సమరోత్సాహంతో భారత్
మరో సిరీస్‌పై కన్ను, నేడు సౌతాఫ్రికాతో తొలి టి20
తిరువనంతపురం: ప్రపంచకప్ ముందు జరుగుతున్న చివరి టి20 సిరీస్‌లో టీమిండియా విజయమే లక్షంగా పోరుకు సిద్ధమైంది. సొంత గడ్డపై సౌతాఫ్రికాతో భారత్ సొంత గడ్డపై మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇక ఆస్ట్రేలియా వేదికగా జరిగే వరల్డ్‌కప్‌కు ముందు భారత్ ఆడుతున్న చివరి టి20 సిరీస్ ఇదే కావడంతో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో భారత్ జయకేతనం ఎగుర వేసింది. ఇక సౌతాఫ్రికా సిరీస్‌లోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో కనిపిస్తోంది. మరోవైపు సౌతాఫ్రికా కూడా సిరీస్‌ను ప్రపంచకప్‌కు రిహార్సల్‌గా వాడుకోవాలని భావిస్తోంది. భారత్‌ను ఓడించడం ద్వారా రానున్న వరల్డ్‌కప్ మరింత ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలని భావిస్తోంది. తెంబా బవుమా సారథ్యంలోని సౌతాఫ్రికాలో ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదు. క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్, మార్‌క్రామ్, క్లాసెన్, డేవిడ్ మిల్లర్, రబడా, నోర్జే వంటి టి20 స్పెషలీస్ట్‌లు ఉన్నారు. దీంతో సిరీస్‌లో భారత్‌కు గట్టి పోటీ ఖాయంగా కనిపిస్తోంది.
ఆత్మవిశ్వాసంతో
మరోవైపు ఆతిథ్య టీమిండియా సిరీస్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ సమతూకంగా కనిపిస్తోంది. సీనియర్లు భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యలు లేకుండానే భారత్ బరిలోకి దిగుతోంది. అయితే వీరు లేకున్నా టీమిండియాలో ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు కొదవలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్‌లకు సిరీస్ కీలకంగా మారింది. రానున్న ప్రపంచకప్ నేపథ్యంలో వీరిద్దరూ తమ ఫామ్‌ను మరింత మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆస్ట్రేలియా సిరీస్‌లో ఇద్దరు బాగానే ఆడారు. రెండో టి20లో రోహిత్ మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఇక మొదటి టి20లో రాహుల్ అర్ధ సెంచరీ సాధించాడు. అయితే ఇద్దరు మిగతా రెండు మ్యాచుల్లో విఫలం కావడం కాస్త ఆందోళన కలిగించే అంశమే.
అందరికళ్లు కోహ్లిపైనే
ఇక సిరీస్‌లో టీమిండియా ఆశలన్నీ సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లిపైనే నిలిచాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవల జరిగిన ఆసియాకప్‌లో కోహ్లి అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగి పోయాడు. అంతేగాక ఉప్పల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టి20లోనూ సత్తా చాటాడు. ఇక రానున్న ప్రపంచకప్ నేపథ్యంలో సిరీస్‌ను తనకు అనుకూలంగా మార్చుకోవాలని కోహ్లి భావిస్తున్నాడు. కోహ్లి తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే దక్షిణాఫ్రికా బౌలర్లకు ఇబ్బందులు ఖాయం. మరోవైపు సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌లో ఉండడం భారత్‌కు అతి పెద్ద ఊరటగా చెప్పాలి. ఈ సిరీస్‌లో సూర్య జట్టుకు చాలా కీలకంగా మారాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లో అతను మెరుపు బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. సౌతాఫ్రికాపై కూడా అదే జోరును కొనసాగించాలని జట్టు యాజమాన్యం కోరుకుంటుంది. ఇక రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్ తదితరులతో బ్యాటింగ్ బలంగా ఉంది. అంతేగాక బుమ్రా, చాహల్, అక్షర్, అర్ష్‌దీప్‌లతో కూడిన బలమైన బౌలింగ్ కూడా భారత్‌కు ఉన్న సంగతి మరచి పోకూడదు. అయితే హర్షల్ పటేల్ భారీగా పరుగులు సమర్పించుకోవడం మాత్రం జట్టుకు ప్రతికూల పరిణామంగా చెప్పాలి. ఈ సిరీస్‌లోనైనా హర్షల్ తన బౌలింగ్‌ను మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే టీమిండియాకు ఈ సిరీస్‌లోనూ బౌలింగ్ కష్టాలు తప్పక పోవచ్చు.
భారీ ఆశలతో
కాగా, పర్యాటక సౌతాఫ్రికా కూడా సిరీస్‌లో భారీ ఆశలతో బరిలోకి దిగుతోంది. భారత్ వంటి బలమైన జట్టును ఓడించడం ద్వారా రానున్న వరల్డ్‌కప్‌కు మరింత ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలని భావిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సౌతాఫ్రికా బలంగా ఉంది. అంతేగాక జట్టులోని పలువురు ఆటగాళ్లకు భారత పిచ్‌లపై మంచి అనుభవం ఉంది. ఇది కూడా వారికి కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. ఈ సిరీస్‌లో డికాక్, బవుమా, క్లాసెన్, రబడా, కేశమ్ మహారాజ్, నోర్జే సౌతాఫ్రికాకు కీలకంగా మారారు. వీరిలో ఏ ఇద్దరు రాణించినా భారత్‌ను ఓడించడం దక్షిణాఫ్రికాకు అసాధ్యమేమీ కాదు. అయితే సొంత గడ్డపై భారత్‌పై విజయం సాధించడం ఎంత పెద్ద జట్టుకైనా చాలా క్లిష్టమైన అంశమే. ఇలాంటి స్థితిలో సౌతాఫ్రికా సిరీస్‌లో ఎలా ఆడుతుందో బరిలోకి దిగితే కానీ చెప్పలేం.
IND vs SA 1st T20 Match Today in Thiruvananthapuram