Monday, December 23, 2024

హార్దిక్‌కు సవాల్ వంటిదే..

- Advertisement -
- Advertisement -

వెల్లింగ్టన్: టి20 ప్రపంచకప్‌లో పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచిన టీమిండియాకు న్యూజిలాండ్‌తో జరిగే టి20 సిరీస్ సవాల్‌గా మారింది. ఈ సిరీస్‌లో భారత్ మూడు మ్యాచ్‌లు ఆడనుంది. రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతి కల్పించడంతో హార్దిక్ పాండ్యకు సారథ్య బాధ్యతలు దక్కాయి. ఆస్ట్రేలియాలో జరిగిన వరల్డ్‌కప్‌లో భారత్ ట్రోఫీ సాధిస్తుందని అందరూ భావించారు. కానీ కోట్లాది మంది అభిమానుల ఆశలను నీరుగార్చుతూ టీమిండియా సెమీ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, అశ్విన్, హార్దిక్ పాండ్య వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు ఉన్నా టీమిండియా వరల్డ్‌కప్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేక పోయింది.

కోహ్లి, సూర్యకుమార్ తప్పిస్తే మిగతా ఆటగాళ్లలో నిలకడ లోపించింది. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్లో జట్టుకు అవమానకర ఓటమి ఎదురైంది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు ఒక్క వికెట్ కూడా పడగొట్టలేక పోయారు. దీంతో సెమీస్‌లో ఏకంగా పది వికెట్ల తేడాతో టీమిండియాను చిత్తుగా ఓడించింది. ఈ ఓటమి తర్వాత భారత జట్టులో కీలక మార్పులు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే వరల్డ్‌కప్ మధ్యలోనే కివీస్ సిరీస్‌కు జట్టును ఎంపిక చేశారు. భవిష్యత్తు కెప్టెన్‌గా భావిస్తున్న హార్దిక్ పాండ్యకు కివీస్‌తో పోరు సవాల్‌గా మారింది. జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత అతనిపై నెలకొంది. ఐపిఎల్‌లో అసాధారణ కెప్టెన్సీతో గుజరాత్‌ను ఛాంపియన్‌గా నిలిచిన ఘనత హార్దిక్‌కు ఉంది. ఇలాంటి స్థితిలో రానున్న రోజుల్లో అతనే భారత జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.

వరల్డ్‌కప్‌లో హార్దిక్ మెరుగ్గానే రాణించడం అతనికి కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. బ్యాట్‌తో, బంతితో రాణించే సత్తా ఉన్న హార్దిక్‌కు టి20 సారథ్య బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్ ఊపందుకుంది. ఇలాంటి స్థితిలో న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్ హార్దిక్ కెప్టెన్సీకి పరీక్షగా మారింది. పటిష్టమైన కివీస్‌ను వారి సొంత గడ్డపై ఓడించడం ఏ జట్టుకైనా శక్తికి మించిన పనిగానే చెప్పొచ్చు. దీంతో హార్దిక్ జట్టును ఎలా ముందుకు నడిపిస్తాడనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. మరోవైపు సిరీస్‌లో సీనియర్లకు విశ్రాంతి కల్పించారు. వారు లేకుండానే ఈసారి టీమిండియా బరిలోకి దిగుతోంది. అయితే శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, రిషబ్ పంత్, దీపక్ హుడా వంటి యువ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. అంతేగాక ఉమ్రాన్ మాలిక్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, సిరాజ్, చాహల్ తదితరులతో బౌలింగ్ కూడా బలంగానే ఉంది. ఈ పరిస్థితుల్లో జట్టును విజయపథంలో నడిపించడం హార్దిక్‌కు పెద్ద సమస్య కాక పోవచ్చు. కానీ, ఫాస్ట్ బౌలింగ్‌కు సహకరించే కివీస్ పిచ్‌లపై పోరు మాత్రం అనుకున్నంత తేలిక కాదనే చెప్పాలి.

IND vs NZ 1st T20 Match on Nov 18

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News