Monday, December 23, 2024

సిరీస్‌పై భారత్ కన్ను

- Advertisement -
- Advertisement -

సిరీస్‌పై భారత్ కన్ను
కివీస్‌కు పరీక్ష, నేడు చివరి టి20
నేపియర్:రెండో టి20లో ఘన విజయం సాధించిన టీమిండియా మంగళవారం న్యూజిలాండ్‌తో జరిగే చివరి పోరుకు ఆత్మ విశ్వాసంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలనే పట్టుదలతో భారత్ కనిపిస్తోంది. మరోవైపు తొలి టి20 ఘోర పరాజయం పాలైన ఆతిథ్య న్యూజిలాండ్‌కు ఈ మ్యాచ్ చావోరేవోగా తయారైంది. సిరీస్‌ను డ్రా చేయాలంటే కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి కివీస్‌కు నెలకొంది. అయితే కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. దీంత కివీస్‌కు మరింత ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. రెండో టి20లో విలియమ్సన్ ఒక్కడే రాణించిన విషయం తెలిసిందే.

జోరుమీదున్నాడు..
ఇక ఈ మ్యాచ్‌లో భారత్ ఆశలన్నీ డాషింగ్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌పైనే నిలిచాయి. కిందటి మ్యాచ్‌లో సూర్యకుమార్ విధ్వంసక సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. ఈసారి కూడా అతని నుంచి జట్టు ఇలాంటి ఇన్నింగ్‌నే ఆశిస్తోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన సూర్యకుమార్ విజృంభిస్తే భారత్‌కు తిరుగే ఉండదు. మరోవైపు ఓపెనర్లు రిషబ్ పంత్, ఇషాన్ కిషన్‌లు కూడా జట్టుకు కీలకమనే చెప్పాలి. రెండో టి20లో రిషబ్ పంత్ విఫలమయ్యాడు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా అతను తన బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఉంది.

ఇక ఇషాన్ కిషన్ కిందటి మ్యాచ్‌లో కాస్త బాగానే ఆడాడు. అయితే మ్యాచ్‌లో మరింత మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచాల్సిన బాధ్యత అతనిపై ఉంది. కెప్టెన్ హార్దిక్ పాండ్య, దీపక్ హుడా తదితరులు కూడా బ్యాట్‌కు పని చెప్పక తప్పదు. రెండో టి20లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తిగా విఫలమైన వాషింగ్టన్ సుందర్‌ను ఈసారి ఛాన్స్ ఇస్తారా లేదా అనేది సందేహంగా మారింది. అతని స్థాయంలో శ్రేయస్ అయ్యర్ లేదా ఉమ్రాన్ మాలిక్‌ను ఆడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు బౌలింగ్‌లోనూ టీమిండియా బలంగా ఉంది. భువనేశ్వర్ కుమార్, సిరాజ్, చాహల్, అర్ష్‌దీప్, దీపక్ హుడా వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు జట్టులో ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

సవాల్ వంటిదే
మరోవైపు ఆతిథ్య న్యూజిలాండ్‌కు ఈ మ్యాచ్ సవాల్‌గా మారింది. సిరీస్ కోల్పోకుండా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో గెలవడం తప్ప మరో మార్గం కనిపించడం లేదు. రెగ్యూలర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ లేకుండా ఈ మ్యాచ్‌లో కివీస్ బరిలోకి దిగుతోంది. కిందటి మ్యాచ్‌లో బౌలర్లు, బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లోనైనా వీరు తమ స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచాల్సిన అవసరం ఉంది. రెండు విభాగాల్లో ఆట తీరు మెరుగైతేనే కివీస్‌కు ఈ మ్యాచ్‌లో గెలుపు అవకాశాలుంటాయి. ఇక ఫిన్ అలెన్, ఫిలిప్స్, కాన్వే, డారిల్ మిఛేల్, నిషమ్, సాంట్నర్, చాప్‌మన్, బ్రెస్‌వెల్ వంటి మ్యాచ్ విన్నర్ బ్యాటర్లు జట్టులో ఉన్నారు. అంతేగాక కిందటి మ్యాచ్‌లో హ్యాట్రిక్‌తో అలరించిన టిమ్ సౌథి వంటి అగ్రశ్రేణి బౌలర్ టిమ్ సౌథి కూడా ఉండనే ఉన్నాడు. దీంతో కివీస్‌ను తక్కువ అంచనా వేసే పరిస్థితి. ఇరు జట్లలోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉండడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగడం ఖాయం.

IND vs NZ 3rd T20 Match Today

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News