ఆత్మవిశ్వాసంతో భారత్.. సమరోత్సాహంతో కివీస్
నేటి నుంచే డబ్యూటిసి ఫైనల్ పోరు
సౌతాంప్టన్: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ ప్రేమీకులు ఎంతో అతృతతో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. సుదీర్ఘ టెస్టు క్రికెట్ ప్రస్థానంలో తొలిసారి నిర్వహిస్తున్న టెస్టు ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్ సమరానికి టీమిండియా, న్యూజిలాండ్ జట్లు సిద్ధమయ్యాయి. ఇరు జట్ల మధ్య ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్ వేదికగా తుది పోరు జరుగనుంది. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో చారిత్రక విజయం సాధించిన న్యూజిలాండ్ ఈ పోరుకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఇక విరాట్ కోహ్లి సేన కూడా గెలుపే లక్షంగా బరిలోకి దిగుతోంది. రెండు జట్లలోనూ ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాట్స్‌మెన్, బౌలర్లకు కొదవలేదు. ఒక మాటలో చెప్పాలంటే దీన్ని సమవుజ్జీల సమరంగా పేర్కొనవచ్చు. ప్రపంచ క్రికెట్‌లోనే అత్యుత్తమ కెప్టెన్లుగా, బ్యాట్స్‌మెన్‌లుగా పేరు తెచ్చుకున్న విరాట్ కోహ్లి, కేన్ విలియమ్సన్ ప్రతిభకు ఈ పోరు ఒక సవాల్‌గా చెప్పొచ్చు. ఇప్పటి వరకు న్యూజిలాండ్ ఒక్క ఐసిసి ట్రోఫీని కూడా సాధించలేదు. ఈసారి ఆ లోటును పూడ్చుకోవాలని తహతహలాడుతోంది. ఇక విరాట్ కోహ్లి కూడా భారత్‌ను టెస్టు చాంపియన్‌గా నిలువాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇక ప్రపంచంలోని రెండు అత్యుత్తమ జట్ల మధ్య జరుగుతున్న చారిత్రక సమరంలో విజయం ఎవరికీ దక్కుతుందో వేచి చూడాల్సిందే.
సమష్టి పోరాటంతో..
ఇటు భారత్, అటు న్యూజిలాండ్ జట్లు అసాధారణ ఆటతో టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు దూసుకొచ్చాయి. క్లిష్టమైన సవాళ్లను సయితం అధిగమిస్తూ రెండు జట్లు తుది పోరుకు అర్హత సాధించాయి. కొవిడ్19 మహమ్మరి వేధిస్తున్న సమయంలో ఇరు జట్లు కఠినమైన బయో బడుగల్లో కష్టాలు పడుతూ ఫైనల్‌కు చేరుకున్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్లను వెనక్కినెట్టి భారత్, న్యూజిలాండ్‌లు ప్రతిష్టాత్మకమైన డబ్లూటిసి ఫైనల్‌కు అర్హత సాధించడం విశేషం. బౌలింగ్, బ్యాటింగ్, సారథ్యం విభాగంలో రెండు జట్లు దాదాపు సమానంగానే ఉన్నాయని చెప్పాలి. టీమిండియాకు విరాట్, కివీస్‌కు కేన్ విలియమ్సన్ ప్రధాన అస్త్రాలుగా ఉన్నారు. రెండు జట్లలోనూ సీనియర్, జూనియర్ ఆటగాళ్లు ఉన్నారు. టీమిండియాలో కోహ్లితో పాటు రోహిత్ శర్మ, చటేశ్వర్ పుజారా, అజింక్య రహానె, హనుమ విహారిలో ఉన్నారు. ఇక న్యూజిలాండ్‌లో కేన్‌తో పాటు టామ్ లాథమ్, వాట్లింగ్, టెలర్ వంటి సీనియర్లు ఉన్నారు. బౌలింగ్‌లో కూడా ఇరు జట్లు చాలా బలంగా ఉన్నాయి. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బౌలర్లకు రెండు జట్లలోనూ కొదవలేదు. జస్‌ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమి, ఉమేశ్ యాదవ్ వంటి అనుభవజ్ఞులైన ఫాస్ట్ బౌలర్లు టీమిండియాకు అందుబాటులో ఉన్నారు. వీరితో పాటు యువ సంచలనం సిరాజ్ ఉండనే ఉన్నాడు. ఇక స్పిన్ విభాగంలో కూడా భారత్ చాలా బలంగా ఉంది. ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్లుగా వెలుగొందుతున్న రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు భారత జట్టులో ఉన్నారు. కొంత కాలంగా ప్రపంచ క్రికెట్‌లో వీరిద్దరూ అసాధారణ రీతిలో రాణిస్తున్నారు. ఇటు బంతితో అటు బ్యాట్‌తో చెలరేగి పోతున్నారు. ఫైనల్ సమరంలో అశ్విన్, జడేజాలు బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే టీమిండియాకు ఇద్దరు నాణ్యమైన ఆల్‌రౌండర్లు సేవలు అందుబాటులో ఉంటాయి. ఇది జట్టుకు ఎంతో ఉపయోగపడే ఛాన్స్ ఉంది.
