Monday, January 20, 2025

మరో క్లీన్‌స్వీప్‌పై భారత్ గురి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియా సొంత గడ్డపై న్యూజిలాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. తాజాగా కివీస్‌తో జరిగే సిరీస్‌లోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే లక్షంతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టీమిండియా చాలా బలంగా ఉంది. దీంతో సిరీస్‌లో రోహిత్ సేన ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఇక న్యూజిలాండ్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. ఆ జట్టులోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే క్రికెటర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. ఇరు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో సిరీస్ ఆసక్తికరంగా సాగడం ఖాయం.

ఓపెనర్లే కీలకం..

మరోవైపు ఈ మ్యాచ్‌లో టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్‌లు కీలకంగా మారారు. బంగ్లాతో జరిగిన సిరీస్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ ఆశించిన స్థాయిలో రాణించలేక పోయాడు. కానీ కీలకమైన కివీస్ సిరీస్‌లో జట్టును ముందుండి నడిపించాలని భావిస్తున్నాడు. రోహిత్ తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బంగ్లాతో పోల్చితే న్యూజిలాండ్ చాలా బలమైన జట్టు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి స్థితిలో రోహిత్ తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచక తప్పదు. ఇక యువ ఆటగాడు యశస్వి అద్భుత ఫామ్‌లో ఉండడం జట్టుకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. టెస్టుల్లోనూ యశస్వి వన్డేల తరహాలో ఆడుతున్నాడు. శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, కోహ్లి తదితరులతో కలిసి భారీ భాగస్వామ్యాలు నమోదు చేయాలని భావిస్తున్నాడు.

భారీ ఆశలతో..

ఇక న్యూజిలాండ్ కూడా భారీ ఆశలతో సిరీస్‌కు సిద్ధమైంది. ఆ జట్టులో కూడా స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. కెప్టెన్ టామ్ లాథమ్ జట్టును ముందుండి నడిపించేందుకు సిద్ధమయ్యాడు. విల్ యంగ్, డెవోన్ కాన్వే, కేన్ విలియమ్సన్, బ్రేస్‌వెల్, డారిల్ మిఛెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర వంటి స్టార్లు జట్టులో ఉన్నారు. మ్యాట్ హెన్రీ, ఎజాజ్ పటేల్, సాంట్నర్, సౌథి తదితరులతో బౌలింగ్ కూడా బలంగా ఉంది. దీంతో కివీస్‌కు కూడా గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News