Friday, December 20, 2024

క్లీస్‌స్వీప్‌పై టీమిండియా కన్ను..

- Advertisement -
- Advertisement -

క్లీస్‌స్వీప్‌పై టీమిండియా కన్ను
సమరోత్సాహంతో భారత్, పరువు కోసం కివీస్
నేడు ఇండోర్‌లో చివరి వన్డే
మధ్యాహ్నం 1.30 గంటల నుంచి స్టార్ నెట్‌వర్క్‌లో..
ఇండోర్: వరుస విజయాలతో ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకున్న ఆతిథ్య టీమిండియా మంగళవారం న్యూజిలాండ్‌తో జరిగే మూడో, చివరి వన్డేకు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని తహతహలాడుతోంది. మరోవైపు ఇప్పటికే వరుసగా రెండు మ్యాచుల్లో ఓడి సిరీస్‌ను చేజార్చుకున్న న్యూజిలాండ్ కనీసం ఆఖరి వన్డేలోనైనా గెలవాలని భావిస్తోంది. కానీ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఎంతో బలంగా ఉన్న భారత్‌ను ఓడించడం కివీస్‌కు అనుకున్నంత తేలికేం కాదనే చెప్పాలి. కిందటి మ్యాచ్‌లో బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. దీంతో కివీస్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా బ్యాటర్లు మెరుగ్గా రాణిస్తేనే లాథమ్ సేనకు గెలుపు అవకాశాలుంటాయి. లేకుంటే హ్యాట్రిక్ ఓటమి ఖాయం.

జోరుమీదున్న ఓపెనర్లు
సిరీస్‌లో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లు జోరుమీదున్నారు. తొలి వన్డేలో గిల్ కళ్లు చెదిరే డబుల్ సెంచరీ సాధించాడు. రెండో వన్డేలోనూ మెరుగైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా గిల్ జట్టుకు కీలకంగా మారాడు. కెప్టెన్ రోహిత్ కూడా దూకుడు మీదున్నాడు. రెండు మ్యాచుల్లోనూ గిల్‌తో కలిసి మెరుగైన ఆరంభాన్ని అందించాడు. చివరి వన్డేలోనూ సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. గిల్, రోహిత్‌లు మరోసారి విజృంభిస్తే టీమిండియా భారీ స్కోరు కష్టమేమీ కాదు.

కోహ్లి ఈసారైనా
ఇక తొలి రెండు మ్యాచుల్లో నిరాశ పరిచిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఈ మ్యాచ్‌లో భారీ ఇన్నింగ్స్‌పై కన్నేశాడు. రానున్న ఆస్ట్రేలియా సిరీస్ నేపథ్యంలో కోహ్లి తన ఫామ్‌ను కాపాడు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కోహ్లి తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే కివీస్ బౌలర్లకు కష్టాలు తప్పవు. ఇక సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య తదితరులతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. వీరంతా ఈ మ్యాచ్‌లో రాణించి రానున్న టి20 సిరీస్‌కు మరింత ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలని భావిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి సూర్యకుమార్‌పైనే నిలిచింది.

టి20ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్న సూర్య వన్డేల్లో మాత్రం ఆ స్థాయిలో రాణించలేక పోతున్నారు. సూర్యకుమార్ ఈ మ్యాచ్‌లోనైనా చెలరేగాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇదిలావుంటే బౌలింగ్‌లో భారత్ చాలా బలంగా ఉంది. సిరాజ్, షమిలు అసాధారణ బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నారు. ఈ మ్యాచ్‌లో కూడా సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నారు. హార్దిక్, కుల్దీప్, శార్దూల్, వాషింగ్టర్‌లు కూడా జోరుమీదున్నారు. ఇలా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా భారత్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

గెలుపు కోసం..
మరోవైపు వరుస ఓటములతో సతమతమవుతున్న న్యూజిలాండ్ కనీసం చివరి వన్డేలోనైనా గెలవాలని భావిస్తోంది. తొలి వన్డేలో చివరి వరకు గట్టి పోటీ ఇచ్చిన కివీస్ రెండో మ్యాచ్‌లో మాత్రం పూర్తిగా చేతులెత్తేసింది. బ్యాటింగ్ వైఫల్యం జట్టును వెంటాడుతోంది. ఈ మ్యాచ్‌లోనైనా బ్యాటర్లు మెరుగ్గా రాణించక తప్పదు. కాన్వే, అలెన్‌లు తమ స్థాయికి తగ్గ బ్యాటింగ్ కనబరచలేక పోతున్నారు. కెప్టెన్ లాథమ్ కూడా విఫలమవుతున్నాడు. సాంట్నర్, బ్రాస్‌వెల్, ఫిలిప్స్‌లు మాత్రమే మెరుగ్గా రాణిస్తున్నారు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా కీలక బ్యాటర్లందరూ రాణిస్తేనే కివీస్‌కు గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News