం సంజూకు రానున్న రోజుల్లో టీమిండియాలో స్థానం సంపాదించడం చాలా క్లిష్టంగా మారుతోంది. కాగా, యువ ఆటగాళ్లు రింకు సింగ్, శివమ్ దూబేలు కూడా సిరీస్‌కు ప్రత్యేక ఆకర్షణగా తయారయ్యారు. వీరిద్దరూ ఐపిఎల్‌లో కళ్లు చెదిరే ప్రదర్శనతో అలరించాడు. ఐర్లాండ్ సిరీస్‌లో కూడా సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు.
తక్కువ అంచనా వేయలేం..
ఇదిలావుంటే ఆతిథ్య ఐర్లాండ్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ ఆండ్రూ బాల్‌బర్ని, వికెట్ కీపర్ లొర్కాన్ టక్కర్, గారెథ్ డెలానీ, కర్టిస్ కాంఫెర్, డాక్‌రెల్, మార్క్ అడైర్ వంటి స్టార్ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. దీనికి తోడు సొంత గడ్డపై ఆడుతుండడం ఐర్లాండ్‌కు సానుకూల అంశంగా చెప్పాలి. అంతేగాక టీమిండియా కీలక ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగుతుండడం కూడా వారికి కలిసి వచ్చే అంశమే. దీంతో సిరీస్‌లో ఐర్లాండ్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది.