Monday, December 23, 2024

66 పరుగులకే కివీస్ ఆలౌట్.. భారత్ రికార్డు విజయం

- Advertisement -
- Advertisement -

భారత్‌దే సిరీస్
కదంతొక్కిన శుభ్‌మన్, హార్దిక్ ఆల్‌రౌండ్‌షో
చివరి టి20లో కివీస్ చిత్తు
టీమిండియా రికార్డు విజయం
అహ్మదాబాద్: న్యూజిలాండ్‌తో జరిగిన మూడో, చివరి టి20 మ్యాచ్‌లో ఆతిథ్య భారత జట్టు 168 పరుగుల తేడాతో రికార్డు విజయం సాధించింది. ఈ గెలుపుతో టీమిండియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 21తో సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోరును సాధించింది. తర్వాత లక్షఛేదనకు దిగిన న్యూజిలాండ్ 12.1 ఓవర్లలో కేవలం 66 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కివీస్ టీమ్‌లో ఇద్దరు మాత్రమే రెండంకెలా స్కోరును అందుకున్నారు. మిగతావారు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ముగ్గురు కనీసం ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరడం విశేషం. దీన్ని బట్టి మ్యాచ్‌లో భారత బౌలర్లు ఏ స్థాయిలో చెలరేగి పోయారో ఊహించుకోవచ్చు.

ఆరంభం నుంచే..
క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. తొలి ఓవర్ ఐదో బంతికే ఓపెనర్ ఫిన్ అలెన్ (3)ను హార్దిక్ ఔట్ చేశాడు. తర్వాతి ఓవరలో అర్ష్‌దీప్ రెండు వికెట్లు తీశాడు. ఓపెనర్ డెవోన్ కాన్వే (1), మార్క్ చాప్‌మాన్ (0)లను అతను వెనక్కి పంపాడు. జట్టును ఆదుకుంటారని భావించిన గ్లెన్ ఫిలిప్స్ (2), మైఖేల్ బ్రాస్‌వెల్ (8) కూడా విఫలమయ్యారు. దీంతో కివీస్ 21 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. మరోవైపు డారిల్ మిఛెల్ ఒక్కడే కాస్త పోరాటం చేశాడు. ధాటిగా ఆడిన మిఛెల్ 1 ఫోర్, మూడు సిక్సర్లతో 35 పరుగులు సాధించాడు. మిగతావారు విఫలం కావడంతో కివీస్ ఇన్నింగ్స్ 66 పరుగుల వద్దే ముగిసింది. భారత బౌలర్లలో హార్దిక్ నాలుగు, అర్ష్‌దీప్, ఉమ్రాన్ మాలిక్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

గిల్ కళ్లు చెదిరే శతకం
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ను ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అజేయ శతకంతో ఆదుకున్నాడు. తొలి రెండు మ్యాచుల్లో తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరిన గిల్ ఈసారి ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తిస్తూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. అతన్ని కట్టడి చేయడంలో కివీస్ బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన శుభ్‌మన్ 63 బంతుల్లోనే 12 ఫోర్లు, మరో ఏడు సిక్సర్లతో 126 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వన్డే సిరీస్‌లోనూ శుభ్‌మన్ ఓ శతకం, మరో డబుల్ సెంచరీని సాధించిన విషయం తెలిసిందే. తాజాగా టి20లోనూ సెంచరీతో ఆకట్టుకున్నాడు. మరోవైపు రాహుల్ త్రిపాఠి (44), సూర్యకుమార్ యాదవ్ (24), హార్దిక్ పాండ్య (30) గిల్‌కు అండగా నిలిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News