Thursday, January 23, 2025

భారత్‌కు సవాల్

- Advertisement -
- Advertisement -

హామిల్టన్: తొలి వన్డేలో ఘోర పరాజయం పాలైన టీమిండియాకు ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగే రెండో మ్యాచ్ చావోరేవోగా మారింది. సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలనే భారత్‌కు ఈ మ్యాచ్‌లో గెలుపు తప్పనిసరి. ఇందులో ఓడితే సిరీస్‌ను కోల్పోవడం ఖాయం. ఇక మొదటి వన్డేలో ఘన విజయం సాధించిన ఆతిథ్య న్యూజిలాండ్ ఈ పోరుకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఇందులో గెలిచి మరో మ్యాచ్ మిగిలివుండగానే సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. తొలి వన్డేలో కెప్టెన్ కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్ అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగడం, బౌలర్ల వైఫల్యం వల్ల భారత్‌కు ఓటమి తప్పలేదు. ఈసారి మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఆడాలనే పట్టుదలతో టీమిండియా ఉంది.

కిందటి మ్యాచ్‌లో టాపార్డర్‌తో పాటు మిడిలార్డర్ కూడా రాణించడంతో భారత్ భారీ స్కోరును సాధించింది. ఈసారి కూడా బ్యాటర్లపై జట్టు భారీ నమ్మకం పెట్టుకొంది. ఓపెనర్లు శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్‌లు తొలి వన్డేలో జట్టుకు శుభారంభం అందించారు. ఈసారి కూడా వీరి నుంచి జట్టు ఇలాంటి ఆరంభాన్నే ఆశిస్తోంది. ధావన్ జోరు మీదుండడం భారత్‌కు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. గిల్ కూడా తన బ్యాట్‌కు పనిచెబితే జట్టుకు తిరుగే ఉండదు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ కూడా తొలి వన్డేలో బ్యాట్‌తో మెరుపులు మెరిపించాడు. అతను ఈసారి కూడా రాణించాలనే పట్టుదలతో ఉన్నాడు.

అందరి కళ్లు సూర్యపైనే
ఇక తొలి వన్డేలో ఆశించని స్థాయిలో రాణించని స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్‌లో ఎలా ఆడతాడనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్‌లో సూర్యకుమార్ అసాధారణ బ్యాటింగ్‌తో పెను ప్రకపనలు సృష్టిస్తున్నాడు. సీనియర్లు రోహిత్, విరాట్, రాహుల్ లేని ఈ సిరీస్‌లో సూర్య పాత్ర మరింత పెరిగింది. ఈ మ్యాచ్‌లోనైనా అతను తన బ్యాట్‌కు పనిచెప్పాల్సిన అవసరం ఉంది. ఇక వాషింగ్టన్ సుందర్, సంజు శాంసన్‌లు కూడా తొలి వన్డేలో బాగానే ఆడారు. ఈసారి కూడా వీరి నుంచి జట్టు ఇలాంటి ప్రదర్శనే కోరుకుంటోంది. వీరిద్దరూ మరోసారి చెలరేగితే ఈ మ్యాచ్‌లో కూడా భారత్‌కు భారీ స్కోరు ఖాయం. అయితే రిషబ్ పంత్ వైఫల్యం భారత్‌ను కలవరానికి గురి చేస్తోంది. ఇప్పటికే రిషబ్‌కు పలు అవకాశాలు లభించాయి. అయినా అతను మాత్రం దాన్ని సద్వినియోగం చేసుకోలేక పోతున్నాడు. ప్రతి మ్యాచ్‌లోన తక్కువ స్కోరుకే వెనుదిరుగుతున్నాడు. కీలకమైన ఈ మ్యాచ్‌లోనైనా రిషబ్ తన బ్యాట్‌కు పని చెప్పక తప్పదు. ఈసారి కూడా విఫలమైతే రానున్న రోజుల్లో జట్టులో స్థానం నిలుపు కోవడ రిషబ్‌కు కష్టమైన అంశంగానే చెప్పాలి.

బౌలర్లు ఈసారైనా?
కిందటి మ్యాచ్‌లో బౌలర్ల వైఫల్యం భారత్‌ను వెంటాడింది. 300కి పైగా స్కోరును సాధించినా జట్టుకు ఓటమి తప్పలేదు. బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకోవడంతో గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా చేజేతులా ఓటమి పాలైంది. తొలి వన్డేలో శార్దూల్ ఠాకూర్, చాహల్, అర్ష్‌దీప్, ఉమ్రాన్ తదితరులు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. వీరి వైఫల్యం జట్టు ఓటమికి ప్రధాన కారణంగా చెప్పాలి. కీలకమైన ఈ మ్యాచ్‌లోనైనా బౌలర్లు తమ సత్తాను చాటాల్సిన అవసరం ఉంది. లేకుంటే భారత్‌కు మరోసారి చేదు ఫలితం ఖాయం.

జోరుమీదుంది..
మరోవైపు తొలి వన్డేలో చిరస్మరణీయ విజయం సాధించిన న్యూజిలాండ్ ఈ మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. కిందటి మ్యాచ్‌లో బౌలర్లు విఫలమైనా బ్యాటర్లు రాణించడంతో కివీస్ భారీ లక్ష్యాన్ని సయితం అలవోకగా ఛేదించింది. ఈసారి కూడా బ్యాటర్లపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఓపెనర్లు ఫిన్ అలెన్, కాన్వే, కెప్టెన్ కేన్ విలియమ్సన్, వికెట్ కీపర్ టామ్ లాథమ్, డారిల్ మిఛెల్, గ్లెన్ ఫిలిప్స్, సాంట్నర్ తదితరులతో కివీస్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక మిల్నె, మాట్ హెన్రీ, టిమ్ సౌథి, సాంట్నర్, ఫెర్గూసన్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు కూడా ఉండనే ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్‌లో కూడా కివీస్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

IND vs NZ 2nd ODI Match Today

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News