బ్యాటింగ్‌లోనూ తిరుగులేదు
మరోవైపు టీమిండియాకు బ్యాటింగే బలమనడంలో సందేహం లేదు. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లుగా పేరున్న చటేశ్వర్ పుజారా, అజింక్య రహానె, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, రోహిత్ శర్మ తదితరులు భారత్‌లో ఉన్నారు. వీరిలో ఏ ఇద్దరు రాణించినా భారీ స్కోరు కష్టమేమీ కాదు. టెస్టు క్రికెట్‌లో రహానె, పుజారాలు భారత్‌కు చాలా కీలకంగా మారారు. వీరిద్దరూ రాణిస్తే భారీ స్కోరు ఖాయంగా చెప్పొచ్చు. కోహ్లి, రోహిత్, పంత్, గిల్, అశ్విన్, జడేజాలు కూడా బ్యాట్‌తో చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక బుమ్రా, షమి, ఇషాంత్, ఉమేశ్‌లతో ఫాస్ట్ బౌలింగ్ విభాగం కూడా చాలా బలంగా ఉంది. అశ్విన్, జడేజాల రూపంలో మ్యాచ్ విన్నర్ స్పిన్నర్లు కూడా అందుబాటులో ఉన్నారు. దీంతో భారత్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
తక్కువ అంచనా వేయలేం
న్యూజిలాండ్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. ఆ జట్టులో కూడా అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌లు, బౌలర్లు ఉన్నారు. ఇటీవలే ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో విజయం సాధించడంతో కివీస్ జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. విలియమ్సన్, యంగ్, యువ సంచలనం కాన్వే, టెలర్, వాట్లింగ్, నికోల్స్, లాథమ్, మ్యాట్ హెన్రీ తదితరులతో బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. ఇక ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లుగా చెలామణి అవుతున్న ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథి, వాగ్నర్, జెమీసన్ తదితరులు కివీస్‌కు అందుబాటులో ఉన్నారు. వీరిని ఎదుర్కొవడం టీమిండియా బ్యాట్స్‌మెన్‌కు అనుకున్నంత తేలికేం కాదు. ఇలాంటి స్థితిలో న్యూజిలాండ్‌తో జరిగే పోరు విరాట్ సేనకు సవాల్ వంటిదేనని చెప్పక తప్పదు.
జట్ల వివరాలు:
భారత్: విరాట్ కోహ్లి (కెప్టెన్), అజింక్య రహానె (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, చటేశ్వర్ పుజారా, హనుమ విహారి, రిషబ్ పంత్, వృద్ధిమాన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, సిరాజ్, షమి, ఉమేశ్ యాదవ్, బుమ్రా.
న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టామ్ లాథమ్, టెలర్, డేవాన్ కాన్వే, గ్రాండోమ్, మ్యాట్ హెన్రీ, టామ్ బ్లండెల్, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, ఎజాజ్ పటేల్, టిమ్ సౌథి, ట్రెంట్ బౌల్ట్, వాట్లింగ్, నీల్ వాగ్నర్, జెమీసన్.
IND vs NZ WTC Final Match Today