Monday, January 20, 2025

రోహిత్, గిల్ సెంచరీల మోత.. టీమిండియా క్లీన్ స్వీప్

- Advertisement -
- Advertisement -

టీమిండియా క్లీన్ స్వీప్
కదంతొక్కన రోహిత్, గిల్, కాన్వే శతకం వృథా
చివరి వన్డేలోనూ కివీస్ చిత్తు, భారత్ ఘన విజయం
ఇండోర్: న్యూజిలాండ్‌తో జరిగిన మూడో, చివరి వన్డేలో టీమిండియా 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో సిరీస్‌ను భారత్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 386 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన న్యూజిలాండ్ 41.2 ఓవర్లలో 295 పరుగులకే కుప్పకూలింది. కివీస్ టీమ్‌లో ఓపెనర్ డెవొన్ కాన్వే శతకం సాధించినా ఫలితం లేకుండా పోయింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టులో ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లు శతకాలు సాధించారు. దీంతో టీమిండియా మరోసారి భారీ స్కోరును సాధించింది.

కదంతొక్కిన రోహిత్, గిల్
టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌కు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మలు శుభారంభం అందించారు. ఇద్దరు ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ స్కోరును పరిగెత్తించారు. ఈ జోడీని విడగొట్టేందుకు కివీస్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇటు రోహిత్, అటు గిల్ చెలరేగి ఆడడంతో స్కోరు వేగంగా పరిగెత్తింది. అద్భుత ఫామ్‌లో ఉన్న గిల్ ఈసారి కూడా అదే జోరును కొనసాగించాడు. కివీస్ బౌలర్లను హడలెత్తిస్తూ పరుగుల వరద పారించాడు. కెప్టెన్ రోహిత్ కూడా తన మార్క్ బ్యాటింగ్‌తో అలరించాడు. ధాటిగా ఆడిన రోహిత్ 85 బంతుల్లోనే 9 ఫోర్లు, మరో ఆరు సిక్సర్లతో 101 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వన్డేలో శతకాన్ని అందుకున్నాడు.

అంతేగాక గిల్‌తో కలిసి తొలి వికెట్‌కు 212 పరుగులు జోడించాడు. మరోవైపు శుభ్‌మన్ గిల్ కూడా శతకాన్ని నమోదు చేశాడు. చెలరేగి ఆడిన గిల్ 78 బంతుల్లోనే 5 భారీ సిక్స్‌లు, 13 బౌండరీలతో 112 పరుగులు చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కోహ్లి 36 పరుగులు సాధించాడు. చివరల్లో హార్దిక్ పాండ్య (54), శార్దూల్ ఠాకూర్ (25) మెరుగ్గా బ్యాటింగ్ చేయడంతో భారత్ స్కోరు 385 పరుగులకు చేరింది.

కాన్వే ఒంటరి పోరాటం..
తర్వాత భారీ లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు రెండో బంతికే షాక్ తగిలింది. ఓపెనర్ ఫిన్ అలెన్(0)ను హార్దిక్ పాండ్య క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన నికోల్స్‌తో కలిసి కాన్వే పోరాటం కొనసాగించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన నికోల్స్ 3 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 42 పరుగులు చేశాడు. మరోవైపు అసాధారణ పోరాట పటిమను కనబరిచిన కాన్వే 100 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్సర్లతో 138 పరుగులు సాధించాడు. మిగతావారిలో మిఛెల్ సాంట్నర్ (34), డారిల్ మిఛెల్ (24), బ్రాస్‌వెల్ (36) మాత్రమే రాణించారు. భారత బౌలర్లలో కుల్దీప్, శార్దూల్ మూడేసి వికెట్లు పడగొట్టారు. ఇక, సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News