Monday, January 20, 2025

సర్ఫరాజ్ హీరోచిత శతకం.. కివీస్ లక్ష్యం 107

- Advertisement -
- Advertisement -

రిషబ్ సూపర్ ఇన్నింగ్స్
తేలిపోయిన రాహుల్, జడేజా
భారమంతా బౌలర్లపైనే 
ఆసక్తికరంగా మారిన తొలి టెస్టు
బెంగళూరు: భారత్‌న్యూజిలాండ్ జట్ల మధ్య బెంగళూరు వేదికగా జరుగుతున్న తొలి టెస్టు అనూహ్య మలుపులు తిరగుతోంది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలింది. భారీ మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన న్యూజిలాండ్ అలవోక విజయం సాధించడం ఖాయమని అందరూ భావించారు. కానీ, రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు అసాధారణ పోరాట పటిమను కనబరిచారు.

కివీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ మళ్లీ మ్యాచ్‌పై పట్టు సాధించారు. కానీ శనివారం కీలక సమయంలో భారత్ వెంటవెంటనే ఏడు వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ మళ్లీ న్యూజిలాండ్ చేతిలోకి వెళ్లిపోయింది. యువ సంచలనం సర్ఫరాజ్ ఖాన్ (150) అద్భుత శతకంతో జట్టును ఆదుకున్నాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ (99) మెరుపు ఇన్నింగ్స్‌తో తనవంతు పాత్ర పోషించాడు. ఇక చివరి రోజు భారత్ 107 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుని విజయం సాధిస్తుందా లేక న్యూజిలాండ్ జయభేరి మోగిస్తుందా అనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఒక వేళ చివరి రోజు వర్షం పడితే భారత్ ఓటమిని తప్పించుకునే అవకాశాలుంటాయి.

కానీ ప్రస్తుతం పరిస్థితులను గమనిస్తే కివీస్‌కే గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరోవైపు భారత్ విజయం సాధించాలంటే బౌలర్లు అసాధారణ రీతిలో చెలరేగక తప్పదు. అశ్విన్, బుమ్రా, సిరాజ్, కుల్దీప్, జడేజా వంటి అగ్రశ్రేణి బౌలర్లు ఉన్న టీమిండియాను కూడా తక్కువ అంచనా వేయలేం. దీనికి తోడు సొంత గడ్డపై మ్యాచ్ జరుగుతుండడం కూడా ఆతిథ్య జట్టుకు కలిసి వచ్చే అంశమే. ఒకవేళ బౌలర్లు చెలరేగితే స్వల్ప లక్ష్యాన్ని సయితం కాపాడుకుని విజయం సాధించడం భారత్‌కు అసాధ్యమేమీ కాదు.

కదంతొక్కిన సర్ఫరాజఖ
ఓవర్‌నైట్ 321/3 స్కోరుతో శనివారం నాలుగో రోజు బ్యాటింగ్‌ను చేపట్టిన భారత్‌కు సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్‌లు అండగా నిలిచారు. ఇద్దరు కివీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. ఈ జోడీని విడగొట్టేందుకు ప్రత్యర్థి జట్టు బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇటు పంత్ అటు సర్ఫరాజ్ మెరుపు బ్యాటింగ్‌తో స్కోరును పరిగెత్తించారు. లంచ్ కంటే ముందు సర్ఫరాజ్ తన కెరీర్‌లో తొలి సెంచరీని పూర్తి చేశాడు. భోజన విరామ సమయానికి భారత్ స్కోరు 3 వికెట్లకు 344 పరుగులు చేసింది.

రిషబ్ చేజారిన శతకం..
లంచ్ తర్వాత కూడా భారత్ బాగానే బ్యాటింగ్ చేసింది. పంత్, సర్ఫరాజ్‌లు జాగ్రత్తగా ఆడుతూ స్కోరును ముందుకు నడిపించారు. సర్ఫరాజ్, పంత్‌లు పోటీ పడి భారీ షాట్లు కొట్టారు. అయితే 195 బంతుల్లో 18 ఫోర్లు, 3 సిక్సర్లతో 150 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో 177 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత పంత్ జోరును కొనసాగించాడు. కానీ 105 బంతుల్లో 4 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 99 పరుగులు చేసిన పంత్‌ను విలియమ్ ఓ రౌర్కీ పెవిలియన్ పంపించాడు. పంత్ ఒక పరుగు తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇక జట్టును ఆదుకుంటారని భావించిన కెఎల్ రాహుల్ (12), రవీంద్ర జడేజా (5), అశ్విన్ (15) నిరాశ పరిచారు. బుమ్రా (0), సిరాజ్ (0)లు ఖాతా తెరవకుండానే ఔటయ్యారు. దీంతో భారత్ రెండో ఇన్నింగ్స్ 99.3 ఓవర్లలో 462 పరుగుల వద్ద ముగిసింది. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, విలియమ్ ఓ రౌర్కీ మూడేసి వికెట్లను పడగొట్టారు. ఎజాజ్ పటేల్‌కు రెండు వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్‌లో 356 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించిన కివీస్‌కు మ్యాచ్‌లో విజయం కోసం 107 పరుగులే అవసరమయ్యాయి. కాగా, రెండో ఇన్నింగ్స్ చేపట్టిన న్యూజిలాండ్ 4 బంతులు ఆడగానే వర్షం మొదలైంది. దీంతో ఆటను నిలిపివేశారు. ఇదిలావుంటే భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలింది. న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 402 పరుగులు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News