Monday, January 27, 2025

నేడు భారత్-సౌతాఫ్రికా మూడో టీ20

- Advertisement -
- Advertisement -

సెంచూరియన్: భారత్‌సౌతాఫ్రికా జట్ల మధ్య బుధవారం కీలక పోరు జరుగనుంది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు చెరో విజయం సాధించి 11తో సమంగా నిలిచాయి. సెంచూరియన్ వేదికగా జరిగే మూడో టి20లో గెలిచి సిరీస్‌లో ఆధిక్యాన్ని అందుకోవాలనే లక్షంతో రెండు జట్లు ఉన్నాయి. తొలి టి20లో భారత్ జయకేతనం ఎగుర వేయగా, రెండో టి20లో ఆతిథ్య సౌతాఫ్రికా జట్టు విజయం సాధించింది. దీంతో మూడో టి20 ఇరు జట్లకు కీలకంగా మారింది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బౌలర్లు, బ్యాటర్లు ఇరు జట్లకు అందుబాటులో ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్ ఆసక్తికరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.

అభిషేక్ ఈసారైనా..
వరుసగా రెండు మ్యాచుల్లో విఫలమైన యువ ఓపెనర్ అభిషేక్ శర్మ కనీసం ఈ మ్యాచ్‌లోనైనా మెరుగ్గా రాణించాల్సిన అవసరం ఉంది. తొలి రెండు టి20లలో అభిషేక్ ఘోర వైఫల్యం చవిచూశాడు. ఇక మొదటి టి20లో కళ్లు చెదిరే శతకం సాధించిన సంజు శాంసన్ రెండో మ్యాచ్‌లో ఖాతా తెరవడంలో విఫలమయ్యాడు. ఇలాంటి స్థితిలో సంజు కూడా ఈ మ్యాచ్‌లో తన బ్యాట్‌కు పనిచెప్పక తప్పదు. రెండో మ్యాచ్‌లో భారత్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. మూడో టి20లోనైనా భారీ స్కోరు సాధించక తప్పదు. ఓపెనర్లు శుభారంభం అందిస్తే తర్వాత వచ్చే బ్యాటర్లు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడే అవకాశం ఉంటుంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా రెండో టి20లో నిరాశ పరిచాడు. ఈసారి మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా భారీ ఇన్నింగ్స్ ఆడాలనే పట్టుదలతో ఉన్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన సూర్యకుమార్ చెలరేగితే భారత్‌కు ఎదురే ఉండదు.

హార్దిక్ పాండ్య, రింకు సింగ్, అక్షర్ పటేల్ తదితరులు కూడా తమ తమ బ్యాట్‌లకు పని చెప్పక తప్పదు. రింకు సింగ్‌పై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. అయితే అతను మాత్రం రెండు మ్యాచుల్లోనూ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక పోయాడు. కీలకమైన మూడో టి20లోనైనా అతను రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హార్దిక్ పాండ్య కూడా తన బ్యాట్‌ను ఝులిపించక తప్పదు. రెండో టి20లో హార్దిక్ ధాటిగా ఆడలేక పోయాడు. అతని బ్యాటింగ్ నత్తను తలపించింది. హార్దిక్ తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగాల్సి ఉంది. అక్షర్ పటేల్ కూడా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచక తప్పదు. బౌలింగ్‌లో మాత్రం భారత్ బాగానే రాణిస్తోంది. వరుణ్ చక్రవర్తి అద్భుత బౌలింగ్‌తో అలరిస్తున్నాడు. రెండో టి20లో వరుణ్ అసాధారణ బౌలింగ్‌ను కనబరిచాడు. అర్ష్‌దీప్, రవిబిష్ణోయ్, అక్షర్ తదితరులతో భారత బౌలింగ్ చాలా బలంగా ఉంది. సమష్టిగా రాణిస్తే ఈ మ్యాచ్‌లో గెలవడం టీమిండియాకు కష్లమేమీ కాదు.

జోరుమీదున్న సఫారీ..
రెండో టి20లో అద్భుత విజయం సాధించిన సౌతాఫ్రికా ఈ పోరుకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకెళ్లాలనే పట్టుదలతో ఉంది. అయితే బ్యాటింగ్ వైఫల్యం సౌతాఫ్రికాకు అతి పెద్ద సమస్యగా మారింది. రెండు మ్యాచుల్లో సఫారీ బ్యాటర్లు తడబడ్డారు. ఈసారి మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ముందుకు సాగాలనే పట్టుదలతో ఉన్నారు. బౌలర్లు కూడా జోరుమీదున్నారు. దీంతో ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికాకు గెలుపు అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News