ఈసారి అలవోకగా..
షమి మ్యాజిక్, సత్తా చాటిన బౌలర్లు,
రాణించిన రోహిత్, గిల్,
రెండో వన్డేలోనూ కివీస్ ఓటమి
టీమిండియాకు సిరీస్
రాయ్‌పూర్: న్యూజిలాండ్‌తో శనివారం జరిగిన రెండో వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ మరో మ్యాచ్ మిగిలివుండగానే 2-0తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 34.3 ఓవర్లలో కేవలం 108 పరుగులకే కుప్పకూలింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 20.1 ఓవర్లలోనే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. తొలి వన్డేలో చివరి వరకు భారత్‌కు గట్టి పోటీ ఇచ్చిన కివీస్ ఈసారి మాత్రం పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచింది. మరోసారి బ్యాటర్లు విఫలం కావడంతో కివీస్‌కు ఘోర పరాజయం తప్పలేదు.
ఆరంభంలోనే..
టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్‌కు తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది. ఓపెనర్ ఫిన్ అలెన్ (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. మహ్మద్ షమి తన మొదటి ఓవర్ ఐదో బంతికి అలెన్‌ను క్లిన్‌బౌల్డ్ చేశాడు. దీంతో కివీస్ సున్నాకే మొదటి వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత భారత బౌలర్లు మరింత మెరుగైన ప్రదర్శన చేశారు. వన్‌డౌన్‌లో వచ్చిన హెన్రీ నికోల్స్ (2)ను హార్దిక్ పాండ్య వెనక్కి పట్టాడు. ఆ వెంటనే డారిల్ మిఛెల్ (1) కూడా పెవిలియన్ చేరాడు. ఈ వికెట్ షమి ఖాతాలోకి వెళ్లింది. ఇక జట్టును ఆదుకుంటారని భావించిన ఓపెనర్ డెవోన్ కాన్వే (7), కెప్టెన్ టామ్ లాథమ్ (1) కూడా విఫలమయ్యారు. దీంతో న్యూజిలాండ్ 15 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను గ్లెన్ ఫిలిప్స్, తొలి వన్డే సెంచరీ హీరో బ్రాస్‌వెల్ తమపై వేసుకున్నారు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ కొద్ది సేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు.
ఈ జోడీని విడగొట్టేందుకు ఆతిథ్య టీమ్ బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అయితే నాలుగు ఫోర్లతో 22 పరుగులు చేసి ప్రమాదకరంగా కనిపించిన బ్రాస్‌వెల్‌ను షమి వెనక్కి పంపాడు. దీంతో 41 పరుగుల ఆరో వికెట్ పార్ట్‌నర్‌షిప్‌కు తెరపడింది. కానీ తర్వాత వచ్చిన సాంట్నర్‌తో కలిసి ఫిలిప్స్ తన పోరాటాన్ని కొనసాగించాడు. ఇద్దరు సమన్వయంతో ఆడుతూ స్కోరు ముందుకు తీసుకెళ్లారు. భారీ షాట్ల జోలికి వెళ్లకుండా కుదురుగా బ్యాటింగ్ చేశారు. కాగా, 3 ఫోర్లతో 27 పరుగులు చేసిన సాంట్నర్‌ను పాండ్య క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే గ్లెని ఫిలిప్స్ (36) కూడా ఔటయ్యాడు. ఈ వికెట్ సుందర్‌కు దక్కింది. తర్వాత వచ్చిన ఫెర్గూసన్ (1), టిక్నర్ (2) ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయారు. దీంతో కివీస్ ఇన్నింగ్స్ 108 పరుగుల వద్ద ముగిసింది. భారత బౌలర్లలో షమి మూడు, హార్దిక్ రెండు వికెట్లు తీశారు. సిరాజ్, సుందర్, కుల్దీప్‌లకు ఒక్కొ వికెట్ లభించింది.
రోహిత్, గిల్ దూకుడు..
తర్వాత సునాయాస లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ శుభారంభం అందించారు. ఇద్దరు కివీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 51 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో గిల్‌తో కలిసి తొలి వికెట్‌కు 72 పరుగులు జోడించాడు. కాగా విరాట్ కోహ్లి (11) మరోసారి తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. కానీ ఇషాన్ కిషన్ 8(నాటౌట్)తో కలిసి గిల్ మ్యాచ్‌ను ముగించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన గిల్ ఆరు ఫోర్లతో 40 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అద్భుత బౌలింగ్‌తో కివీస్ ఇన్నింగ్స్‌ను శాసించిన స్పీడ్‌స్టర్ షమికి మ్యాన్ ఆఫ్‌ది మ్యా అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య మూడో చివరి వన్డే మంగళవారం ఇండోర్‌లో జరుగుతుంది.