Monday, November 25, 2024

సిరీస్‌పై భారత్ కన్ను

- Advertisement -
- Advertisement -

సిరీస్‌పై భారత్ కన్ను
ఆత్మవిశ్వాసంతో కివీస్, నేడు చివరి టి20
అహ్మదాబాద్: వరుస సిరీస్‌లతో ప్రపంచ క్రికెట్‌లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న టీమిండియా మరో అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో కనిపిస్తోంది. అహ్మదాబాద్ వేదికగా బుధవారం జరిగే చివరి టి20లో న్యూజిలాండ్‌తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో నెగ్గిన కివీస్ కూడా సిరీస్‌పై కన్నేసింది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను దక్కించుకోవాలని తహతహలాడుతోంది. అయితే ఇరు జట్లను బ్యాటింగ్ సమస్య వెంటాడుతోంది. రెండో టి20లో కివీస్ నిర్ణీత ఓవర్లలో 99 పరుగులు మాత్రమే చేసింది. అయితే భారత్ కూడా బ్యాటింగ్‌లో ఇబ్బందులను ఎదుర్కొంటోంది. కివీస్ ఉంచిన స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు కూడా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఒక దశలో ఓటమి తప్పదా అనే స్థితి నుంచి తృటిలో బయటపడింది. ఇలాంటి స్థితిలో చివరి టి20 మ్యాచ్ ఇరు జట్ల బ్యాటర్లకు పరీక్షగా మారింది.

ఓపెనర్లే కీలకం..
ఈ సిరీస్‌లో భారత్‌కు మెరుగైన ఆరంభం లభించడం లేదు. రెండు మ్యాచుల్లో కూడా ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్‌లు తేలిపోయారు. జట్టుకు శుభారంభం అందించడంలో ఇద్దరు విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లోనైనా వీరు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తారా లేదా అనేది సందేహంగా మారింది. వన్డే సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి పోయిన గిల్ టి20లలో ఆ జోరును కొనసాగించలేక పోయాడు. రెండు మ్యాచుల్లోనూ విఫలమయ్యాడు. ఈసారైనా అతను తన స్థాయి తగ్గ బ్యాటింగ్‌ను కనబరుస్తాడా లేదా అనేది సందేహంగా మారింది. ఇక తొలి రెండు మ్యాచుల్లో జట్టుకు దూరంగా ఉన్న పృథ్వీషాను ఈసారి తుది జట్టులోకి ఎంపిక చేసినా ఆశ్చర్యం లేదు. ఇక వికెట్ కీపర్‌గా ఇషాన్‌నే కొనసాగించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఈసారి ఇషాన్‌పై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది.

మరోవైపు రాహుల్ త్రిపాఠి కూడా రెండు మ్యాచుల్లో విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లోనైనా అతను తన బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు సూర్యకుమార్ యాదవ్, కెప్టెన్ హార్దిక్ పాండ్య, దీపక్ హుడాలపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. రెండో టి20లో సూర్యకుమార్ చివరి క్రీజులో నిలిచి జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో కూడా అతనే జట్టుకు కీలకంగా మారాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్య కూడా జట్టును ముందుండి నడిపించాల్సి ఉంది. కిందటి మ్యాచ్‌లో హార్దిక్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో జట్టుకు అండగా నిలిచాడు. కీలకమైన చివరిటి20లో కూడా హార్దిక్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. హుడా, సుందర్ తదితరులు కూడా తమ వంతు పాత్ర పోషిస్తే భారత్‌కు భారీ స్కోరు ఖాయం.

జోరుమీదున్న బౌలర్లు..
మరోవైపు రెండో టి20లో భారత బౌలర్లు అసాధారణ బౌలింగ్‌తో చెలరేగి పోయారు. స్పిన్నర్లతో పాటు ఫాస్ట్ బౌలర్లు కూడా మెరుగ్గా బౌలింగ్ చేశారు. ఈసారి కూడా బౌలర్లపై భారీ అంచనాలే ఉన్నాయి. చాహల్, కుల్దీప్, సుందర్‌లతో స్పిన్ విభాగం పటిష్టంగా ఉంది. అంతేగాక అర్ష్‌దీప్, శివమ్ మావి, హార్దిక్‌లతో ఫాస్ట్ బౌలింగ్ కూడా పటిష్టంగానే కనిపిస్తోంది. ఇలా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉన్న భారత్‌కే సిరీస్ అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.

గెలుపే లక్షంగా..
ఇప్పటికే వన్డే సిరీస్‌ను కోల్పోయిన పర్యాటక న్యూజిలాండ్ టీమ్ కనీసం టి20లలోనైనా విజయం సాధించాలని భావిస్తోంది. ఇప్పటికే తొలి టి20లో గెలిచి సిరీస్‌లో సమంగా నిలిచింది. కీలకమైన మూడో టి20లోనూ విజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని తహతహలాడుతోంది. కివీస్‌ను కూడా బ్యాటింగ్ ఇబ్బందులు వెంటాడుతున్నాయి. కీలక ఆటగాళ్లు తమ స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచలేక పోతున్నారు. ఫిన్ అలెన్, చాప్‌మన్, ఫిలిప్స్, డారిల్ మిఛెల్, మైఖేల్ బ్రాస్‌వెల్, సాంట్నర్, ఐష్ సోధి వంటి ప్రతిభావంతులైన బ్యాటర్లు జట్టులో ఉన్నారు. అయితే వీరిలో నిలకడ లోపించడం జట్టుకు ప్రతికూలంగా మారింది. కీలకమైన ఈ మ్యాచ్‌లోనైనా వీరంతా సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది. అప్పుడే కివీస్‌కు గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News