రసవత్తరంగా చివరి టెస్టు.. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 57/2
చెలరేగిన బుమ్రా, సౌతాఫ్రికా 210 ఆలౌట్
కేప్‌టౌన్: సౌతాఫ్రికాభారత్‌ల మధ్య జరుగుతున్న మూడో చివరి టెస్టు రసవత్తరంగా మారింది. ఆతిథ్య సౌతాఫ్రికాను భారత బౌలర్లు తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగులకే పరిమితం చేశారు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 57/2తో నిలిచింది. ఇప్పటి వరకు భారత్‌కు 70 పరుగుల ఆధిక్యం లభించింది. ఓపెనర్లు రాహుల్ (10), మయాంక్ అగర్వాల్ (7) మరోసారి విఫలమయ్యారు. అయితే కెప్టెన్ కోహ్లి (14), పుజారా (9) మరో వికెట్ కోల్పోకుండా ఆటను ముగించారు. ఇక బుధవారం రెండో రోజు బౌలర్ల హవా నడిచింది. మంగళవారం మొదటి రోజు భారత్‌ను సౌతాఫ్రికా బౌలర్లు 223 పరుగులకే పరిమితం చేశారు. ఇక 17/1 ఓవర్‌నైట్ స్కోరుతో ఆటను తిరిగి ఆరంభించిన దక్షిణాఫ్రికాను భారత బౌలర్లు హడలెత్తించారు. ప్రమాదకర ఆటగాడు ఐడెన్ మార్‌క్రామ్‌ను బుమ్రా అద్భుత బంతితో క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో సౌతాఫ్రికా 17 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఇక నైట్ వాచ్‌మన్ కేశవ్ మహారాజ్ కొద్ది సేపు ధాటిగా ఆడాడు. అయితే 4 ఫోర్లతో 25 పరుగులు చేసిన మహారాజ్‌ను ఉమేశ్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో దక్షిణాఫ్రికా 45 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.
పీటర్సన్ పోరాటం..
ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను పీటర్సన్ తనపై వేసుకున్నాడు. అతనికి వండర్ డుసెన్ అండగా నిలిచాడు. ఇద్దరు కలిసి కుదురుగా ఆడుతూ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఈ జోడీని విడగొట్టేందుకు భారత బౌలర్లు చాలా సేపటి వరకు ఎదురు చూడాల్సి వచ్చింది. అయితే ప్రమాకరంగా మారిన డుసెన్‌ను ఉమేశ్ వెనక్కి పంపాడు. దీంతో 67 పరుగుల నాలుగో వికెట్ పార్ట్‌నర్‌షిప్‌కు తెరపడింది. తర్వాత వచ్చిన బవుమా కూడా కుదురుగా ఆడాడు. అతని అండతో పీటర్సన్ తన పోరాటాన్ని కొనసాగించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన బవుమా మూడు ఫోర్లతో 28 పరుగులు చేసి షమి బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ వెంటనే వికెట్ కీపర్ వెరినెను కూడా షమి ఔట్ చేశాడు. వెరినె ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. కొద్ది సేపటికే మార్కొ జాన్‌సెన్ (7) కూడా ఔటయ్యాడు. ఇక ఒంటరి పోరాటం చేసిన కీగన్ పీటర్సన్ 166 బంతుల్లో 9 ఫోర్లతో 72 పరుగులు చేసి ఔటయ్యాడు. రబాడ (15), ఎంగిడి(3) జట్టుకు అండగా నిలువలేక పోయారు. దీంతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 76.3 ఓవర్లలో 210 పరుగుల వద్ద ముగిసింది. భారత బౌలర్లలో బుమ్రా 42 పరుగులకే ఐదు వికెట్లు పడగొట్టాడు. షమి, ఉమేశ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.
IND vs SA 3rd Test: India stumps at 57/2