Sunday, December 22, 2024

ఇలా ఆడితే కష్టమే..

- Advertisement -
- Advertisement -

టీమిండియా తీరు మారాల్సిందే!

మన తెలంగాణ/ క్రీడా విభాగం: సొంత గడ్డపై భారత్‌ను ఓడించడం ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా వంటి పెద్ద జట్లకే సాధ్యం కాదు. సుదీర్ఘ కాలంగా స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లలో టీమిండియా కళ్లు చెదిరే విజయాలను సాధించింది. భారత గడ్డపై అడుగు పెట్టిన ప్రతి జట్టు సిరీస్‌ను కోల్పోవడం అనవాయితీగా వస్తోంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, శ్రీలంక తదితర దేశాలు భారత్‌లో పర్యటించి టెస్టుల్లో ఘోర పరాజయాలను చవిచూశాయి. కానీ న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో మాత్రం భారత్ పూర్తిగా తేలిపోయింది. బెంగళూరులో జరిగిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలింది. యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, సర్ఫరాజ్, విరాట్ కోహ్లి, రాహుల్, జడేజా, రిషబ్, అశ్విన్ వంటి స్టార్ ఆటగాళ్లు జట్టులో ఉన్నా టీమిండియా 46 పరుగులకే ఆలౌట్ కావడం ఊహకందని విషయమే.

త్వరలో ఆస్ట్రేలియా గడ్డపై ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఉన్న నేపథ్యంలో భారత్ ఇలాంటి ప్రదర్శన చేయడం ఆందోళన కలిగించే అంశమే. స్వదేశంలో భారీ స్కోర్లు సాధించడం భారత్‌కు అలవాటుగా మారింది. అంతేగాక చాలా టెస్టులను మూడు రోజుల్లోనే ముగించడం అనవాయితీగా మార్చుకుంది. కానీ న్యూజిలాండ్ సిరీస్‌లో మాత్రం ఈ రివాజు తారుమారు అయ్యింది. కివీస్ వరుసగా రెండు టెస్టుల్లో భారత్‌ను చిత్తుగా ఓడించింది. అంతేగాక తన టెస్టు చరిత్రలోనే తొలిసారి భారత గడ్డపై సిరీస్‌ను గెలిచి చరిత్ర సృష్టించింది. ఇది భారత్‌కు ఊహించని పరిణామంగా చెప్పాలి. కివీస్‌తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తుందని భావించిన టీమిండియా అనూహ్యంగా సిరీస్‌ను కోల్పోవడం నిజంగా షాక్‌కు గురి చేసే అంశమే. ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లు భారత్‌కు అందుబాటులో ఉన్నారు. ఒకేసారి కనీసం మూడు అంతర్జాతీయ జట్లను బరిలోకి దించేతా బలం జట్టుకు ఉంది. అయినా సొంత గడ్డపై భారత్ ఓ అనామక జట్టు చేతిలో సిరీస్‌ను కోల్పోవడం ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఈ ఫలితం టీమిండియాను తీవ్రంగా కలవర పరిచే అంశంగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

ఆసీస్ గడ్డపై కష్టమే..

ఇక సొంత గడ్డపైనే ఘోర పరాజయం చవిచూసిన టీమిండియా త్వరలో జరిగే బోర్డర్‌గవాస్కర్ ట్రోఫీలో ఎలా ఆడుతుందనేది అందరిలోనూ ఆందోళన రేకెత్తిస్తోంది. బౌన్స్‌కు అనుకూలంగా ఉండే ఆస్ట్రేలియా పిచ్‌లపై భారత్‌కు మరిన్ని ఇబ్బందులు ఖాయంగా కనిపిస్తున్నాయి. ఐదు మ్యాచ్‌ల సిరీస్ టీమిండియాకు సవాల్ వంటిదేనని చెప్పాలి. హాజిల్‌వుడ్, కమిన్స్, స్టార్క్, లియాన్ వంటి అగ్రశ్రేణి బౌలర్లను ఎదుర్కొని ముందుకు సాగడం చాలా కష్టంతో కూడుకున్న అంశంగానే చెప్పాలి. ఇప్పటికే వరుస ఓటములపై జట్టు యాజమాన్యం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లోపాలపై దృష్టి సారించి దాన్ని సరిదిద్దడంపై దృష్టి పెట్టాలి. అంతేగాక కెప్టెన్ రోహిత్‌తో సహా సీనియర్లు కోహ్లి, అశ్విన్, జడేజా, బుమ్రాల తమ పాత్ర మరింత మెరుగ్గా పోషించాలి. అప్పుడే టీమిండియాకు ప్రయోజనంగా ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News